సంక్షిప్త వార్తలు (2)

వినియోగదారుల డేటా లీక్‌ అయినట్లు వచ్చిన వార్తలను టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ శుక్రవారం కొట్టిపారేసింది.

Updated : 06 Jul 2024 02:34 IST

వినియోగదారుల డేటా లీక్‌ కాలేదు: ఎయిర్‌టెల్‌

దిల్లీ: వినియోగదారుల డేటా లీక్‌ అయినట్లు వచ్చిన వార్తలను టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ శుక్రవారం కొట్టిపారేసింది. కంపెనీ బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని వెల్లడించింది. డేటా లీక్‌ వార్తలపై దర్యాప్తు చేపట్టామని, ఎయిర్‌టెల్‌ వ్యవస్థల్లో ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. 37.5 కోట్ల మందికి పైగా ఎయిర్‌టెల్‌ ఖాతాదారులకు సంబంధించిన డేటాగా పేర్కొంటూ ‘ఎక్స్‌ఎన్‌జెన్‌’ పేరుతో ఉన్న హ్యాకర్, ఒక డేటాబేస్‌ను డార్క్‌వెబ్‌లో పెట్టాడు. ఇందులో వినియోగదారుల పేర్లు, ఫోన్‌ నంబర్లు, చిరునామా, ఇ-మెయిల్‌ ఐడీ వంటి వివరాలను అమ్మకానికి ఉంచాడు. 50,000 డాలర్లు చెల్లించి ఈ డేటా పొందొచ్చని పేర్కొనగా, కంపెనీ ఈ వివరణ ఇచ్చింది.   


40వేల ఫోక్స్‌వేగన్‌ కార్లను విక్రయించిన పీపీఎస్‌

హైదరాబాద్‌: దేశంలో ప్రతి 10 ఫోక్స్‌వేగన్‌ కార్లలో ఒకటి తామే విక్రయిస్తున్నామని పీపీఎస్‌ మోటార్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ సంఘ్వీ తెలిపారు. దాదాపు 15 ఏళ్లుగా ఫోక్స్‌వేగన్‌తో భాగస్వామ్యం అయ్యామని, ఇప్పటికి 40వేలకు పైగా వాహనాలు విక్రయించామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా 5 రాష్ట్రాల్లో 33 టచ్‌ పాయింట్లకు విస్తరించామని తెలిపారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని పీపీఎస్‌ మోటార్స్‌ షోరూంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 40,000వ కారును శుక్రవారం వినియోగదారుకు అందించారు. ఫోక్స్‌వేగన్‌ వినియోగదారులకు తాము అత్యంత నాణ్యతతో సేవలను అందిస్తున్నట్లు రాజీవ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని