సంక్షిప్త వార్తలు (5)

మొబైల్‌ టవర్ల సంస్థ ఇండస్‌ టవర్స్‌లో తమకున్న 21.5% వాటాలో 9.94 శాతాన్ని ఈనెల 19న (బుధవారం) వొడాఫోన్‌ పీఎల్‌సీ విక్రయించనుంది. తద్వారా 1.1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.9000 కోట్లు) సమీకరించనుంది.

Published : 19 Jun 2024 02:32 IST

నేడు ఇండస్‌ టవర్స్‌లో వాటా విక్రయించనున్న వొడాఫోన్‌  

ముంబయి: మొబైల్‌ టవర్ల సంస్థ ఇండస్‌ టవర్స్‌లో తమకున్న 21.5% వాటాలో 9.94 శాతాన్ని ఈనెల 19న (బుధవారం) వొడాఫోన్‌ పీఎల్‌సీ విక్రయించనుంది. తద్వారా 1.1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.9000 కోట్లు) సమీకరించనుంది. ప్రస్తుత షేరు ధర రూ.343.90 కంటే 10% తక్కువకు, బ్లాక్‌ డీల్‌ ద్వారా ఈ విక్రయం జరిగే అవకాశం ఉంది. రూ.310-314 శ్రేణిలో 26.8 కోట్ల షేర్లను వొడాఫోన్‌ విక్రయించొచ్చని తెలుస్తోంది. ఈ లావాదేవీకి బ్రోకర్లుగా మోర్గాన్‌ స్టాన్లీ, బోఫా సెక్యూరిటీస్, జెఫ్రీస్, బీఎన్‌పీ పరిబాస్‌ ఉన్నాయి. ఈ పరిణామంపై వొడాఫోన్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు స్పందించలేదు.  


స్టవ్‌క్రాఫ్ట్‌ నుంచి విద్యుత్తు కుక్కర్‌

హైదరాబాద్‌: గృహోపకరణాల తయారీ సంస్థ స్టవ్‌క్రాప్ట్‌ ‘ఎలెక్ట్రా’ పేరుతో విద్యుత్తు ప్రెజర్‌ కుక్కర్‌ను పీజియన్‌ బ్రాండుపై విడుదల చేసింది. వంటను మరింత సౌకర్యవంతంగా, సమర్థంగా, సురక్షితంగా మార్చేలా దీనిని తయారు చేసినట్లు స్టవ్‌క్రాఫ్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేంద్ర గాంధీ తెలిపారు. వినియోగదార్లకు ‘నో మానిటరింగ్‌ ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ‘ఆటో ఆఫ్‌ ఫీచర్‌’తో మరింత భద్రత తోడవుతుందన్నారు. విజిల్‌ శబ్దం లేకుండా ఇది పనిచేస్తుందని, అందువల్ల సంప్రదాయ ప్రెజర్‌ కుక్కర్‌తో కలుగుతున్న ఇబ్బందులు దీనిని వాడుతున్నప్పుడు ఉండవని వివరించారు. ‘డిలే ఫంక్షన్‌’ ప్రత్యేకతతో రుచి, తాజాదనం విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేకుండా, కావాల్సినప్పుడు వంట పూర్తయ్యేలా సమయాన్ని వినియోగదారు నిర్దేశించవచ్చని తెలిపారు.


గ్లాండ్‌ ఫార్మాలో ఫోసన్‌ 5 శాతం వాటా విక్రయం!

హైదరాబాద్‌: గ్లాండ్‌ ఫార్మాలో 82 లక్షల షేర్లను (సంస్థలో 5% వాటాకు సమానం) చైనా సంస్థ ఫోసన్‌ ఫార్మా ఇండస్ట్రియల్‌ విక్రయించనుంది. గ్లాండ్‌ ఫార్మా షేరు మంగళవారం బీఎస్‌ఈలో రూ.1838.50 ధర పలికింది. మార్కెట్‌ ధర కంటే 5% తక్కువకే ఈ షేర్లను విక్రయించేందుకు ఫోసన్‌ ఫార్మా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గ్లాండ్‌ ఫార్మాలో ఫోసన్‌కు ప్రస్తుతం 58% వాటా ఉంది. అందువల్ల 5% వాటా విక్రయించాక కూడా, మెజార్టీ వాటా ఫోసన్‌ దగ్గరే ఉంటుంది. బ్లాక్‌డీల్‌లో విక్రయించనున్న షేర్ల ధర దాదాపు రూ.1433 కోట్ల వరకు ఉండనున్నట్లు సమాచారం. 


దిల్లీ విమానాశ్రయంలో 30 సెకన్లలోనే చెక్‌-ఇన్‌ సదుపాయం  

ముంబయి: దిల్లీ విమానాశ్రయంలో చెక్‌-ఇన్‌ సామగ్రి ప్రక్రియను మరింత త్వరగా పూర్తిచేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (డయల్‌) తెలిపింది. ఇందుకోసం స్వయం-సేవ యంత్రాంగాన్ని (సెల్ఫ్‌-సర్వీస్‌ మెకానిజమ్‌) తీసుకొచ్చినట్లు మంగళవారం వెల్లడించింది. ప్రయాణికులు తమ లగేజీని అందించేందుకు, ట్యాగ్‌లను సేకరించడానికి, బోర్డింగ్‌ పాస్‌లను వేగంగా ప్రింట్‌ చేయడానికి ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఈ సరికొత్త వన్‌-స్టెప్‌ క్విక్‌ బ్యాగేజీ డ్రాప్‌ సొల్యూషన్‌తో చెక్‌-ఇన్‌ ప్రక్రియను 1 నిమిషం నుంచి 30 సెకన్లకు తగ్గించగలమని  డయల్‌ తెలిపింది. ఈ సదుపాయం దేశంలోనే తొలిసారిగా దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఏర్పాటైంది. అంతర్జాతీయంగా చూస్తే కెనడాలోని టొరంటో విమానాశ్రయం తర్వాత ఇక్కడే ఈ తరహా సదుపాయాన్ని కల్పించామంది. కొత్త వ్యవస్థ కోసం విమానాశ్రయం టెర్మినల్‌ 1, టెర్మినల్‌ 3 వద్ద 50 సెల్ఫ్‌-సర్వీస్‌ బ్యాగ్‌ డ్రాప్‌ (ఎస్‌ఎస్‌బీడీ) యూనిట్లను అమర్చారు. ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాల్లో ప్రయాణించే వారికి ఈ యూనిట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని డయల్‌ వెల్లడించింది.


భారత్‌లో గూగుల్‌ జెమినీ యాప్‌

దిల్లీ: భారత్‌లో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్ల కోసం కృత్రిమ మేధ (ఏఐ) అసిస్టెంట్‌ ‘జెమినీ’ని యాప్‌ రూపంలో తీసుకొచ్చినట్లు గూగుల్‌ మంగళవారం ప్రకటించింది. ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 8 భారతీయ భాషల్లో జెమినీ యాప్‌ లభించనుంది. ఐఫోన్‌ వినియోగదారులు గూగుల్‌ యాప్‌ ద్వారా జెమినీ సేవలు వచ్చే కొన్ని వారాల్లో అందుబాటులోకి వస్తాయని జెమినీ ఎక్స్‌పీరియెన్సెస్‌ ఉపాధ్యక్షుడు (ఇంజినీరింగ్‌) అమర్‌ సుబ్రమణ్య తెలిపారు. గూగుల్‌ తీసుకొచ్చిన ఏఐ అసిస్టెంట్‌ జెమినీతో విద్యార్థుల నుంచి డెవలపర్ల వరకు తమ ఉత్పాదకత, నైపుణ్యాలు, సృజనాత్మకత పెంచుకోవచ్చని వెల్లడించారు. గూగుల్‌ కొత్త తరం ఏఐ మోడల్‌ ‘జెమినీ 1.5 ప్రో’ ఫీచర్లను భారత వినియోగదారులు పొందే సౌలభ్యం ఉందన్నారు. ఇందులో భాగంగా వినియోగదారులు తమ సందేహాల నివృతి కోసం పెద్ద డాక్యుమెంట్‌లను అప్‌లోడ్‌ చేయొచ్చు. ఈ పత్రాలను చాలా గోప్యంగా జెమినీ ఉంచుతుందని సుబ్రమణ్య స్పష్టం చేశారు. కొన్ని ఎంపిక చేసిన పరికరాల్లో గూగుల్‌ మెసేజెస్‌లో జెమినీ ఫీచర్‌ను జోడించనున్నట్లు గూగుల్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని