30 కంపెనీలు.. రూ.50000 కోట్ల లక్ష్యం

వచ్చే 3-4 నెలల్లో ప్రాథమిక మార్కెట్‌లో కొన్ని పెద్ద కంపెనీల తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓలు) సందడి చేయబోతున్నాయి.

Published : 18 Jun 2024 03:35 IST

రాబోయే నెలల్లో ఐపీఓల జోరు

దిల్లీ: వచ్చే 3-4 నెలల్లో ప్రాథమిక మార్కెట్‌లో కొన్ని పెద్ద కంపెనీల తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓలు) సందడి చేయబోతున్నాయి. దాదాపు 30కి పైగా కంపెనీలు, ఐపీఓల ద్వారా రూ.50,000 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. ఇందులో 24 కంపెనీల సమీకరణ లక్ష్యం రూ.30,000 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. ‘రాబోయే నెలల్లో ఐపీఓల జోరు మరింత పెరగనుంది. మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారం చేబట్టడంతో మదుపర్ల విశ్వాసం బలపడింది’ అని, అందుకే కంపెనీలు ఐపీఓలపై దృష్టి సారించాయని పంతోమత్‌ క్యాపిటల్‌ ఎండీ మహవీర్‌ లునావత్‌ పేర్కొన్నారు.

  • వచ్చే కొన్ని నెలల్లో ఐపీఓలకు సిద్ధమవుతున్న కంపెనీల్లో ఓలా ఎలక్ట్రిక్, ఫస్ట్‌ క్రై, వారీ ఎనర్జీస్, ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, బన్సల్‌ వైర్‌ ఇండస్ట్రీస్, ఎన్‌ఎస్‌డీఎల్, ఆఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆశీర్వాద్‌ మైక్రోఫైనాన్స్, వన్‌ మొబిక్విక్‌ సిస్టమ్స్, ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్, అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలర్స్, శివ ఫార్మాకెమ్, స్టాన్లీ లైఫ్‌స్టైల్స్‌ ఉన్నాయి. 
  • దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్‌ అనుబంధ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా, రేఖా ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు ఉన్న బజార్‌ స్టైల్‌ రిటైల్, స్విగ్గీ, హల్దీరామ్స్‌ వంటి పెద్ద కంపెనీలు రాబోయే 4-5 నెలల్లో ఐపీఓల ద్వారా భారీగా నిధులు సమీకరించే యోచన చేస్తున్నాయి. ఇప్పటికే రూ.25000 కోట్ల సమీకరణ నిమిత్తం మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ వద్ద హ్యుందాయ్‌ ఇండియా ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. 
  • స్నాక్స్‌ తయారీ సంస్థ హల్దీరామ్స్‌ కూడా ఐపీఓ యత్నాల్లో ఉంది. విదేశీ పెట్టుబడిదార్లకు వాటా విక్రయ ప్రణాళికలు రద్దు కావడంతో, నిధుల సమీకరణకు ఈ కంపెనీ ఐపీఓ వైపు చూస్తోంది. ఈ ఏడాది మార్చిలో బజార్‌ స్టైల్‌ రిటైల్‌ ఐపీఓకు దరఖాస్తు చేసుకుంది. ఐపీఓలో భాగంగా రూ.185 కోట్ల విలువైన తాజా షేర్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 1.68 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదార్లు విక్రయించనున్నారు.
  • రూ.10,400 కోట్ల ఐపీఓకు స్విగ్గీ బోర్డు ఆమోదం తెలిపింది. రూ.3,750 కోట్ల తాజా షేర్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో రూ.6,664 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదార్లు విక్రయించనున్నారు. 
  • ఓలా ఎలక్ట్రిక్‌ రూ.5500 కోట్ల ఐపీఓకు ఈ నెలలో సెబీ అనుమతి ఇచ్చింది. దేశంలో విద్యుత్‌ వాహన అంకుర సంస్థ, ఐపీఓకు వస్తుండటం ఇదే తొలిసారి. ఐపీఓ కోసం కంపెనీ విలువను రూ.50,000 కోట్లుగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. 
  • సాలిడ్‌ సర్ఫేస్‌ తయారీ సంస్థ డర్లాక్స్‌ టాప్‌ సర్ఫేస్‌ ఎస్‌ఎంఈ ఐపీఓ ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.65- 68ను నిర్ణయించారు. రిటైల్‌ మదుపర్లు కనీసం 2000 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఐపీఓ తర్వాత కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై నమోదవుతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని