ఒడుదొడుకుల్లో స్వల్ప లాభాలు

ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్న సూచీలు, లాభాల్లో ముగిశాయి. విద్యుత్, వాహన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది.

Published : 25 Jun 2024 02:17 IST

సమీక్ష

రంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్న సూచీలు, లాభాల్లో ముగిశాయి. విద్యుత్, వాహన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు జూన్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు దగ్గర పడటంతో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు పెరిగి 83.47 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.41% లాభంతో 85.59 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో లాభపడగా, మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 76,885.65 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభ ట్రేడింగ్‌లో 463.96 పాయింట్లు నష్టపోయి 76,745.94 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం పుంజుకుని లాభాల్లోకి వచ్చిన సూచీ, 77,423.02 దగ్గర గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 131.18 పాయింట్ల లాభంతో 77,341.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 36.75 పాయింట్లు పెరిగి 23,537.85 దగ్గర స్థిరపడింది.  

  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 రాణించాయి. ఎం అండ్‌ ఎం 2.69%, పవర్‌గ్రిడ్‌ 2.23%, సన్‌ఫార్మా 1.93%, నెస్లే 1.35%, అల్ట్రాటెక్‌ 1.14%, ఐసీఐసీఐ బ్యాంక్‌           1.03%, ఐటీసీ 0.87%, ఎన్‌టీపీసీ 0.85% లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.37%, అదానీ పోర్ట్స్‌   1.72%, టాటా స్టీల్‌ 1.08%, రిలయన్స్‌ 0.82%, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.64% నష్టపోయాయి.  
  • సోలార్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ అందించే జీపీ ఎకో సొల్యూషన్స్‌ ఇండియా షేరు అరంగేట్రంలో దూసుకెళ్లింది. ఇష్యూ ధర రూ.94తో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎమ్‌ఈ ప్లాట్‌ఫామ్‌పై  298.94% లాభంతో రూ.375 వద్ద ఈ షేరు నమోదైంది. చివరకు 303.94% పెరిగి రూ.393.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.461.11 కోట్లుగా నమోదైంది. 
  • స్టాన్లీ లైఫ్‌స్టైల్స్‌ ఐపీఓ రెండో రోజుకు 5.22 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,02,41,507 షేర్లను ఆఫర్‌ చేయగా, 5,34,55,000 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
  • టారో ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ విలీన ప్రక్రియ పూర్తయిందని సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. లావాదేవీ విలువ 347.73 మిలియన్‌ డాలర్లుగా తెలిపింది. విలీనం తర్వాత సన్‌ఫార్మాకు చెందిన పూర్తి అనుబంధ ప్రైవేట్‌ కంపెనీగా టారో పనిచేయనుంది. 2010 నుంచి టారోలో మెజారిటీ వాటాదారుగా సన్‌ఫార్మా ఉంది.
  • కోల్‌కతాలోని ఫ్యాక్టరీలో పని చేసే శాశ్వత ఉద్యోగులు అందరూ తమ స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి (వీఆర్‌ఎస్‌) అంగీకారం తెలిపారని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. వ్యాపార కార్యకలాపాలపై ఇది ప్రభావం చూపదని స్పష్టం చేసింది. 
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 ‘ఇన్‌ట్యూన్‌’ స్టోర్‌లు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు షాపర్స్‌ స్టాప్‌ తెలిపింది. అందుబాటు ధరల ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా ఈ స్టోర్‌లను రూపొందించారు. ట్రెంట్‌ జుడియో, మ్యాక్స్‌ ఫ్యాషన్‌ ల్యాండ్‌మార్క్‌లను ఇవి పోలిఉండనున్నాయి.
  • బిహార్‌లో బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థతో పాటు గ్రిడ్‌ అనుసంధానిత సోలార్‌ ప్లాంట్‌  నిర్మించేందుకు గణనీయమైన ఆర్డరు లభించిందని ఎల్‌ అండ్‌ టీ        ప్రకటించింది. కంపెనీ రూ.1000-2500 కోట్ల ప్రాజెక్టులను గణనీయమైన ఆర్డర్లుగా పరిగణిస్తుంది.
  • భారత జీడీపీ వృద్ధి 6.8%: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.8 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ఎస్‌ అండ్‌ పీ రేటింగ్స్‌ తెలిపింది. 2023-24లో భారత్‌ 8.2 శాతం వృద్ధి సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిందని పేర్కొంది.  2025-26లో 6.9%, 2026-27లో 7 శాతం వృద్ధి నమోదుకావొచ్చని వెల్లడించింది. 
  • ఆరు నెలల పాటు నమోదిత కంపెనీల్లో పనిచేయకుండా పీటీసీ ఇండియా ఛైర్మన్, ఎండీ రాజీవ్‌ కుమార్‌ మిశ్రాపై నిషేధం విధించిన సెబీ ఉత్తర్వులపై సెక్యూరిటీస్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) స్టే ఇచ్చింది. ఆయనపై విధించిన రూ.10 లక్షల జరిమానాలో 50 శాతాన్ని రెండు వారాల్లో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.
  • ఆంధ్రప్రదేశ్‌ యూనిట్‌లో 19.5 మెగావాట్‌ సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రారంభించామని, దీంతో మొత్తం ఇన్‌స్టాల్డ్‌ విద్యుత్‌ సామర్థ్యం 1000 మెగావాట్‌లు        (1 గిగావాట్‌)కు చేరిందని శ్రీ సిమెంట్‌ ప్రకటించింది. భవిష్యత్‌లో పునరుత్పాదక శక్తిపై దృష్టి పెట్టనున్నామని, దీనిపై రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించింది. 

క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌పై సెబీ విచారణ: ఫ్రంట్‌ రన్నింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌పై సెబీ విచారణ చేపట్టింది. సెబీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తెలిపింది. క్వాంట్‌కు చెందిన ముంబయి, హైదరాబాద్‌ కార్యాలయాల్లో సెబీ సోదాలు జరిపి, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. స్టాక్‌ బ్రోకర్‌ లేదా విశ్లేషకుల నుంచి కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని ముందే తెలుసుకుని లావాదేవీలు చేయడాన్ని ఫ్రంట్‌ రన్నింగ్‌గా పరిగణిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని