రూ.10 లక్షల కోట్లకు ఆహార సేవల విపణి

దేశీయంగా ఆహార సేవల విపణి 2030 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని బెయిన్‌ అండ్‌ కంపెనీ, స్విగ్గీ సంయుక్త నివేదిక వెల్లడించింది. వినియోగదార్ల సంఖ్య అప్పటికి 45 కోట్ల వరకు చేరొచ్చని అంచనా వేసింది.

Published : 04 Jul 2024 02:51 IST

2030 నాటికి చేరే అవకాశం 
బెయిన్‌ అండ్‌ కంపెనీ - స్విగ్గీ నివేదిక

దిల్లీ: దేశీయంగా ఆహార సేవల విపణి 2030 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని బెయిన్‌ అండ్‌ కంపెనీ, స్విగ్గీ సంయుక్త నివేదిక వెల్లడించింది. వినియోగదార్ల సంఖ్య అప్పటికి 45 కోట్ల వరకు చేరొచ్చని అంచనా వేసింది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ విభాగం 18% వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌) సాధించొచ్చని తెలిపింది. 2023లో ఈ విభాగం వాటా 12% ఉండగా, 2030 నాటికి 20 శాతానికి చేరొచ్చని పేర్కొంది. ‘హౌ ఇండియా ఈట్స్‌’ పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం..

  • భారత్‌లో ఆహార సేవల విపణి ప్రస్తుతం రూ.5.5 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. వచ్చే ఏడేళ్లు వార్షికంగా 10-12% వృద్ధితో సాగి, 2030 నాటికి రూ.9-10 లక్షల కోట్లకు చేరొచ్చు.
  • ఈ వృద్ధికి బలమైన మూలాలతో పాటు వినియోగదార్ల సంఖ్య పెరగడం, వినియోగం పెరిగే సందర్భాలు, సరఫరాలో వృద్ధి వంటివి దోహదం చేస్తాయి. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ విభాగం మరింత వేగంగా సుమారు 18% వార్షిక వృద్ధితో సాగనుంది. 2030 నాటికి మొత్తం ఆహార సేవల విపణిలో దీని వాటా 20 శాతానికి చేరుతుంది.
  • భారతీయ ఆహార సేవల విపణిలో ప్రస్తుతం 32-34 కోట్ల మంది వినియోగదార్లు ఉండగా, 2030 నాటికి ఈ సంఖ్య మరో 11 కోట్లు పెరిగి 43-45 కోట్లకు చేరే అవకాశం ఉంది.
  • ఆహార సేవల వినియోగంలో 70% వాటా అగ్రగామి -50 నగరాల నుంచే వస్తోంది.. ఎగువ మధ్య తరగతి, అధికాదాయ ప్రజల నుంచి మధ్య కాలానికి ఈ సేవలకు అధిక గిరాకీ లభించొచ్చు. ద్వితీయ శ్రేణి నగరాల నుంచీ వృద్ధి నమోదు కావొచ్చు.
  • 2019 నుంచి 2023 వరకు చూస్తే, ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ విభాగ వాటా 8 నుంచి 12 శాతానికి పెరిగింది. మొత్తం ఆహార సేవల్లో ఈ విభాగం వాటా 2.8 రెట్లు పెరిగింది.
  • భారతీయ ఆహార సేవల విపణిలో ముఖ్యంగా ఆహార పదార్థాల సరఫరాలో కొన్నేళ్లుగా గణనీయ వృద్ధి చూస్తున్నామని స్విగ్గీ ఫుడ్‌ మార్కెట్‌ప్లేస్‌ సీఈఓ రోహిత్‌ కపూర్‌ వెల్లడించారు. అధిక ఆదాయాలు, డిజిటలీకరణ, మెరుగైన ఖాతాదారు అనుభవం, కొత్త రుచుల్ని ప్రయత్నించాలనే కోరిక వంటివి ఈ వృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని