పెట్టుబడుల ఉపసంహరణ భారీ స్థాయిలో లేనట్లే!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2.1 లక్షల కోట్ల డివిడెండును కేంద్రానికి ఇవ్వడంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  ప్రభుత్వరంగ సంస్థల్లో భారీ స్థాయి పెట్టుబడుల ఉపసంహరణలు ఉండకపోవచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ కేర్‌ రేటింగ్స్‌ అంచనా వేస్తోంది.

Published : 05 Jul 2024 03:47 IST

ఆర్‌బీఐ డివిడెండు నేపథ్యం
కేర్‌ రేటింగ్స్‌ అంచనా

ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2.1 లక్షల కోట్ల డివిడెండును కేంద్రానికి ఇవ్వడంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో భారీ స్థాయి పెట్టుబడుల ఉపసంహరణలు ఉండకపోవచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ కేర్‌ రేటింగ్స్‌ అంచనా వేస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని బడ్జెట్‌లో కేంద్రం రూ.50,000 కోట్లుగానే కొనసాగించొచ్చని అంటోంది. ఆర్‌బీఐ నుంచి భారీ డివిడెండు లభించడంతో, కేంద్రప్రభుత్వ ద్రవ్య పరిస్థితి సౌకర్యవంతంగా ఉండటమే ఇందుకు నేపథ్యం. ఒక వేళ నిధుల కొరత ఏర్పడితే, ప్రభుత్వం ఆస్తుల నగదీకరణకు మొగ్గుచూపొచ్చని అంటోంది. 

ఈ సంస్థల్లో వాటా విక్రయాలకు అవకాశం: ‘షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ)లో వాటా విక్రయం ఈ ఏడాది పూర్తి కావొచ్చు. సానుకూల మార్కెట్‌ పరిస్థితులు కలిసిరావొచ్చు. ఎస్‌సీఐలో కేంద్రం తన మొత్తం వాటా విక్రయిస్తే రూ.12,500-22,500 కోట్లు సమీకరించడానికి అవకాశం ఉంది. 

కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(కాన్‌కర్‌), పవన్‌ హన్స్‌ సంస్థల్లో వాటా విక్రయాలనూ ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంద’ని కేర్‌ రేటింగ్స్‌ భావిస్తోంది. 

గత పదేళ్లలో: గత 10 ఏళ్లలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.5.2 లక్షల కోట్లను కేంద్రం సమీకరించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో తన వాటా 51% కంటే కిందకు వెళ్లకుండానే అంటే మెజారిటీ వాటా అట్టేపెట్టి ఉంచుకుంటూనే.. మరో రూ.11.5 లక్షల కోట్లను ప్రభుత్వం సమీకరించేందుకు అవకాశం ఉందని కేర్‌ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా రూ.5 లక్షల కోట్లు; బీమా కంపెనీలు, బ్యాంకుల్లో వాటాల అమ్మకాల ద్వారా ఇంకో రూ.6.5 లక్షల కోట్ల సమీకరణకు వీలుందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని