కొత్త ఆర్డర్లపై ఎన్‌సీసీ భారీ అంచనాలు

మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో నిమగ్నమైన ఎన్‌సీసీ లిమిటెడ్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.20,000 - 22,000 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లు లభిస్తాయని అంచనా వేస్తోంది.

Published : 25 Jun 2024 02:14 IST

రూ.22,000 కోట్ల వరకు రావొచ్చు
2024-25 ఆదాయాల్లో 15% వృద్ధి లక్ష్యం  
స్మార్ట్‌ మీటర్‌ ప్రాజెక్టులకు 2 కంపెనీలు 
ఈనాడు - హైదరాబాద్‌

మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో నిమగ్నమైన ఎన్‌సీసీ లిమిటెడ్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.20,000 - 22,000 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లు లభిస్తాయని అంచనా వేస్తోంది. సంస్థ వార్షిక ఫలితాలపై ఇన్వెస్టర్లతో నిర్వహించిన ‘కాన్ఫెరెన్స్‌ కాల్‌’ లో ఎన్‌సీసీ డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌) ఆర్‌.ఎస్‌.రాజు ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్‌సీసీ వద్ద గత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.57,536 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. దీనికి ఈ ఆర్థిక సంవత్సరంలో లభించే కొత్త ఆర్డర్లు అదనం. అందువల్ల ఆదాయాలు 15% పెరుగుతాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది. నిర్మాణ కాంట్రాక్టులే కాకుండా, ఇంధన సేవల విభాగంలోకీ ఎన్‌సీసీ అడుగుపెట్టిన విషయం విదితమే. ఇటీవల రూ.7,403 కోట్ల విలువైన మూడు స్మార్ట్‌ ఎనర్జీ మీటర్ల ప్రాజెక్టులను సంస్థ దక్కించుకుంది. ఇందులో ఒకటైన బిహార్‌ మీటర్‌ ప్రాజెక్టును ఎన్‌సీసీ సొంతంగా చేపడుతుంది. మిగిలిన రెండు ప్రాజెక్టుల కోసం (రూ.5,756 కోట్ల విలువ) రెండు ప్రత్యేక కంపెనీలు (ఎస్‌పీవీ) ఏర్పాటు చేసింది. ఈ రెండు కంపెనీలు ప్రస్తుతం నిధుల సమీకరణ యత్నాలు చేపట్టాయి. నిధులు సమకూర్చుకుని, నిర్ణీత గడువులోపు స్మార్ట్‌ మీటర్‌ ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో ఉన్నాయి. 

ఎబిటా అంచనా 10 శాతం: గత ఆర్థిక సంవత్సరంలో ఎన్‌సీసీ ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.20,971 కోట్ల ఆదాయాన్ని, రూ.711 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23తో పోల్చితే ఆదాయం 34%, నికరలాభం 17% పెరిగాయి. చేతిలో ఉన్న ఆర్డర్లు, కొత్త ఆర్డర్లు లభించే అవకాశాలు పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయాల్లో 15% వృద్ధి సాధించగలమని భావిస్తున్నట్లు ఆర్‌.ఎస్‌.రాజు వివరించారు. ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ఇతర కేటాయింపుల కంటే ముందు ఆదాయం) 9.5- 10 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. 

రుణం తగ్గుతోంది:  కంపెనీకి రుణభారం గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోల్చితే నాలుగో త్రైమాసికంలో రూ.400 కోట్లకు పైగా తగ్గింది. దీనివల్ల రుణభారం ప్రస్తుతం రూ.1,005 కోట్లు మాత్రమే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి దీన్ని ఇంకా తగ్గించుకుని, రూ.500 కోట్లకు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజు తెలిపారు. ‘ట్రేడ్‌ రిసీవబుల్స్‌’ గత ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు తగ్గి రూ.2,791 కోట్లకు పరిమితం అయినట్లు చెప్పారు. గ్రూపు కంపెనీల్లో పచ్వారా కోల్‌ మైనింగ్, ఎన్‌సీసీ అర్బన్‌ గత ఆర్థిక సంవత్సరంలో అధిక ఆదాయాలు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడి రూ.250 కోట్ల మేరకు ఉంటుందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడి రూ.249 కోట్లు ఉన్నట్లు, గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలోనే రూ.114 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు వివరించారు. స్మార్ట్‌ మీటర్‌ ప్రాజెక్టులకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని