లాభాలొచ్చినా.. పరిమితంగానే

ఈ వారం సూచీలు రాణిస్తాయని, అయితే లాభాలు పరిమితంగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Published : 18 Jun 2024 03:38 IST

అన్ని రంగాలకు సానుకూలతలే
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

ఈ వారం సూచీలు రాణిస్తాయని, అయితే లాభాలు పరిమితంగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ దిద్దుబాటు వచ్చినా.. కొనుగోళ్లకు అవకాశంగా భావించాలని సూచిస్తున్నారు. కేంద్రంలో కీలక శాఖలను గతంలో నిర్వహించిన వారికే కేటాయించినందున, ప్రభుత్వ విధానాలు యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. బక్రీద్‌ సందర్భంగా సోమవారం మార్కెట్లు పని చేయనందున, ఈ వారం ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం కానుంది. సూచీలు రికార్డు గరిష్ఠాల వద్ద ఉండటంతో లాభాల స్వీకరణకూ అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను జులైలో పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. అప్పటివరకు సూచీలకు అధిక స్థాయుల్లో ఒత్తిడి కనిపించొచ్చని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచీ మన సూచీలు సంకేతాలు తీసుకోవచ్చు. నిఫ్టీకి తక్షణ మద్దతు 23,200 వద్ద, నిరోధం 23,500 వద్ద కనిపిస్తున్నాయి. ఒకవేళ 23,500 పాయింట్ల పైకి చేరితే 23,800-23,900 పాయింట్లకు చేరొచ్చని అంటున్నారు. ఈ ఏడాదిలో ఒకసారి రేట్ల కోత ఉండొచ్చని యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలిచ్చింది. దీన్ని అనుసరించి మన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కూడా కీలక రేట్లను తగ్గించొచ్చని అంచనా వేస్తున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

  • టెలికాం కంపెనీల షేర్లు రాణించొచ్చు. భారతీ ఎయిర్‌టెల్‌ రూ.1,500-1,550కు చేరొచ్చు. వొడాఫోన్‌ ఐడియా రూ.18-19 స్థాయికి వెళ్లొచ్చని అంచనా.
  • ఔషధ కంపెనీల షేర్లు వరుసగా మూడో వారమూ లాభాలను పంచొచ్చు. సన్‌ ఫార్మా, లారస్‌ ల్యాబ్స్, లుపిన్‌ కంపెనీలు బులిష్‌ ధోరణిలో ట్రేడవవచ్చు.
  • లోహ కంపెనీల షేర్లు స్వల్ప శ్రేణిలో కదలాడొచ్చు. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు ఉన్నా, దేశీయంగా సానుకూలతలు ఉండటం కలిసిరావొచ్చు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరును పరిశీలించాలని ఓ బ్రోకరేజీ  అంటోంది.
  • ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు. సానుకూల వర్షపాతం, గ్రామీణ గిరాకీపై అంచనాలు, ముడి చమురు ధరల క్షీణత ఈ రంగానికి కలిసిరావొచ్చు.
  • యంత్రపరికరాల షేర్లు రాణించొచ్చు. గత విధానాలనే ప్రభుత్వం కొనసాగిస్తుండటంతో ఈ రంగ కంపెనీలు ప్రయోజనం పొందొచ్చు. మూలధన వ్యయాలపై ప్రభుత్వం దృష్టి సారించడంతో, ఈ రంగ షేర్లు సానుకూలంగా కనిపిస్తున్నాయి.
  • సిమెంటు కంపెనీల షేర్లు ఒక శ్రేణిలోనే చలించొచ్చు. సిమెంటు ధరలు స్వల్పంగా పెరిగినా, వర్షాకాలం అయినందున గిరాకీ మందగిస్తుంది కనుక, ఆ ప్రభావం ఉండకపోవచ్చు. పెన్నా సిమెంట్‌ను కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్‌ షేర్లను పరిశీలించొచ్చు.
  • మార్కెట్‌తో పాటే వాహన కంపెనీల షేర్లు సానుకూల ధోరణిలో ట్రేడవవచ్చు. సాధారణ వర్షపాతంపై అంచనాలు, సమీప భవిష్యత్‌లో రేట్ల కోతపై ఆశలు కలిసి ఈ రంగంపై మదుపర్లు ఆసక్తి చూపొచ్చు. 26,200 పాయింట్ల దిశగా ఆటో సూచీ పయనించొచ్చు. ఈ సూచీకి 25,000 పాయింట్ల వద్ద మద్దతు ఉంది.
  • బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్‌ వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు రాణించే అవకాశం ఉంది. ముడి చమురు ధరలు తగ్గడం, ప్రభుత్వం తన విధానాలను కొనసాగించడంతో ఈ రంగ షేర్లకు కలిసి రావొచ్చు.
  • 50,000 పాయింట్ల పైన ముగిసినందున, నిఫ్టీ బ్యాంక్‌పై సానుకూలంగా ఉన్నారు. ఈ సూచీకి 48,500 వద్ద మద్దతు, 52,000 వద్ద నిరోధం కనిపిస్తున్నాయి. 50,200 పాయింట్లను మించితే సులభంగానే 52,000 పాయింట్లకు చేరే అవకాశం ఉందని ఓ బ్రోకరేజీ సంస్థ అంటోంది.
  • ఐటీ షేర్ల ధరలు పరిమిత శ్రేణికి పరిమితం కావచ్చు. స్వల్పకాలంలో నిఫ్టీ ఐటీ సూచీ 35,400 పాయింట్లను మించితేనే సానుకూలతలుంటాయి. 34,100 పాయింట్ల వద్ద మద్దతు లభించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని