సంక్షిప్త వార్తలు(4)

వచ్చే రెండేళ్లలో టెక్నాలజీ బృందం ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసి 3000 మందికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) తెలిపింది.

Updated : 24 Jun 2024 06:18 IST

టెక్‌ ఉద్యోగుల సంఖ్య 3000 మందికి: బీఓబీ

ముంబయి: వచ్చే రెండేళ్లలో టెక్నాలజీ బృందం ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసి 3000 మందికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) తెలిపింది. సాధారణ నియామకాల ప్రక్రియతో పాటు నిపుణుల ఎంపిక ద్వారా ఉద్యోగులను పెంచుకోనున్నట్లు బీఓబీ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ దేబదత్తా చంద్‌ తెలిపారు. సాంకేతిక లోపాల కారణంగా లావాదేవీలపై ప్రభావం పడితే బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల కఠిన చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ ఐటీ బృందాన్ని బలపరిచే పనిలో ఉన్నట్లు చంద్‌ వెల్లడించారు. ఐటీ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.2000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు.


కెనరా బ్యాంక్‌ ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

దిల్లీ: సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ తెలిపింది. తమ ఎక్స్‌ హ్యాండిల్‌ను పునరుద్ధరించే వరకు ఖాతాదారులను ఈ ఖాతాను వినియోగించరాదని సూచించింది. సంబంధిత బృందాలు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నాయని, సాధ్యమైనంత త్వరగా ఎక్స్‌ ఖాతాను పొందేందుకు పనిచేస్తున్నట్లు కెనరా బ్యాంక్‌ తెలిపింది. 


2024-25లో కొత్తగా 400 శాఖలు: ఎస్‌బీఐ

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశవ్యాప్తంగా కొత్తగా 400 శాఖలు ప్రారంభించనున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ 137 శాఖలు ప్రారంభించగా, ఇందులో 59 శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. 2024 మార్చికి దేశవ్యాప్తంగా 22,542 ఎస్‌బీఐ శాఖలు ఉన్నాయి. అనుబంధ సంస్థల కార్యకలాపాలను మరింత విస్తరించిన తర్వాత, వాటిని ఎక్స్ఛేంజీల్లో నమోదుచేస్తామని ఖారా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎస్‌బీఐ చేతిలో అనుబంధ సంస్థలుగా ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ పేమెంట్‌ సర్వీసెస్‌ ఉన్నాయి.


కృత్రిమ మేధతో మరిన్ని ఉద్యోగాలొస్తాయ్‌

డెలాయిట్‌ ఏఐ ఎండీ టాండన్‌ అంచనా

దిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించడంతో కొన్ని రంగాల్లో కొంత మంది ఉద్యోగాలు కోల్పోయినా, అంతకు మించి ఉద్యోగాల సృష్టి జరుగుతుందని డెలాయిట్‌ ఎల్‌ఎల్‌పీ ఏఐ అండ్‌ ఇన్‌సైట్స్‌ ప్రాక్టీస్‌ లీడర్‌ ఎండీ రోహిత్‌ టాండన్‌ వెల్లడించారు. భవిష్యత్‌లో కృత్రిమ మేధ, మనుషులు కలిసి పని చేస్తారని తెలిపారు. గతంలో ఐటీ, టెక్నాలజీ, కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాగే భారీగా ఉద్యోగాలు కోల్పోతారని భయాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. కానీ తర్వాత ఐటీ రంగంలో భారీ స్థాయిలో ఉద్యోగాలు లభించాయని గుర్తు చేశారు. కొత్త సాంకేతికత ఎప్పుడు వచ్చినా ఉద్యోగాలు పోతాయేమో అనే భయం ఉంటుందన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది ఏఐతో ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందేమోనని అనుకుంటున్నారని, కానీ అలా జరగదని మరిన్ని ఉద్యోగాలొస్తాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని