మ్యాగీ వినియోగంలో నంబర్‌ 1.. కిట్‌క్యాట్‌ విపణుల్లో నంబర్‌ 2

అంతర్జాతీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థ నెస్లే ఉత్పత్తి చేస్తున్న ఇన్‌స్టంట్‌ నూడుల్స్, సూప్‌ బ్రాండ్‌ ‘మ్యాగీ’ అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే అత్యధికంగా జరుగుతున్నాయి. చాక్‌లెట్‌ వేఫర్‌ బ్రాండు కిట్‌కాట్‌ విక్రయాల్లో ద్వితీయస్థానం భారత్‌దేనని.. నెస్లే అనుబంధ నెస్లే ఇండియా తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది.

Published : 19 Jun 2024 02:36 IST

భారత్‌ మాకు ఎంతోముఖ్యం: నెస్లే

దిల్లీ: అంతర్జాతీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థ నెస్లే ఉత్పత్తి చేస్తున్న ఇన్‌స్టంట్‌ నూడుల్స్, సూప్‌ బ్రాండ్‌ ‘మ్యాగీ’ అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే అత్యధికంగా జరుగుతున్నాయి. చాక్‌లెట్‌ వేఫర్‌ బ్రాండు కిట్‌కాట్‌ విక్రయాల్లో ద్వితీయస్థానం భారత్‌దేనని.. నెస్లే అనుబంధ నెస్లే ఇండియా తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. భారత్‌ విక్రయాల్లో వృద్ధి రెండంకెల స్థాయిలో ఉన్నందున, నెస్లేకు అత్యంత కీలక విపణిగా మారిందనీ పేర్కొంది. అత్యధికులకు ఉత్పత్తులు అందుబాటులో తేవడం, ఉత్పత్తులో అత్యుత్తమ నాణ్యత, వినూత్న ఆవిష్కరణలతో పాటు క్రమశిక్షణతో కూడిన వనరుల వినియోగం వంటివి తమ వ్యాపారం రాణించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని సంస్థ తెలిపింది. 2023-24 వార్షిక నివేదికలోని మరిన్ని వివరాలు ఇలా.. 

  • భారత్‌లో నెస్లే మ్యాగీ బ్రాండ్‌పై నూడుల్స్, రెడీ టు ఈట్‌ ఉత్పత్తులు, వంట మసాలాలు, సాస్‌లు విక్రయిస్తోంది. 2023-24లో 600 కోట్ల ఉత్పత్తులను మ్యాగీ బ్రాండుపై విక్రయించింది. ఓట్స్‌ నూడుల్స్, కొరియన్‌ నూడుల్స్‌తో పాటు రూ.10 ధరకే వివిధ రకాల మసాలాలను మ్యాగీ బ్రాండ్‌పై మార్కెట్లోకి విడుదల చేసింది. 
  • 420 కోట్ల యూనిట్ల కిట్‌క్యాట్‌ను దేశీయంగా విక్రయించింది. కొత్త తరహా ఉత్పత్తులు, పంపిణీ నెట్‌వర్క్‌ విస్తరణ, వినూత్నంగా బ్రాండు ప్రచారం ఇందుకు దోహదం చేశాయని సంస్థ తెలిపింది. 

2015లో 5 నెలల నిషేధం: పరిమితికి మించి సీసం పరిమాణం ఉందన్న ఆరోపణలపై మనదేశంలో, 2015లో మ్యాగీ నూడుల్స్‌పై 5 నెలల పాటు నిషేధం అమలైంది. తిరిగి 2015 నవంబరులో నూడుల్స్‌ అమ్మకాలను అనుమతించారు. తదుపరి ఇతర ఆహార పదార్థాల విభాగంలోకీ మ్యాగీ బ్రాండ్‌ విస్తరించింది. మ్యాగీ ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌పై నిషేధానికి ముందు, ఈ విభాగంలో నెస్లేకు 70% మార్కెట్‌ ఉండేది. ప్రస్తుతం ఇంకా ఆ స్థాయికి తిరిగి పుంజుకోలేదు. కొత్త సంస్థల రాకతో పోటీ తీవ్రంగా ఉండటం ఇందుకు కారణం. 

  • భారత్‌లో 10వ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడం ద్వారా, భారత విపణికి తాము ఇస్తున్న ప్రాధాన్యతను నెస్లే పునరుద్ఘాటించింది. సుస్థిర వృద్ధి, వినూత్నతపై దృష్టి సారించడంతో పాటు కొత్త ప్లాంట్ల ఏర్పాటు, ప్రస్తుత ప్లాంట్ల సామర్థ్య విస్తరణ కోసం 2020 నుంచి 2025 మధ్య సుమారు రూ.7,500 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు సెస్లే ఇండియా ఛైర్మన్, ఎండీ సురేశ్‌ నారాయణ్‌ తెలిపారు. 
  • మాతృసంస్థ నెస్లే ఎస్‌ఏకు రాయల్టీ పెంచాలన్న ప్రతిపాదనను మదుపర్లు తిరస్కరించారు. ఫలితంగా ప్రస్తుత స్థాయిలోనే 4.5% రాయల్టీ చెల్లించేందుకు బోర్డు ఇటీవల ఆమోదం తెలిపింది. దీనికీ వాటాదార్ల అనుమతి తీసుకోవాల్సి ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని