ఎన్‌పీఎస్‌లో కొత్త లైఫ్‌ సైకిల్‌ ఫండ్‌

జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో ప్రభుత్వేతర చందాదారుల కోసం కొత్త లైఫ్‌ సైకిల్‌ ఫండ్‌ తీసుకొస్తున్నట్లు పింఛను నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) వెల్లడించింది.

Published : 22 Jun 2024 02:25 IST

సెప్టెంబరులో అందుబాటులోకి: పీఎఫ్‌ఆర్‌డీఏ 

దిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో ప్రభుత్వేతర చందాదారుల కోసం కొత్త లైఫ్‌ సైకిల్‌ ఫండ్‌ తీసుకొస్తున్నట్లు పింఛను నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) వెల్లడించింది. సెప్టెంబరు నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని పీఎఫ్‌ఆర్‌డీఏ ఛైర్మన్‌ దీపక్‌ మొహంతి శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం 35 ఏళ్ల దాటిన వారికి ఈక్విటీల్లో పెట్టుబడులు తగ్గిస్తున్నామని, దీన్ని 45 ఏళ్ల వరకూ పెంచుతున్నట్లు తెలిపారు. దీనివల్ల ఈక్విటీ ఆధారిత పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం ఎల్‌సీ 75, ఎల్‌సీ 50, ఎల్‌సీ 25 పేర్లతో మూడు లైఫ్‌ సైకిల్‌ ఫండ్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త పథకం సెప్టెంబరులో అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. లైఫ్‌ సైకిల్‌ ఫండ్‌ చందాదారులకు, పెట్టుబడులను ఎంచుకునే స్వేచ్ఛను ఇది అందిస్తుంది. ఈక్విటీ, డెట్‌ కేటాయింపులను నిర్ణయించుకోవచ్చు. 

గత ఆర్థిక సంవత్సరంలో అటల్‌ పెన్షన్‌ యోజన(ఏపీవై)లో 1.24 కోట్ల మంది చందాదారులు చేరగా, ఇందులో 52% మహిళలున్నారని తెలిపారు. ఈ పథకంలో మొత్తం 6.6 కోట్ల మంది చేరారన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.30 కోట్ల మందిని ఈ పథకంలో చేర్చాలనే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. 2023-24లో ఎన్‌పీఎస్‌ కింద 9.7 లక్షల ప్రభుత్వేతర చందాదారులు నమోదు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 11 లక్షలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. మార్కెట్‌ సాధారణంగా పనిచేస్తే ఏపీవై సహా మొత్తం నిధి గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.12.4 లక్షల కోట్ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం చివరికి రూ.15లక్షల కోట్లకు పెరుగుతుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు