సంక్షిప్త వార్తలు(5)

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆఫీసు స్థలానికి అనూహ్య గిరాకీ లభిస్తోందని స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ ఇండియా తాజా నివేదికలో పేర్కొంది.

Published : 04 Jul 2024 02:43 IST

ఆఫీసు స్థలానికి రికార్డు స్థాయి గిరాకీ
జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక

దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆఫీసు స్థలానికి అనూహ్య గిరాకీ లభిస్తోందని స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ ఇండియా తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ మధ్యకాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 3.354 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్థలానికి గిరాకీ లభించినట్లు వెల్లడించింది. క్రితం ఏడాది ఇదేకాలంతో పోల్చినప్పుడు ఇది 29% అధికం. దిల్లీ ఎన్‌సీఆర్, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాలను ఈ నివేదిక కోసం పరిగణనలోకి తీసుకున్నారు. 2019 ప్రథమార్ధంతో పోల్చితే, ఈ ఏడాది ప్రథమార్ధంలో ఆఫీసు స్థలానికి లభించిన గిరాకీయే ఎక్కువ అని వెల్లడించింది. ఈ సంవత్సరం మొత్తం మీద 6.5- 7 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని వివిధ వ్యాపార సంస్థలు లీజు/అద్దెకు తీసుకునే అవకాశం ఉందని, వాణిజ్య స్థిరాస్తి మార్కెట్‌లో ఇదొక రికార్డు అవుతుందని జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక అభిప్రాయపడింది.


ఫోక్స్‌వ్యాగన్‌ సర్టిఫైడ్‌ ప్రీ-ఓన్డ్‌ విక్రయ కేంద్రాలు

కోయంబత్తూర్‌: జర్మనీకి చెందిన వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్, ప్రీ ఓన్డ్‌ వాహన విక్రయ వ్యాపారంలోకి ప్రవేశించింది. సర్టిఫైడ్‌ ప్రీ-ఓన్డ్‌ వ్యాపారంలో భాగంగా, తొలి బ్రాండ్‌ స్టోర్‌ను తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ప్రారంభించినట్లు సంస్థ బుధవారం వెల్లడించింది. వినియోగ కార్ల వ్యాపార బ్రాండ్‌ ‘దస్‌ వెల్ట్‌ఆటో’ను ‘ఫోక్స్‌వ్యాగన్‌ సర్టిఫైడ్‌ ప్రీ-ఓన్డ్‌’ కార్స్‌గా రీబ్రాండింగ్‌ చేసినట్లు తెలిపింది. గత 5 ఏళ్లలో ప్రీ-ఓన్డ్‌ వర్టికల్‌లో 10 రెట్లకు పైగా పరిమాణ వృద్ధి నమోదైందని ఫోక్స్‌వ్యాగన్‌ పేర్కొంది. వినియోగదార్లకు అధిక నాణ్యతతో కూడిన, నమ్మకమైన వాహనాలను అందిస్తామని, సమగ్రంగా తనిఖీ చేసి, వారెంటీ కవరేజీతో వినియోగ కార్లను విక్రయిస్తామని వివరించింది.


వృద్ధి బాటలో సేవల రంగం

దిల్లీ: భారత సేవల రంగం జూన్‌లో పుంజుకుంది. మేలో 5 నెలల కనిష్ఠానికి (60.2 పాయింట్లు) చేరిన పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ (పీఎంఐ), గత నెలలో 60.5 పాయింట్లకు చేరింది. కొత్త ఆర్డర్లలో బలమైన వృద్ధితో పాటు, ఊహించని విధంగా అంతర్జాతీయ విక్రయాలు పెరగడంతో సేవల రంగం వృద్ధి బాట పట్టిందని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ సూచీ నెల వారీ సర్వే వెల్లడించింది. పీఎంఐ 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధిగానూ, 50 పాయింట్ల దిగువన నమోదైతే క్షీణతగా పరిగణిస్తారు.


అన్‌అకాడమీలో 250 మందికి ఉద్వాసన!

దిల్లీ: కంపెనీకి వృద్ధి, లాభదాయకత విషయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) అత్యుత్తమ ఏడాదిగా నిలవనుందని అన్‌అకాడమీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ గౌరవ్‌ ముంజాల్‌ పేర్కొన్నారు. కంపెనీ విక్రయానికి ఉందంటూ ఊహాగానాల వచ్చిన నేపథ్యంలో, ‘దీర్ఘకాలానికి కంపెనీని నిర్మించే పనిలో యాజమాన్యం ఉంద’ని ‘ఎక్స్‌’లో ఆయన స్పష్టం చేశారు. బుధవారం కంపెనీ 250 మంది ఉద్యోగులను తొలగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో పనితీరు ప్రమాణాలను అందుకోలేని 150 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ 100 మందిని మాత్రమే తొలగించిందని, వారికి పరిహార ప్యాకేజీలూ చెల్లించిందని ఆ వర్గాలు తెలిపాయి. కంపెనీలో ఒక దశలో 6000 మంది ఉద్యోగులుండగా.. కరోనా అనంతరం తగ్గించుకుంటూ రావడంతో ఆ సంఖ్య ఇపుడు 3000కు పరిమితమైంది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అనుబంధ సంస్థతో మిత్సుబిషి చర్చలకు అవాంతరాలు

ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన వినియోగ రుణాల సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో మైనారిటీ వాటా కొనుగోలు నిమిత్తం మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్‌ గ్రూప్‌ ఇంక్‌(ఎమ్‌యూఎఫ్‌జీ) జరుపుతున్న చర్చలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. హెచ్‌డీబీ వ్యూహంలో మిత్సుబిషి పాత్ర ఎంత ఉండాలన్న అంశంపై భేదాభిప్రాయాలు రావడంతో, చర్చలు నిలిచిపోయాయని ఈ అంశంతో దగ్గరి సంబంధమున్న వ్యక్తులు పేర్కొన్నారు. ఇప్పటికే హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌పై ఎమ్‌యూఎఫ్‌జీ ఆసక్తిగానే ఉందని.. అయితే చర్చలు మరింత ఆలస్యం కావొచ్చని లేదంటే పూర్తిగా నిలిచిపోవచ్చనీ తెలిపారు. ప్రత్యామ్నాయంగా పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లాలని హెచ్‌డీఎఫ్‌సీ భావిస్తోందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని