2024-25లో భారత వృద్ధి 7.2%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత వృద్ధి రేటు 7.2 శాతానికి చేరొచ్చని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. వినియోగదారు విశ్వాసం పెరగడంతో వ్యయాలు అధికమవడం, పెట్టుబడులు కూడా వృద్ధి చెందడమే ఇందుకు కారణమని పేర్కొంది.

Updated : 19 Jun 2024 02:39 IST

అంచనాలు పెంచిన ఫిచ్‌

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత వృద్ధి రేటు 7.2 శాతానికి చేరొచ్చని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. వినియోగదారు విశ్వాసం పెరగడంతో వ్యయాలు అధికమవడం, పెట్టుబడులు కూడా వృద్ధి చెందడమే ఇందుకు కారణమని పేర్కొంది. దేశ వృద్ధిరేటు 7 శాతంగా ఉంటుందని ఈ సంస్థ మార్చిలో అంచనా వేయగా, ప్రస్తుతం 7.2 శాతానికి పెంచింది. ఈ ఏడాది ఆఖరుకు ద్రవ్యోల్బణం 4.5 శాతానికి దిగి రావొచ్చని, దీంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి తీసుకొస్తుందని జూన్‌ నెలకు సంబంధించిన ‘గ్లోబల్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ రిపోర్ట్‌’లో ఫిచ్‌ పేర్కొంది. 2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాల్లో దేశ వృద్ధిరేటు వరుసగా 6.5%, 6.2 శాతంగా నమోదు కావొచ్చని ఫిచ్‌ అంచనా వేసింది. ఈ నెల ప్రారంభంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2024-25లో మన దేశ ఆర్థిక వృద్ధి 7.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసిన సంగతి విదితమే. గ్రామీణ గిరాకీ పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం కలిసొచ్చే అంశాలని కేంద్ర బ్యాంక్‌ పేర్కొంది. 

2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే.  రిటైల్‌ ద్రవ్యోల్బణం విషయానికొస్తే ఈ ఏడాది మేలో 4.75 శాతానికి దిగొచ్చింది. ఇది ఏడాది కనిష్ఠ స్థాయి కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని