భారత బాండ్లలోకి రూ.16,600 కోట్ల విదేశీ పెట్టుబడులు!

భారత బాండ్లలోకి దశాబ్దకాల గరిష్ఠమైన 2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16,600 కోట్ల)  విదేశీ పెట్టుబడులు ఈనెల 28న రావొచ్చని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు.

Published : 20 Jun 2024 02:53 IST

జేపీ మోర్గాన్‌ సూచీలోకి చేరనున్న నేపథ్యం
బ్యాంకర్ల అంచనా

దిల్లీ: భారత బాండ్లలోకి దశాబ్దకాల గరిష్ఠమైన 2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16,600 కోట్ల)  విదేశీ పెట్టుబడులు ఈనెల 28న రావొచ్చని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ఆ రోజు జేపీ మోర్గాన్‌ సూచీలో భారత బాండ్లను చేర్చనుండటమే ఇందుకు నేపథ్యం. అదే సమయంలో రూపాయి విలువలో కుదుపులను తగ్గించేందుకు, ముందస్తు జాగ్రత్తగా ఆర్‌బీఐ తగినన్ని డాలర్లతో సిద్ధంగా ఉండే అవకాశం ఉందనీ చెబుతున్నారు. క్రెడిట్‌ రేటింగ్‌ పెంపు పరిణామాలతో 2014 ఆగస్టు 20న భారత బాండ్లలోకి 2.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.22,400 కోట్ల) పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు బ్యాంకర్లు అంచనా వేస్తున్నట్లుగా జూన్‌ 28న 2 బి.డాలర్ల పెట్టుబడులు వస్తే.. గత దశాబ్దకాలంలోనే అత్యధికమని చెప్పొచ్చు. 

10 నెలల్లో 20 బి.డాలర్లు: జేపీ మోర్గాన్‌ ఎమర్జింగ్‌ మార్కెట్‌ సూచీ నిర్వహణలోని ఆస్తుల విలువ సుమారు 200 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. 2025 మార్చి కల్లా ఇందులో భారత్‌వాటా 10% వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే రాబోయే 10 నెలల్లో భారత బాండ్లలోకి కనీసం 20 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.66 లక్షల కోట్ల) పెట్టుబడులు రావొచ్నన్నమాట. ఇదే సమయంలో రూపాయి మారకపు విలువ కదలికలపై ఆర్‌బీఐ నిశిత పరిశీలన కొనసాగుతోంది. ‘సమీప భవిష్యత్తులో పెట్టుబడులు భారీగా రానున్నాయి. ఇంతకుముందు ఈక్విటీల్లోకి వచ్చేవి. ఇప్పుడు బాండ్లలోకి వస్తాయి’ అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం రూపాయికే కాదు విదేశీ మారకపు నిల్వలకూ సానుకూలమే అని విశ్లేషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని