సంక్షిప్త వార్తలు(5)

బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళుతున్న ఎయిరిండియా విమానంలో ఒక ప్రయాణికుడికి అందించిన భోజనంలో బ్లేడ్‌ లాంటి వస్తువు రావడంతో, ఫ్లైట్‌ క్యాటరింగ్‌ కంపెనీ అయిన తాజ్‌శాట్స్‌కు.. ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసును గురువారం అందజేసింది.

Updated : 21 Jun 2024 04:10 IST

విమాన భోజనంలో బ్లేడ్‌ లాంటి వస్తువు!
తాజ్‌శాట్స్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసు

దిల్లీ: బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళుతున్న ఎయిరిండియా విమానంలో ఒక ప్రయాణికుడికి అందించిన భోజనంలో బ్లేడ్‌ లాంటి వస్తువు రావడంతో, ఫ్లైట్‌ క్యాటరింగ్‌ కంపెనీ అయిన తాజ్‌శాట్స్‌కు.. ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసును గురువారం అందజేసింది. ఈ నెల 9న ఈ సంఘటన చోటు చేసుకోగా, ఆహారాన్ని సరఫరా చేసిన బెంగళూరులోని తాజ్‌శాట్స్‌లో తనిఖీలు నిర్వహించి, నోటీసు అందజేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈఓ కమల వర్ధన రావు వెల్లడించారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం, ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసు అంటే.. ఆహార వ్యాపారంలో ఉన్న ఆపరేటర్‌ నిబంధనలను పాటించడంలో విఫలమైతే, నిర్దేశిత గడువులోపు అందుకు తగ్గ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 15 రోజుల్లోగా ఈ నోటీసుకు స్పందించాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది. ఎయిరిండియాతో పాటు క్యాటరింగ్‌ భాగస్వామి తాజ్‌శాట్స్‌ కూడా టాటా గ్రూప్‌నకు చెందిన సంస్థలే. ఈ సంఘటనపై ఎయిరిండియా ఇప్పటికే క్షమాపణలు తెలిపింది. కూరగాయల ప్రాసెసింగ్‌ మెషీన్‌ (ఆటోమేటిక్‌ వెజిటబుల్‌ కట్టర్‌) నుంచి ఈ బ్లేడ్‌ లాంటి వస్తువు ఆహారంలో కలిసిందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని తాజ్‌శాట్స్‌కు సూచించినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. 


ఇతర విద్యా సంస్థలకూ ‘ఐఎస్‌బీ ఆన్‌లైన్‌’ సేవలు  

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)కు చెందిన డిజిటల్‌ లెర్నింగ్‌ విభాగమైన ‘ఐఎస్‌బీ ఆన్‌లైన్‌’ ఇకపై వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, అటానమస్‌ విద్యా సంస్థలకు సైతం సేవలు అందించనుంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు, వృత్తి నిపుణులు, వివిధ పరిశ్రమల్లోని సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు తమ నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి, తద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలు పొందడానికి ‘ఐఎస్‌బీ ఆన్‌లైన్‌’ ద్వారా లభించే బోధన, శిక్షణ దోహదపడతాయని ఐఎస్‌బీ డిప్యూటీ డీన్‌ (ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ డిజిటల్‌ లెర్నింగ్‌) దీపా మణి పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్, బిజినెస్‌ స్ట్రాటజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టెక్నాలజీ, బిహేవియరల్‌ సైన్సెస్‌.. తదితర విద్యా విభాగాల్లో ‘ఐఎస్‌బీ ఆన్‌లైన్‌’ పలురకాల బోధనా కార్యక్రమాలు అందిస్తోంది. విద్యార్థులే కాకుండా, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాముల ద్వారా విద్యా సంస్థల్లోని అధ్యాపకులూ తమ నైపుణ్యాలకు పదును పెట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచ స్థాయి విద్యా బోధన, శిక్షణ ప్రమాణాలను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ‘ఐఎస్‌బీ ఆన్‌లైన్‌’ సేవలను ఇతర విద్యా సంస్థలకు విస్తరిస్తున్నట్లు ఆమె వివరించారు.


హైదరాబాద్‌లో ‘సెంట్రిసిటీ’ కొత్త కార్యాలయం  

ఈనాడు, హైదరాబాద్‌: వెల్త్‌టెక్‌ అంకుర సంస్థ సెంట్రిసిటీ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. సంస్థ సీఈఓ మను అవస్థి, బిజినెస్‌ హెడ్‌ అనిరుధ్‌ మహనోత్, ఏపీ, తెలంగాణ టెరిటరీ మేనేజర్‌ హిమాన్సు పరిడా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల్త్‌ మేనేజర్లు, అస్సెట్‌ మేనేజర్లు, ఇన్వెస్టర్లకు హైదరాబాద్‌ కార్యాలయం నుంచి సేవలు అందించడానికి వీలు కలుగుతుందని అనిరుధ్‌ వివరించారు. ఐఐటీ మద్రాస్‌ రీసెర్చ్‌ పార్క్‌తో కలిసి ఏఐ, ఎంఎల్‌ టెక్నాలజీ ఆధారంగా ప్రత్యేక ఆర్థిక సేవలను ఆవిష్కరించే పనిలో ఉన్నామని తెలిపారు. ఇప్పటికే ‘వన్‌ డిజిటల్‌’, ‘ఇన్విక్టస్‌’  ఫైనాన్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు, హెచ్‌ఎన్‌ఐలు, కార్పొరేట్‌ ట్రెజరీలకు సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.


హామీ లేని రుణాలతో సమస్యలొస్తాయ్‌
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ముంబయి: హామీ లేని (అన్‌సెక్యూర్డ్‌) రుణాలు అధికమైతే పెద్ద సమస్యలు వస్తాయని.. వీటిపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సరైన సమయంలో చర్యలు తీసుకోకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభాలు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి, వాటికి నివారణ చర్యలు తీసుకోవడవమే ఆర్‌బీఐ బాధ్యతని ఆయన తెలిపారు. ఆర్‌బీఐకి చెందిన కాలేజ్‌ ఆఫ్‌ సూపర్‌వైజర్స్‌ కార్యక్రమంలో ఆయన ఈ అంశాలను వివరించారు. ‘బ్యాంకులు లాభాల కోసం రిస్క్‌ తీసుకోవడం మానుకోవాలి. ఇలాంటి రుణాలతో లాభాలు రావు. ఆర్‌బీఐ హామీ రహిత రుణాలపై 2023 నవంబరులో చర్యలు ప్రారంభించింది. దీంతో ఈ రుణాల వృద్ధి మందగించింది. ఆర్‌బీఐ చర్యలతో క్రెడిట్‌ కార్డ్‌ పోర్ట్‌ఫోలియోల వృద్ధి 30 శాతం నుంచి 23 శాతానికి తగ్గింది. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులు అందించే రుణాల వృద్ధి కూడా 29% నుంచి 18 శాతానికి పరిమితమైంద’ని దాస్‌ వివరించారు.


అవాంచిత కాల్స్‌/ఎస్‌ఎంఎస్‌ల నిరోధానికి మార్గదర్శకాల ముసాయిదా

దిల్లీ: రోజువారీ పనుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టే వ్యాపార సంబంధిత ప్రమోషనల్‌ కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. వీటిని అరికట్టే ఉద్దేశంతో రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసి, వీటిపై జులై 21లోపు అభిప్రాయాలు తెలియజేయాలని ప్రజలను కోరింది. ఈ ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం..

  • వస్తువులు, సేవలకు సంబంధించి వచ్చే ప్రమోషనల్‌ కాల్స్‌/ఎస్‌ఎంఎస్‌లు వ్యాపార సంబంధిత సమాచారంగానే పరిగణిస్తారు. వ్యక్తులు, సంస్థలేమైనా ఇటువంటివి చేస్తే, అవన్నీ ఈ కోవలోకే వస్తాయి. వినియోగదారుల సమ్మతి/వారి ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా వచ్చే కాల్స్‌/ఎస్‌ఎంఎస్‌లు అవాంఛిత వ్యాపార ప్రమోషన్ల కిందకు వస్తాయి. 
  • రిజిస్టర్‌ చేయని నంబర్, ఎస్‌ఎంఎస్‌ హెడర్‌లను ఉపయోగించడం, వినియోగదారుడు కాల్‌ కట్‌ చేసినా.. మళ్లీ కాల్‌ చేయడం వంటి వాటినీ అరికట్టనున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని