భారత్, చైనాల్లోని ఫార్మా యూనిట్ల తనిఖీల తీరుపై ఎన్నో అనుమానాలు

చైనా, భారత్‌లోని ఫార్మా కంపెనీల యూనిట్ల తనిఖీల తీరుతెన్నులపై యూఎస్‌ఎఫ్‌డీఏ (అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ)ను అమెరికా చట్ట సభలోని ముగ్గురు సభ్యులు నిలదీశారు.

Published : 26 Jun 2024 02:14 IST

యూఎస్‌ఎఫ్‌డీఏ కమిషనర్‌కు లేఖ రాసిన అమెరికా చట్టసభ సభ్యులు

వాషింగ్టన్‌: చైనా, భారత్‌లోని ఫార్మా కంపెనీల యూనిట్ల తనిఖీల తీరుతెన్నులపై యూఎస్‌ఎఫ్‌డీఏ (అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ)ను అమెరికా చట్ట సభలోని ముగ్గురు సభ్యులు నిలదీశారు. 2014 జనవరి నుంచి 2024 ఏప్రిల్‌ మధ్య కాలంలో ఈ రెండు దేశాల్లోని ఫార్మా యూనిట్లను యూఎస్‌ఎఫ్‌డీఏ ఇన్‌స్పెక్టర్లు తనిఖీ చేసి రూపొందించిన నివేదికలు ఆశ్చర్యాన్ని, అనుమానాలను కలిగించే విధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. హౌస్‌ ఎనర్జీ అండ్‌ కామర్స్‌ కమిటీ ఛైర్‌ కాథే మెక్‌మోరిస్‌ రోడ్జెర్స్, హెల్త్‌ సబ్‌కమిటీ ఛైర్‌ బ్రెట్‌ గుథ్‌రీ, ఓవర్‌సైట్‌ అండ్‌ ఇన్వెస్టిగేషన్స్‌ ఛైర్‌ మోర్గాన్‌ గ్రిఫిత్‌ ఈ మేరకు యూఎస్‌ఎఫ్‌డీఏ కమిషనర్‌ రాబర్ట్‌ కాలిఫ్‌కు ఈ నెల 21న ఒక లేఖ రాశారు. ఎఫ్‌డీఏ ప్రమాణాల్లోని లోపాలను, సంస్థాగత బలహీనతలను ఈ తనిఖీలు ప్రతిబింబిస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.

‘ఈ తనిఖీల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. కొంతమంది ఎఫ్‌డీఏ ఇన్‌స్పెక్టర్లు తాము నిర్వహించిన ప్రతి తనిఖీలో ఏదో ఒక లోపాన్ని కనుగొన్నారు. మరికొందరు ఇన్‌స్పెక్టర్లు అంతా బాగానే ఉన్నట్లు నివేదికలు ఇచ్చారు. ఏదైనా సమస్యను గుర్తించడం ఎంతో అరుదుగానే జరిగింద’ని పేర్కొన్నారు. ఒక ఇన్‌స్పెక్టర్‌ భారతదేశంలో నిర్వహించిన 24 తనిఖీల్లో ఒక్కదాంట్లో కూడా సమస్యలను గుర్తించలేదని తెలిపారు. మరొక ఇన్‌స్పెక్టర్‌ చైనాలో నిర్వహించిన 23 తనిఖీల్లో 20 తనిఖీల్లో ఎటువంటి సమస్యలు లేవని నివేదికలు ఇచ్చినట్లు, అదే సమయంలో స్వదేశంలో (యూఎస్‌లో) నిర్వహించిన తనిఖీల్లో సగానికి సగం వ్యతిరేక నివేదికలు ఇచ్చినట్లు వివరించారు. ‘చైనా, భారతదేశాల్లో అనుసరిస్తున్న  నాణ్యతా ప్రమాణాలు, జీఎంపీ (గుడ్‌ మానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌) ప్రమాణాల విషయంలో సందేహాలు ఉన్న తరుణంలో ఎఫ్‌డీఏ ఇన్‌స్పెక్టర్ల తనిఖీల్లో ఇటువంటి వైవిధ్యం ఉండటం ఆశ్చర్యకరం’ అని పేర్కొన్నారు. మరోపక్క 16 మంది ఇన్‌స్పెక్టర్లు భారతదేశంలో చేపట్టిన 325 తనిఖీల్లో.., ప్రతి తనిఖీలోనూ లోపాలు గుర్తించినట్లు తెలిపారు. అదే సమయంలో మరో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు చైనాలో తనిఖీలు నిర్వహించి ఎటువంటి లోపాలు లేవని నివేదికలు ఇచ్చినట్లు వివరించారు. 

ఈ తనిఖీల ఫలితాలు యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీల వ్యవస్థ సక్రమంగా లేదనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లోని ఫార్మా యూనిట్ల తనిఖీల తీరుతెన్నులపై తగిన పరిశీలన జరపాలని యూఎస్‌ఎఫ్‌డీఏ కమిషనర్‌ను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని