బ్యాటరీలు, ఛార్జింగ్‌ స్టేషన్ల సేవలకు జీఎస్‌టీ తగ్గించాలి

బ్యాటరీలు, విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ మౌలిక వసతులు, బ్యాటరీ స్వాపింగ్‌ సేవలకు జీఎస్‌టీని తగ్గించాలని ప్రభుత్వాన్ని ఇండియా ఎనర్జీ స్టోరేజీ అలయెన్స్‌ (ఐఈఎస్‌ఏ) కోరింది.

Published : 25 Jun 2024 02:12 IST

ప్రభుత్వానికి ఐఈఎస్‌ఏ వినతి

దిల్లీ: బ్యాటరీలు, విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ మౌలిక వసతులు, బ్యాటరీ స్వాపింగ్‌ సేవలకు జీఎస్‌టీని తగ్గించాలని ప్రభుత్వాన్ని ఇండియా ఎనర్జీ స్టోరేజీ అలయెన్స్‌ (ఐఈఎస్‌ఏ) కోరింది. బ్యాటరీ విడిభాగాలు, బ్యాటరీల ముడి సరుకులను ప్రాసెస్‌ చేసే పరిశ్రమకు కూడా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) విస్తరించాలని సూచించింది. దిల్లీలో జులై 1-5 తేదీల్లో ఇండియా ఎనర్జీ స్టోరేజ్‌ వీక్‌- 2024 జరగనున్నందున ప్రభుత్వానికి వినతుల జాబితాను ఐఈఎస్‌ఏ సమర్పించింది. ‘ప్రస్తుతం లిథియం అయాన్‌ బ్యాటరీలకు 18%, ఇతర బ్యాటరీలకు 28% జీఎస్‌టీ ఉంది. అన్ని రకాల బ్యాటరీలను 18% జీఎస్‌టీ కిందకు తేవాలని మేం కోరుతున్నాం. ఛార్జింగ్‌ మౌలిక సేవలు, బ్యాటరీ స్వాపింగ్‌ సేవలకు జీఎస్‌టీని ప్రస్తుత 28% నుంచి 5 లేదా 18 శాతానికి తగ్గించాల’ని ఐఈఎస్‌ఈ ప్రెసిడెంట్‌ రాహుల్‌ వాలావాకర్‌ విజ్ఞప్తి చేశారు. అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ బ్యాటరీ (ఏసీసీ- పీఎల్‌ఐ), వాహన- పీఎల్‌ఐ, వాహన విడిభాగాలు- పీఎల్‌ఐ లాంటి పథకాలు తీసుకొచ్చినందుకు ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. ఈ పథకాలను బ్యాటరీలకు సంబంధించి ఇతర విభాగాలకూ విస్తరించాలని సూచించారు. పెద్ద పరిమాణంలో (లార్జ్‌ స్కేల్‌) బ్యాటరీ నిల్వ వ్యవస్థల ఏర్పాటుకు ప్రోత్సాహకాలను అందించడాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విభాగం పనితీరు మెరుగుపర్చేందుకు, వ్యయాలను తగ్గించే నిమిత్తం పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందివ్వాలని అభ్యర్థించారు. విద్యుత్‌ వాహన విపణి వృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఛార్జింగ్‌ మౌలిక వసతుల కొరత, ముందస్తు చెల్లింపులు అధికంగా ఉండటం లాంటి అవరోధాలను అధిగమించేందుకు మరింత సహకారాన్ని ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించడం లాంటి సిఫారసులనూ ఐఈఎస్‌ఏ చేసింది. స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి రుణాలివ్వడం ప్రధాన సమస్యగా మారిందని.. దీనికి పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టాలని కోరింది. స్వచ్ఛ ఇంధన ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై నిధులు వెచ్చించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు