2026లో దేశీయ తయారీ ఎయిర్‌బస్‌ హెలికాప్టర్‌

భారతదేశంలో తమ హెలికాప్టర్లను రూపొందించేందుకు తుది అసెంబ్లింగ్‌ లైన్‌ను ఎక్కడ నెలకొల్పేదీ టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ భాగస్వామ్యంతో నిర్ణయిస్తామని ఎయిర్‌బస్‌ హెలికాప్టర్స్‌ ప్రకటించింది.

Published : 19 Jun 2024 02:34 IST

ముంబయి: భారతదేశంలో తమ హెలికాప్టర్లను రూపొందించేందుకు తుది అసెంబ్లింగ్‌ లైన్‌ను ఎక్కడ నెలకొల్పేదీ టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ భాగస్వామ్యంతో నిర్ణయిస్తామని ఎయిర్‌బస్‌ హెలికాప్టర్స్‌ ప్రకటించింది. 2026లో దేశీయ తయారీ హెలికాప్టర్‌ను ఆవిష్కరించాలన్నది తమ ప్రణాళికగా సంస్థ పేర్కొంది. దేశీయ ఇంధన రంగ సంస్థల రవాణా అవసరాల కోసం హెచ్‌145 హెలికాప్టర్‌ను ఎయిర్‌బస్‌ హెలికాప్టర్స్‌ మంగళవారం విడుదల చేసిన సందర్భంగా ఈ వివరాలను సంస్థ దక్షిణాసియా చీఫ్‌ సన్ని గుగ్లానీ తెలిపారు. మనదేశంలో చమురు, గ్యాస్‌ రంగ సంస్థలకు ఆఫ్‌షోర్, ఆన్‌షోర్‌ హెలికాప్టర్‌ సర్వీసులను అందిస్తున్న హెలిగో చార్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీపీఎల్‌) సహకారంతో ఎయిర్‌బస్‌ దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఆఫ్‌షోర్‌ ప్రాంతాలకు ఓఎన్‌జీసీ సిబ్బందిని, సామగ్రిని చేరవేసేందుకు హెచ్‌145 హెలికాప్టర్లను హెచ్‌సీపీఎల్‌ ఉపయోగించనుంది. ట్విన్‌ ఇంజిన్‌ రోటర్‌క్రాఫ్ట్‌ శ్రేణికి చెందిన హెచ్‌145 హెలికాప్టర్లను ఎత్తైన ప్రదేశాలు, అధిక ఉష్ణోగ్రత పరిస్థితుల్లోనూ సమర్థంగా పనిచేసేలా రూపొందించారు. కేబిన్‌ను పలు అవసరాలకు వాడుకునేలా తీర్చిదిద్దామని ఎయిర్‌బస్‌ హెలికాప్టర్స్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని