77000 ఎగువన ముగిసిన సెన్సెక్స్‌

దేశీయ సూచీల రికార్డు జోరు కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్‌ వంటి దిగ్గజ షేర్లు రాణించడంతో మంగళవారం సెన్సెక్స్‌ తొలిసారిగా 77,000 పాయింట్ల ఎగువన ముగిసింది. నిఫ్టీ 23,500 పాయింట్లను అధిగమించింది.

Published : 19 Jun 2024 02:41 IST

మదుపర్ల సంపద రూ.437 లక్షల కోట్లకు
సమీక్ష

దేశీయ సూచీల రికార్డు జోరు కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్‌ వంటి దిగ్గజ షేర్లు రాణించడంతో మంగళవారం సెన్సెక్స్‌ తొలిసారిగా 77,000 పాయింట్ల ఎగువన ముగిసింది. నిఫ్టీ 23,500 పాయింట్లను అధిగమించింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలపడి 83.43 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 84 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌ మినహా మిగతావి లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

  • మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ జీవనకాల గరిష్ఠమైన రూ.437.24 లక్షల కోట్ల (దాదాపు 5.24 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది. గత 4 రోజుల్లో మదుపర్ల సంపద రూ.10.29 లక్షల కోట్లు పెరిగింది. మంగళవారం ఒక్కరోజే రూ.2.34 లక్షల కోట్ల లాభాన్ని మదుపర్లు పొందారు.
  • సెన్సెక్స్‌ ఉదయం 77,235 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ, 77,366.77 పాయింట్ల వద్ద తాజా గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 308.37 పాయింట్ల లాభంతో 77,301.14 వద్ద ముగిసింది. నిఫ్టీ 92.30 పాయింట్లు రాణించి   23,557.90 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 23,579.05 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది. 
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 22 పరుగులు తీశాయి. పవర్‌గ్రిడ్‌ 3.17%, విప్రో 3.04%, టైటన్‌ 1.74%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.56%, ఎం అండ్‌ ఎం 1.14%, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.86%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.71%, ఇన్ఫోసిస్‌ 0.61% లాభపడ్డాయి. మారుతీ 2.14%, టాటా స్టీల్‌ 1.04%, అల్ట్రాటెక్‌ 0.96%, టాటా మోటార్స్‌ 0.78% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. స్థిరాస్తి 2.11%, యుటిలిటీస్‌ 1.05%, టెలికాం 1%, వినియోగ 0.90%, బ్యాంకింగ్‌ 0.83%, సేవలు 0.74%, యంత్ర పరికరాలు 0.73% మెరిశాయి. వాహన, లోహ, చమురు-గ్యాస్‌ పడ్డాయి. బీఎస్‌ఈలో 2167 షేర్లు లాభపడగా, 1836 స్క్రిప్‌లు నష్టపోయాయి. 147 షేర్లలో ఎటువంటి మార్పులేదు.
  • మెరిసిన ఇక్సిగో షేరు: ట్రావెల్‌ బుకింగ్‌ సంస్థ ఇక్సిగోను నిర్వహించే లీ ట్రావెన్యూస్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ షేరు అరంగేట్రంలో మెరిసింది. ఇష్యూ ధర రూ.93తో పోలిస్తే, బీఎస్‌ఈలో షేరు 45.16% లాభంతో రూ.135 వద్ద ప్రారంభమైంది. అనంతరం 74.18% దూసుకెళ్లి రూ.161.99 వద్ద గరిష్ఠాన్ని తాకి, అక్కడే ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.6,275.87 కోట్లుగా నమోదైంది.
  • హైదరాబాద్, ముంబయిల్లో గణనీయమైన ఆర్డర్లను తమ బిల్డింగ్స్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌ విభాగం అందుకుందని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. కంపెనీ రూ.1000- 2500 కోట్ల విలువ కలిగిన వాటిని గణనీయమైన ఆర్డర్లుగా పరిగణిస్తుంది. 
  • ప్రైవేట్‌ రంగ ధనలక్ష్మీ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా అజిత్‌ కుమార్‌ కేకే నియమితులయ్యారు. ఈనెల 20న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు.
  • వ్యాపార వృద్ధి కోసం నాన్‌ కన్వెర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ) ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతి ఇచ్చిందని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. 
  • బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఆక్మే ఫిన్‌ట్రేడ్‌ (ఇండియా), ఐపీఓకు ముందు యాంకర్‌ మదుపర్ల నుంచి రూ.38 కోట్లు సమీకరించింది. కంపెనీ ఐపీఓ ఈనెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ధరల శ్రేణిగా రూ.114- 120ను నిర్ణయించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని