వడ్డీ ఆదాయంపై పన్ను ఊరట కల్పించాలి

వడ్డీ ఆదాయంపై పన్ను ఊరట కల్పించేలా రాబోయే బడ్జెట్లో నిర్ణయాలు ఉండాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ ఖరా సూచించారు.

Published : 20 Jun 2024 02:54 IST

ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖరా

దిల్లీ: వడ్డీ ఆదాయంపై పన్ను ఊరట కల్పించేలా రాబోయే బడ్జెట్లో నిర్ణయాలు ఉండాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ ఖరా సూచించారు. దీనివల్ల బ్యాంకులకు డిపాజిట్ల రూపేణ మరిన్ని నిధులు సమకూరతాయని, వాటిని దీర్ఘకాలిక మౌలిక ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు వాడుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఒక ఏడాదిలో అన్ని బ్యాంకుల శాఖల్లో ఉన్న డిపాజిట్లపై ఆర్జించిన మొత్తం వడ్డీ ఆదాయం రూ.40,000కు మించితే బ్యాంకులు పన్నును మినహాయించుకుంటున్నాయి. పొదుపు ఖాతాలైతే రూ.10,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను వచ్చే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రకారం చూస్తే 2024-25లో రుణాల వృద్ధి రేటు 14-15 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ వెల్లడించారు. 

డిపాజిట్‌ రేట్లపై ఒత్తిడి లేదు: గత ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లలో 11% వృద్ధి నమోదైందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ తెలిపారు. అధిక ఎస్‌ఎల్‌ఆర్‌ (చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి) కారణంగా డిపాజిట్‌ రేట్లను పెంచాలనే ఒత్తిడి తమపై లేదని దినేశ్‌ తెలిపారు. ‘మా రుణ- డిపాజిట్ల నిష్పత్తి సుమారు 68-69 శాతంగా ఉండొచ్చని అనుకుంటున్నాం. దీనివల్ల డిపాజిట్‌ రేట్లు పెంచకుండానే, రుణాలిచ్చేందుకు తగినంత వెసులుబాటు మాకు లభిస్తుంద’ని ఆయన వివరించారు. అయినా డిపాజిట్లకు ప్రాధాన్యం ఇస్తామని, ఇటీవల స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచామని గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం డిపాజిట్లలో 12-13% వృద్ధి ఉంటుందని భావిస్తున్నట్లు వివరించారు. 

రూ.20,000 కోట్ల సమీకరణ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలిక బాండ్ల జారీ ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించే ఉద్దేశంలో ఉన్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. పబ్లిక్‌ ఇష్యూలు లేదా ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో ఈ నిధుల సమీకరణ ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది. ఈ ప్రతిపాదనకు బ్యాంకు సెంట్రల్‌ బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని