రికార్డుల జోరుకు విరామం

సూచీల ఆరు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో చమురు-గ్యాస్, యంత్ర పరికరాలు, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్‌ షేర్లు రాణించడంతో నష్టాలు పరిమితమయ్యాయి.

Updated : 22 Jun 2024 07:02 IST

సమీక్ష

సూచీల ఆరు రోజుల రికార్డుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో చమురు-గ్యాస్, యంత్ర పరికరాలు, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్‌ షేర్లు రాణించడంతో నష్టాలు పరిమితమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు పెరిగి 83.57 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.16% నష్టంతో 85.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు అదే ధోరణిలో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 77,729.48 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభ ట్రేడింగ్‌లో 77,808.45 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ, అనంతరం నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 76,802 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరి, చివరకు 269.03 పాయింట్ల నష్టంతో 77,209.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 65.90 పాయింట్లు తగ్గి 23,501.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 23,398.20- 23,667.10 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 217.13 పాయింట్లు, నిఫ్టీ 35.5 పాయింట్లు చొప్పున లాభాలు నమోదుచేశాయి.

  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 డీలాపడ్డాయి. అల్ట్రాటెక్‌ 2.22%, ఎల్‌ అండ్‌ టీ 1.78%, టాటా మోటార్స్‌ 1.74%, నెస్లే 1.71%, హెచ్‌యూఎల్‌ 1.63%, టాటా స్టీల్‌ 1.37%, రిలయన్స్‌ 1.34%, ఎం అండ్‌ ఎం 1.17%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.07%, ఐటీసీ 0.89% నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 2.32%, ఇన్ఫోసిస్‌ 1.08%, టీసీఎస్‌ 0.59%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 0.54% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీలో చమురు-గ్యాస్‌ 1.28%, ఎఫ్‌ఎమ్‌సీజీ 1.08%, యంత్ర పరికరాలు 0.96%, వాహన 0.71% పడ్డాయి. ఐటీ, టెలికాం, లోహ, విద్యుత్, టెక్, సేవలు మెరిశాయి. బీఎస్‌ఈలో 2086 షేర్లు నష్టాల్లో ముగియగా, 1784 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 117 షేర్లలో ఎటువంటి        మార్పు లేదు.
  • చక్కెర కంపెనీ సర్‌ షాడీ లాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో అదనంగా 36.34% వాటాను రూ.45 కోట్లకు త్రివేణి ఇంజినీరింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ తర్వాత సర్‌ షాడీ లాల్‌లో త్రివేణి వాటా 61.77 శాతానికి చేరింది. 
  • బొగ్గు గనుల వేలంలో అదానీ, వేదాంతా: వాణిజ్య బొగ్గు గనుల 10వ విడత వేలంలో బిడ్‌ వేసేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్, వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌ఎల్‌సీ ఇండియా, అంబుజా సిమెంట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఇతర సంస్థలు సన్నాహాలు చేస్తున్నట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బొగ్గు గనుల తాజా వేలాన్ని కేంద్ర బొగ్గు మంత్రి జి.కిషన్‌ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఎంఎస్‌టీసీ ప్లాట్‌పామ్‌పై అంతర్జాతీయ బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా 60 కొత్త బొగ్గు గనులను మంత్రిత్వ శాఖ వేలానికి పెట్టింది. వేలం ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం 90 రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
  • మధ్యప్రదేశ్‌లోని హట్టా గ్యాస్‌ క్షేత్రం వద్ద చిన్న స్థాయి లిక్విఫైడ్‌ సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ఓఎన్‌జీసీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి.  
  • విదేశీ బ్యాంక్‌ ఖాతాలను వినియోగించి భారత సెక్యూరిటీల మార్కెట్‌లోకి నిధులు తరలించారన్న ఆరోపణలతో నమోదైన కేసుకు సంబంధించి యునిటెక్‌ మాజీ ప్రమోటర్లు సంజయ్‌ చంద్రా, అజయ్‌ చంద్రాలపై దర్యాప్తును సెబీ కొట్టివేసింది. ఈ ఆరోపణలకు ఆధారాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది.

తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు

జూన్‌ 14తో ముగిసిన వారానికి మన విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 2.922 బి.డాలర్లు (దాదాపు రూ.24,000 కోట్లు) తగ్గి 652.895 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.54.19 లక్షల కోట్ల)కు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. అంతక్రితం వారం ఫారెక్స్‌ నిల్వలు జీవనకాల గరిష్ఠమైన 655.817 బి.డాలర్లుగా ఉన్నాయి. సమీక్షిస్తున్న వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 2.097 బి.డాలర్లు తగ్గి 574.24 బి.డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి నిల్వలు 1.015 బి.డాలర్లు క్షీణించి 55.967 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు (ఎస్‌డీఆర్‌లు) 54 మిలియన్‌ డాలర్లు తగ్గి 18.107 బిలియన్‌ డాలర్లకు చేరగా, ఐఎంఎఫ్‌ వద్ద దేశ నిల్వల స్థానం 245 మిలియన్‌ డాలర్లు పెరిగి 4.581 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి.

ఐపీఓ సమాచారం  

  • డీ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్స్‌ ఐపీఓ చివరి రోజు 99.56 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,49,44,944 షేర్లను ఆఫర్‌ చేయగా, 1,48,78,81,693 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 201.91 రెట్లు, ఎన్‌ఐఐల నుంచి 144 రెట్లు, రిటైల్‌ విభాగంలో 23.42 రెట్ల స్పందన దక్కింది. 
  • ఆక్మే ఫిన్‌ట్రేడ్‌ ఐపీఓ చివరి రోజు 55.12 రెట్ల స్పందన నమోదైంది. ఇష్యూలో భాగంగా 78,65,000 షేర్లను జారీ చేయగా, 43,35,52,375 షేర్లకు బిడ్లు వచ్చాయి. ఎన్‌ఐఐల నుంచి 130.33 రెట్లు, రిటైల్‌ మదుపర్ల నుంచి 45.78 రెట్లు, క్యూఐబీ విభాగంలో 28.12 రెట్ల స్పందన కనిపించింది. 
  • స్టాన్లీ లైఫ్‌స్టైల్స్‌ ఐపీఓ మొదటి రోజు 1.43 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,02,41,507 షేర్లను ఆఫర్‌ చేయగా, 1,46,69,560 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
  • తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా రూ.3,500 కోట్లు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ అవాన్సే ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. కంపెనీలో ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం వార్‌బర్గ్‌ పింకస్‌కు చెందిన ఆలివ్‌ వైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టుబడులు ఉన్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని