సంక్షిప్త వార్తలు(4)

టెక్టరో కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు గూగుల్‌ నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మక ‘2024 గ్లోబల్‌ గ్రోత్‌ యాక్సెలరేటర్‌’ అవార్డు లభించింది. ఆండ్రాయిడ్‌ ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్‌ను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చింనందుకు ఈ అవార్డుకు టెక్టరో కన్సల్టింగ్‌ ఎంపికైంది.

Published : 22 Jun 2024 02:21 IST

టెక్టరో కన్సల్టింగ్‌కు గూగుల్‌ అవార్డు 

ఈనాడు, హైదరాబాద్‌: టెక్టరో కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు గూగుల్‌ నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మక ‘2024 గ్లోబల్‌ గ్రోత్‌ యాక్సెలరేటర్‌’ అవార్డు లభించింది. ఆండ్రాయిడ్‌ ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్‌ను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చింనందుకు ఈ అవార్డుకు టెక్టరో కన్సల్టింగ్‌ ఎంపికైంది. లండన్‌లో జరిగిన ‘ఆండ్రాయిడ్‌ ఎంటర్‌ప్రైజ్‌ గ్లోబల్‌ పార్టనర్‌ సమ్మిట్‌’ లో ఈ అవార్డును టెక్టరో కన్సల్టింగ్‌ ఎండీ శ్రీధర్‌ దన్నపనేని అందుకున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆండ్రాయిడ్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్, నిర్వహణ సామర్థ్యం, సెక్యూరిటీ.. తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించి సత్ఫలితాలు సాధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీలో వినూత్న ఫలితాలు సాధించేందుకు ఇంకా ఎక్కువ పని చేస్తామని అన్నారు. 


జెరోధా ప్లాట్‌ఫామ్‌లోసాంకేతిక సమస్యలు 

దిల్లీ: జెరోధా ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో శుక్రవారం కొంత సమయం పాటు సాంకేతిక సమస్య చోటుచేసుకుంది. ఆ సమయంలో పలు పొరపాట్లు చోటుచేసుకున్నాయి. ఎఫ్‌అండ్‌ఓ నిషేధిత షేర్ల విభాగంలో లేని ఇండియా సిమెంట్‌ షేర్లు ఆ విభాగంలో ఉన్నట్లు కనిపించాయి. దీంతో ఆర్డర్లు పెట్టే విషయంలో ట్రేడర్లు ఇబ్బంది పడ్డారు. కాసేపటికే సాంకేతిక సమస్య పరిష్కారమై, ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యథాతథంగా పనిచేసింది. 15 రోజుల క్రితం అంటే జూన్‌ 3న (ఎగ్జిట్‌ ఫలితాలు వెల్లడైన మరుసటి ట్రేడింగ్‌ రోజు) కూడా జెరోధా ప్లాట్‌ఫామ్‌లో సాంకేతిక సమస్య ఎదురైంది. శుక్రవారమూ సాంకేతిక సమస్య ఎదురుకావడంతో, సామాజిక మాధ్యమాల వేదికగా మదుపర్లు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్య తలెత్తడంపై జెరోధా క్షమాపణలు తెలిపింది. సమస్య ఐదు నిమిషాల్లోనే పరిష్కారమైనట్లు వెల్లడించింది.

ఐఐఎఫ్‌ఎల్‌ బ్రోకరేజీ ఖాతాలకు కూడా సాంకేతికపరమైన సమస్య చోటుచేసుకుంది. పెద్ద ఆర్డర్ల వల్ల డెరివేటివ్‌ కాంట్రాక్టుల ప్లేస్‌మెంట్‌ విషయంలో ఇబ్బందులు ఎదురై, ఖాతాల్లో లావాదేవీలు స్తంభించాయి.  


జెరాక్స్‌కు టీసీఎస్‌ సేవలు

క్లౌడ్, జన్‌ఏఐ టెక్నాలజీ ఆధారిత ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రాజెక్టు అమలు 

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాకు చెందిన డిజిటల్‌ ప్రింట్‌ టెక్నాలజీ సంస్థ జెరాక్స్‌ను, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ ఆధారిత సమర్థ సేవల సంస్థగా తీర్చిదిద్దే విషయంలో తగిన సలహాలు, సహకారం అందించే బాధ్యతను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) చేపట్టనుంది. దీని కోసం క్లౌడ్, జన్‌ఏఐ టెక్నాలజీలను టీసీఎస్‌ వినియోగిస్తుంది. ఈ మేరకు టీసీఎస్‌తో జెరాక్స్‌ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. జెరాక్స్‌ టెక్నాలజీ సేవలను స్థిరీకరించడం ద్వారా వ్యాపార సమర్థతను పెంపొందించటం, జెరాక్స్‌కు చెందిన పురాతన డేటా సెంటర్లను అజూర్‌ పబ్లిక్‌ క్లౌడ్‌కు మార్చడం, వ్యాపార విధానాల్లో మార్పు తీసుకురావడం కోసం క్లౌడ్‌ ఆధారిత డిజిటర్‌ ఈఆర్‌పీ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించడం, రోజువారీ కార్యకలాపాల్లో జనరేటివ్‌ ఏఐ ను అమలు చేయడం.. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. జెరాక్స్‌ కోసం క్లౌడ్‌- ఫస్ట్‌ ఆపరేటింగ్‌ మోడల అమలు చేయనున్నట్లు టీసీఎస్‌ వెల్లడించింది. ‘ఏఐ-ఫస్ట్‌ ఎంటర్‌ప్రైజ్‌ ప్లాట్‌ఫామ్‌’ ను జెరాక్స్‌ కోసం సిద్ధం చేయనున్నట్లు పేర్కొంది. ఫైనాన్స్, హెచ్‌ఆర్‌.. తదితర విభాగాల్లో జెరాక్స్, టీసీఎస్‌ 2 దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నాయని, ఈ ప్రయాణం కొత్త ప్రాజెక్టుతో ఇంకా బలోపేతం కాబోతోందని టీసీఎస్‌ అధ్యక్షుడు (టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌) వి.రాజన్న వివరించారు. ‘డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ దిశగా ముందుకు సాగుతున్న సంస్థలకు టీసీఎస్‌ సమర్థ భాగస్వామిగా గుర్తింపు సాధిస్తోందని వివరించారు. అమెరికాలో టీసీఎస్‌కు 50,000 మంది ఉద్యోగులు, 19 డెలివరీ కేంద్రాలు ఉన్నాయని, తత్ఫలితంగా విస్తృత సేవలు అందించగలుగుతున్నామని తెలిపారు.  


నియంత్రణ సంస్థలకూ ఆత్మపరిశీలన అవసరం

ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నరు ఎస్‌.ఎస్‌.ముంద్రా  

ముంబయి: నియంత్రణ సంస్థల కొన్ని ప్రతిపాదనలు మదుపర్లలో ఆందోళనలకు దారితీయడం.. ఫలితంగా వాటిని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో.. నిర్ణయాలపై అవి పునఃసమీక్షించుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నరు ఎస్‌.ఎస్‌.ముంద్రా తెలిపారు. సెబీ, ఆర్‌బీఐకి సంబంధించిన ప్రతిపాదనల్లోనూ ఇలాంటివి ఉన్నాయని వివరించారు.  ‘నియంత్రణ సంస్థలూ కొంతమేర ఆత్మపరిశీలన చేసుకోవాల’ని అసోచామ్‌ నిర్వహించిన ఓ సమావేశంలో ముంద్ర స్పష్టం చేశారు. బ్యాంకుల్లో ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్‌ల పెట్టుబడులపై తీసుకొచ్చిన ఆర్‌బీఐ నిబంధనలను ముంద్రా ప్రస్తావించారు. ఈ నిబంధనలు బ్యాంకింగ్‌ రంగంలో ఆందోళనలకు దారితీయడంతో, వాటిని తిరిగి ఆర్‌బీఐ సరళీకరించాల్సి వచ్చిందని గుర్తు చేశారు.  ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌కు అధిక కేటాయింపుల ప్రతిపాదనలపై నెలకొన్న ఆందోళనలు కూడా ఆర్‌బీఐకు ఇబ్బందిగా మారాయని తెలిపారు. అందువల్ల గత రెండేళ్లలో నియంత్రణ సంస్థలు తీసుకున్న నిర్ణయాలపై, అవి సమీక్ష జరిపేలా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ముంద్రా సూచించారు. సెబీ విషయానికొస్తే ఈ నియంత్రణ సంస్థ తీసుకున్న నిర్ణయాల్లో 90% వరకు నిర్ణయాలను అప్పిలేట్‌ అథారిటీలు తోసిపుచ్చాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని