త్వరలో పబ్లిక్‌ ఇష్యూకు జెప్టో!

నిత్యావసరాలు సరఫరా చేసే అంకుర సంస్థ జెప్టో తాజాగా రూ.5,500 కోట్ల (665 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడులను సమీకరించింది. కంపెనీ విలువను సుమారు     రూ.30,000 కోట్లు (3.6 బిలియన్‌ డాలర్లు)గా లెక్కగట్టి ఈ నిధుల సమీకరణను పూర్తి చేసింది.

Published : 22 Jun 2024 02:24 IST

తాజాగా రూ.5,500 కోట్ల సమీకరణ
ఏడాదిలో విలువ మూడింతలు

దిల్లీ: నిత్యావసరాలు సరఫరా చేసే అంకుర సంస్థ జెప్టో తాజాగా రూ.5,500 కోట్ల (665 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడులను సమీకరించింది. కంపెనీ విలువను సుమారు     రూ.30,000 కోట్లు (3.6 బిలియన్‌ డాలర్లు)గా లెక్కగట్టి ఈ నిధుల సమీకరణను పూర్తి చేసింది. ఏడాదిక్రితంతో పోలిస్తే కంపెనీ విలువ సుమారు మూడింతలు కావడం గమనార్హం. అధిక పెట్టుబడి అవసరం ఉండటమే కాకుండా, తక్కువ మార్జిన్‌ లభించే నిత్యావసరాల సరఫరా రంగంలో పోటీ కూడా తీవ్రంగానే ఉంటుంది. అమెజాన్, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌ బాస్కెట్‌తో పోటీ పడేందుకు తాజాగా సమీకరించిన నిధులు జెప్టోకు ఉపయోగపడనున్నాయి. ఈ నిధుల సమీకరణ ప్రక్రియలో ప్రస్తుత వాటాదార్లతో పాటు కొత్త పెట్టుబడిదార్లు పాల్గొన్నాయని జెప్టో వెల్లడించింది. 

ఏర్పాటైంది 2021లోనే: స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌ అభ్యసించిన ఆదిత్‌ పాలిచా (21) తన బాల్య మిత్రుడైన కైవల్య వోహ్రాతో కలిసి 2021లో జెప్టోను స్థాపించారు. త్వరలోనే మిగులు నగదు నిల్వల స్థాయికి జెప్టో చేరుకునే అవకాశం ఉంది. సమీప భవిష్యత్‌లో పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లే యోచన లో సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. క్విక్‌ ఇ-కామర్స్‌గా వ్యవహరించే, 10 నిమిషాల్లో వస్తువుల సరఫరా సేవల విభాగంలో జెప్టోకు 29% మార్కెట్‌ వాటా ఉంది. సుమారు 40% వాటాతో బ్లింకిట్‌ ఈ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని