సంక్షిప్త వార్తలు(7)

కోటక్‌ మహీంద్రా బ్యాంకుకు చెందిన సాధారణ బీమా సంస్థ కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 70% వాటాను రూ.5,560 కోట్లకు స్విట్జర్లాండ్‌ బీమా కంపెనీ జ్యూరిచ్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేసింది.

Published : 20 Jun 2024 02:49 IST

కోటక్‌ జనరల్‌లో జ్యూరిచ్‌కు 70% వాటా
విలువ రూ.5,560 కోట్లు


దిల్లీ: కోటక్‌ మహీంద్రా బ్యాంకుకు చెందిన సాధారణ బీమా సంస్థ కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 70% వాటాను రూ.5,560 కోట్లకు స్విట్జర్లాండ్‌ బీమా కంపెనీ జ్యూరిచ్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేసింది. దేశీయ సాధారణ బీమా రంగంలోకి ఇప్పటివరకు వచ్చిన అత్యధిక విదేశీ పెట్టుబడి ఇదే. బీమా సంస్థల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితిని 2021లో 49% నుంచి 74 శాతానికి పెంచాక, దేశంలోకి అడుగుపెట్టిన మొదటి విదేశీ సంస్థ జ్యూరిచ్‌ ఇన్సూరెన్సే. ఈ లావాదేవీ నేపథ్యంలో 2024 జూన్‌ 18 నుంచి కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఉండదు. కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 30% వాటాను కోటక్‌ మహీంద్రా బ్యాంకు కలిగి ఉంటుంది. ఈ కొనుగోలు తర్వాత కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ పేరును జ్యూరిచ్‌ కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌గా మార్చినట్లు జ్యూరిచ్‌ ఇన్సూరెన్స్‌ వెల్లడించింది. జ్యూరిచ్‌ ఇన్సూరెన్స్‌ 200లకు పైగా దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పలు విభాగాల్లో బీమా ఉత్పత్తులను అందిస్తున్న దిగ్గజ బీమా సంస్థల్లో ఇదీ ఒకటి. 


ఒమేగా హాస్పిటల్స్‌లో మోర్గాన్‌ స్టాన్లీ రూ.500 కోట్ల పెట్టుబడి

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని క్యాన్సర్‌ వైద్య సేవల సంస్థ అయిన ఒమేగా హాస్పిటల్స్‌లో మోర్గాన్‌ స్టాన్లీ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) ఏషియా రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఒమేగా హాస్పిటల్స్‌ విస్తరణ ప్రణాళికలు అమలు చేయడానికి ఈ నిధులు వెచ్చిస్తారు. సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ మోహన్‌ వంశీ సారథ్యంలోని ఈ హాస్పిటల్స్‌కు 1400 వైద్య పడకలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో క్యాన్సర్‌ వైద్య సేవలను విస్తరించాలనే ఆలోచన ఈ సంస్థకు ఉంది. మోర్గాన్‌ స్టాన్లీ ప్రైవేట్‌ ఈక్విటీ భాగస్వామ్యంతో, ఈ విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తామని ఒమేగా హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మోహన్‌ వంశీ వివరించారు. హైదరాబాద్‌లోని  గచ్చీబౌలిలో 450 పడకల ఆసుపత్రిని ఈ సంస్థ ఇటీవల ప్రారంభించింది. గత ఏడాదిలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో మరొక ఆస్పత్రి ఏర్పాటు చేసింది. ‘సింగిల్‌ స్పెషాలిటీ’ హాస్పిటళ్లకు వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్నందునే ఒమేగా హాస్పిటల్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు మోర్గాన్‌ స్టాన్లీ పీఈ ఏషియా ఎండీ అర్జున్‌ సైగల్‌ వెల్లడించారు. క్యాన్సర్‌ హాస్పిటళ్ల విభాగంలో గత ఏడాది కాలంలో ఇది మా రెండో పెట్టుబడి అని తెలిపారు.


టాటా వాణిజ్య వాహన ధరలు 2% వరకు పెంపు 

దిల్లీ: వాణిజ్య వాహన ధరలను జులై 1 నుంచి 2% వరకు పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. పెరిగిన ముడి సరుకు వ్యయాల భారాన్ని తగ్గించుకునేందుకే వాహన ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. వాణిజ్య వాహన మోడళ్లు అన్నింటికీ ధరల పెంపు వర్తిస్తుందని.. మోడల్, వేరియంట్‌ ఆధారంగా ధరల పెంపులో వ్యత్యాసం ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కూడా వాణిజ్య వాహన ధరలను 2% వరకు కంపెనీ పెంచిన సంగతి విదితమే.


4% ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించే పనిలో ఉన్నాం
ఆర్‌బీఐ తాజా బులెటిన్‌

ముంబయి: ఆహార వస్తువుల ధరలు అధికంగా ఉన్నంతవరకు, రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యమైన 4 శాతానికి తెచ్చే ప్రక్రియ కొనసాగుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా బులెటిన్‌లో పేర్కొంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం నెమ్మదిగా తగ్గుతోందని.. ఆహార ధరల వల్లే ఇది పూర్తిగా అదుపులోకి రావడం లేదని ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఎకానమీ’ వ్యాసంలో వెల్లడించింది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైకేల్‌ దేబబ్రాత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ వ్యాసాన్ని వెలువరించింది. 2024 మొదటి త్రైమాసికంలో అంతర్జాతీయ వృద్ధి మెరుగ్గానే ఉందని, చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం తగ్గడంతో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపు దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, మొదటి త్రైమాసికంలో మన వాస్తవిక జీడీపీ వృద్ధి స్థిరంగా ఉందనే సంకేతాలున్నాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ముందే రావడంతో వ్యవసాయ రంగ భవిష్యత్తు అంచనాలు ఆశాజనకంగా కనిపిస్తున్నట్లు వివరించింది. ఆర్‌బీఐ రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (2% మార్జిన్‌)గా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసమే ఈ నెల ప్రారంభంలో జరిగిన ద్రవ్యపరపతి విధాన సమీక్షలోనూ కీలక రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. 2024-25 వృద్ధి అంచనాలను 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచింది.


ఇంధన పరివర్తన సూచీలో భారత్‌కు 63వ స్థానం: డబ్ల్యూఈఎఫ్‌

దిల్లీ: అంతర్జాతీయంగా ఇంధన పరివర్తన సూచీలో భారత్‌కు 63వ ర్యాంక్‌ లభించిందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) బుధవారం వెల్లడించింది. ఇంధన వాటా, భద్రత, స్థిరత్వం (సస్టెయినబిలిటీ)లో దేశం గణనీయమైన అభివృద్ధిని కనబరిచిందని డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. ఈ సూచీలో ఐరోపా ఖండంలోని పలు దేశాలు అగ్ర స్థానాలు దక్కించుకున్నాయి. స్వీడన్‌ అగ్రస్థానంలో నిలవగా, తరవాతి స్థానాల్లో డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌ ఉన్నాయి. చైనా 20వ ర్యాంకు సాధించింది. భారత్, చైనా, బ్రెజిల్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల స్థానం, ఇంధన పరివర్తనలో గత ఏడాదితో పోలిస్తే మెరుగయ్యింది. భారత్‌లో చేపట్టిన వివిధ కార్యక్రమాలను గమనించిన డబ్ల్యూఈఎఫ్, మంచి ఫలితాలను సాధించడంలో దేశం ముందుందని పేర్కొంది. ఇంధన మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వడం, రెట్రోఫిట్టింగ్‌కు ప్రోత్సాహకాలు ప్రకటించడం ఉపకరిస్తోందని పేర్కొంది. అంతర్జాతీయ జనాభాలో మూడో వంతు చైనా, భారత్‌ల్లోనే ఉన్నందున, హరిత ఇంధనాల్లోనూ ఈ రెండు దేశాలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది.


ఏప్రిల్‌లో 16.47 లక్షల మంది కొత్త ఉద్యోగులు: ఈఎస్‌ఐసీ

దిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌లో కొత్తగా 16.47 లక్షల మంది సభ్యులను ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) చేర్చుకుంది. ఇందులో 47.60% మంది 25 ఏళ్ల లోపు వారేనని.. యువతకు అధికంగా ఉద్యోగాల సృష్టి జరుగుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది. మొత్తం కొత్త ఉద్యోగుల్లో 3.38 లక్షల మంది మహిళలు కాగా, 53 మంది ట్రాన్స్‌జెండర్లు ఉండటం గమనార్హం. ఏప్రిల్‌లో కొత్తగా 18,490 సంస్థలు ఈఎస్‌ఐ పథకంలో చేరాయి.


పాలసీదారులకు రూ.1,465 కోట్ల బోనస్‌
టాటా ఏఐఏ

ఈనాడు, హైదరాబాద్‌: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్టిసిపెంట్‌ పాలసీదారులకు మొత్తం రూ.1,465 కోట్ల బోనస్‌ ప్రకటించినట్లు టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వెల్లడించింది. 2022-23లో ప్రకటించిన రూ.1,183 కోట్లతో పోలిస్తే ఇది 24% అధికమని సంస్థ పేర్కొంది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధిక బోనస్‌ చెల్లింపు అని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని