76300 ఎగువన సానుకూల ధోరణి!

సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గతవారం దేశీయ సూచీలు కొత్త రికార్డు గరిష్ఠాలను తాకాయి. దేశీయ ఆర్థిక గణాంకాలు, ఎఫ్‌ఐఐ, డీఐఐ కొనుగోళ్లతో సెంటిమెంట్‌ బలపడింది. దేశీయంగా చూస్తే.. జూన్‌లో హెచ్‌ఎస్‌బీసీ సేవల పీఎంఐ 60.4; తయారీ పీఎంఐ 58.5కు పుంజుకున్నాయి.

Published : 24 Jun 2024 01:47 IST

సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గతవారం దేశీయ సూచీలు కొత్త రికార్డు గరిష్ఠాలను తాకాయి. దేశీయ ఆర్థిక గణాంకాలు, ఎఫ్‌ఐఐ, డీఐఐ కొనుగోళ్లతో సెంటిమెంట్‌ బలపడింది. దేశీయంగా చూస్తే.. జూన్‌లో హెచ్‌ఎస్‌బీసీ సేవల పీఎంఐ 60.4; తయారీ పీఎంఐ 58.5కు పుంజుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇప్పటివరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 21% పెరిగి రూ.4.62 లక్షల కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్య పరపతి విధాన వైఖరిని మార్చడం తొందరపాటే అవుతందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణంపై ఇంకా ఆందోళన ఉందని తెలిపారు. బ్యారెల్‌ ముడిచమురు 3.7 శాతం లాభంతో 85.6 డాలర్లకు చేరింది. గిరాకీ మెరుగుపడటం, అమెరికాలో నిల్వలు తగ్గడం, పశ్చిమాసియాలో పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.57 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చూస్తే.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియాలు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాయి. స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ మాత్రం కీలక రేట్లను 0.25% తగ్గించి 1.25 శాతం చేశాయి. జపాన్‌ ద్రవ్యోల్బణం 2.5 శాతానికి పెరిగింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.3% లాభంతో 77,210 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.2% పెరిగి 23,501 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో బ్యాంకింగ్, ఐటీ, లోహ లాభపడగా.. వాహన, చమురు-గ్యాస్, యంత్ర పరికరాల షేర్లు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.9,103 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.9,575 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.12,170 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 4:5గా నమోదు కావడం..
కొన్ని పెద్ద షేర్లలో లాభాల స్వీకరణను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గత వారం 77,851.63 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసిన సెన్సెక్స్, స్థిరీకరణతో వెనక్కి వచ్చింది. స్వల్పకాలంలో సూచీ 76,300 పాయింట్ల ఎగువన ట్రేడైనంత వరకు సానుకూలతలు కొనసాగే అవకాశం ఉంది. ఈ స్థాయి దిగువన ముగిస్తే మరింత స్థిరీకరణకు అవకాశం ఉంటుంది. 

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాలను దేశీయ సూచీలు అందిపుచ్చుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ గణాంకాలు, కార్పొరేట్‌ వార్తలపై మదుపర్లు దృష్టిపెట్టొచ్చు. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే 17% తక్కువగా నమోదైంది. వచ్చే కొన్ని వారాల్లో రుతుపవనాల పురోగతి కీలకం కానుంది. జీఎస్‌టీ సమావేశ నిర్ణయాలు నేటి మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. జూన్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపుతో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ వారం అలైడ్‌ బ్లెండర్స్, వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఐపీఓలు ప్రాథమిక మార్కెట్‌ ముందుకు రానున్నాయి. మొదటి త్రైమాసిక కరెంటు ఖాతా లోటు, ఫ్లాష్‌ కాంపోజిట్‌ పీఎంఐ, ఆర్‌బీఐ నగదు సరఫరా గణాంకాలు వెలువడనున్నాయి. వచ్చే నెలలో రానున్న బడ్జెట్‌కు సంబంధించిన వార్తలపై కన్నేయొచ్చు. అంతర్జాతీయంగా.. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ అధికారుల ప్రసంగాలు, అమెరికా మొదటి త్రైమాసిక జీడీపీ, మే కొత్త గృహాల విక్రయాలు, యూరో ఏరియా ఎకనామిక్‌ సెంటిమెంట్, అమెరికా నిరుద్యోగ క్లెయిమ్‌ గణాంకాలు వెలువడనున్నాయి. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, చమురు ధరల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. చమురు ధరలు మరింత పెరిగితే మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది.

తక్షణ మద్దతు స్థాయులు: 76,296, 75,678, 74,941
తక్షణ నిరోధ స్థాయులు: 77,851, 78,200, 79,000
సెన్సెక్స్‌ 76,300 ఎగువన ట్రేడైతే సానుకూలతలు కొనసాగొచ్చు.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని