జొమాటో చేతికి పేటీఎం టికెట్‌ బుకింగ్‌ వ్యాపారం?

ఆహారాన్ని డెలివరీ చేసే ఫుడ్‌టెక్‌ సంస్థ జొమాటో, పేటీఎంకు చెందిన సినిమాలు, ఈవెంట్ల టిక్కెట్ల బుకింగ్‌ విభాగాన్ని కొనుగోలు చేసే యత్నాలు చేస్తోంది.

Updated : 18 Jun 2024 03:30 IST

ప్రాథమిక చర్చలు నిజమేనని ధ్రువీకరించిన సంస్థలు

ముంబయి: ఆహారాన్ని డెలివరీ చేసే ఫుడ్‌టెక్‌ సంస్థ జొమాటో, పేటీఎంకు చెందిన సినిమాలు, ఈవెంట్ల టిక్కెట్ల బుకింగ్‌ విభాగాన్ని కొనుగోలు చేసే యత్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్రాథమికస్థాయి చర్చలు జరిపినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు జొమాటో, పేటీఎం సమాచారం ఇచ్చాయి. పేటీఎం మూవీ టికెట్స్‌ విభాగాన్ని జొమాటో రూ.1,600-1,750 కోట్లకు కొనుగోలు చేస్తోందంటూ వచ్చిన కథనాలపై ఇరు సంస్థలూ స్పందించాయి. ‘పేటీఎం మూవీ టిక్కెట్‌ విభాగాన్ని కొనుగోలు చేసేందుకు చర్చిస్తున్నాం. తుది నిర్ణయం తీసుకోలేదు. చట్ట పరిధిలో, బోర్డు అనుమతికి లోబడి తదుపరి చర్యలు ఉంటాయి’ అని జొమాటో బీఎస్‌ఈకి సమాచారం ఇచ్చింది. కంపెనీ వృద్ధి కోసం వ్యూహాత్మకంగా వ్యాపారాలను విస్తరించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది కంపెనీ కీలక వ్యాపారాలకు అనుగుణంగానే ఉందని వివరించింది. మా దృష్టి డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవలపైనే ఉంటుందని పేటీఎం పేర్కొంది. ప్రస్తుతం జరిగిన చర్చలు పూర్తిగా ప్రాథమికమైనవేనని, ఎలాంటి ఒప్పందాలూ లేవని స్పష్టం చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆంక్షల నేపథ్యంలో, పేటీఎం కు ఆదాయం తగ్గినందున ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు టికెట్‌ విక్రయ విభాగాన్ని విక్రయించనుందనే వార్తలు ఆసక్తి రేపాయి. రెండు నెలలుగా వినియోగదారులు, వ్యాపార భాగస్వాములకు సంబంధించి స్థిరంగా వృద్ధి లభిస్తున్నందున, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి పేటీఎం కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

పేటీఎం నుంచి టికెట్‌ విభాగ కొనుగోలు సాకారమైతే, జొమాటో ఈ వ్యాపారంలో మరింత విస్తరించేందుకు వీలవుతుందని పేర్కొంటున్నారు. 2021లో బ్లింకిట్‌ కొనుగోలు తర్వాత, ఈ సంస్థకు రెండో అతి పెద్ద కొనుగోలు అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు