సంక్షిప్తవార్తలు(5)

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ చర్యల నుంచి పాఠం నేర్చుకున్నట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ పేర్కొన్నారు.

Published : 07 Jul 2024 01:50 IST

ఆర్‌బీఐ చర్యలతో పాఠం నేర్చుకున్నాం
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ 

దిల్లీ: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ చర్యల నుంచి పాఠం నేర్చుకున్నట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఈ ఉదంతంతో తనకు ఎదురుదెబ్బ తగిలినట్లు అంగీకరించారు. అదే సమయంలో వృత్తిగతంగా బాధ్యతలను మరింత మెరుగ్గా ఎలా నిర్వహించాలో నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. అత్యంత సవాలుభరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ‘2013-2014-2015 సమయంలో మా నిధులు అయిపోయాయి. ఆ సమయంలో నేను వెనకడుగు వేసినా పెద్దగా ఎవరూ బాధపడేవారు కాదు. అయితే ఇపుడు అలా చేయలేను. కంపెనీ నాకు కూతురులాంటిది. స్కూలులో అత్యంత ప్రతిభను చూపే కూతురుకు ఎంట్రెన్స్‌ పరీక్షకు వెళ్లే సమయంలో ప్రమాదం జరిగితే.. అటువంటి భావోద్వేగమే నాకు కలిగింది’ అని తన మనసులో మాట పంచుకున్నారు.


టెలికాం ఛార్జీల పెంపుతో ద్రవ్యోల్బణం పెరగొచ్చు

2024-25లో 0.2% ప్రభావం
డాయిష్‌ బ్యాంక్‌ విశ్లేషకుల అంచనా

ముంబయి: దేశంలోని మూడు దిగ్గజ టెలికాం కంపెనీలూ టారిఫ్‌లను పెంచడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని డాయిష్‌ బ్యాంక్‌లోని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం (ఆహార, ఇంధన మినహాయించి) 0.20 శాతం పెరగొచ్చని భావిస్తున్నారు. టారిఫ్‌ పెంపులకు తోడు వర్షాల ప్రభావం వల్ల కూడా ద్రవ్యోల్బణం ధోరణి మారొచ్చని అంటున్నారు. జులై నుంచి టెలికాం టారిఫ్‌ల పెంపు ప్రభావం కనిపిస్తుందని.. కేవలం ఈ పెంపుల వల్లే ద్రవ్యోల్బణం నెలవారీగా చూస్తే 0.85 శాతం మేర పెరగవచ్చని అంటున్నారు. ఏడాదికి చూస్తే 0.20 శాతం మేర పెరగొచ్చు కాబట్టి.. అంతక్రితం ద్రవ్యోల్బణం అంచనా అయిన 3.6 శాతాన్ని 3.8 శాతానికి సవరిస్తున్న’ట్లు తెలిపారు.


జూన్‌లో నియామకాలు 8% తగ్గాయ్‌
నౌక్రీ జాబ్‌స్పీక్‌ సూచీ నివేదిక

ముంబయి: వైట్‌-కాలర్‌ (కార్యాలయాల్లో కూర్చొని చేసే ఉద్యోగాలు) నియామక కార్యకలాపాలు గత నెలలో 7.62 శాతం మేర తగ్గాయని నౌక్రీ జాబ్‌స్పీక్‌ సూచీ నివేదిక వెల్లడించింది. అన్ని రంగాల్లో నియామకాలు స్తబ్దుగా ఉన్నాయని తెలిపింది. 2023 జూన్‌లో 2,795 వైట్‌-కాలర్‌ ఉద్యోగాలు లభించగా, గత జూన్‌లో 7.62 శాతం తగ్గి 2,582కు పరిమితమయ్యాయని పేర్కొంది. రంగాల వారీగా టెలికాం   (12 శాతం), బీపీఓ/ఐటీఈఎస్‌ (9 శాతం), విద్య, బోధన (9 శాతం), గ్లోబల్‌ కేపబిలిటీ కేంద్రాల్లో (7 శాతం) నియామకాలు తగ్గినట్లు వెల్లడించింది. బీమా (28 శాతం), ఎఫ్‌ఎంసీజీ/ఆహార పరిశ్రమ (12 శాతం), ఔషధ (6 శాతం) రంగాల్లో సానుకూలతలు కనిపించాయని తెలిపింది. రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లోని జోధ్‌పూర్‌ (36 శాతం), కోటా (21 శాతం), ఉదయ్‌పూర్‌ (13 శాతం), రాజ్‌కోట్‌ (35 శాతం), సూరత్‌ (13 శాతం), జామ్‌నగర్‌ (13 శాతం)లు ఉద్యోగాల సృష్టిలో ముందున్నాయని పేర్కొంది. బెంగళూరు (9 శాతం), ముంబయి (6 శాతం) నగరాల్లో నియామక కార్యకలాపాలు తగ్గాయని నౌక్రీ.కామ్‌ ముఖ్య వ్యాపార అధికారి పవన్‌ వెల్లడించారు.


మరో రూ.40,000 కోట్ల పీఎల్‌ఐ పథకం
బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం

దిల్లీ: ఎలక్ట్రానిక్స్‌ సబ్‌-అసెంబ్లీస్, విడిభాగాల తయారీ నిమిత్తం మరో రూ.40,000 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. బడ్జెట్‌లో దీనిపై ప్రకటన రావొచ్చని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ కథనం వెల్లడించింది. దేశీయంగా విడిభాగాల తయారీని మరింతగా పెంచాలనే లక్ష్యంతో ఫిబ్రవరి నుంచే ఈ ప్రతిపాదనపై ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వద్ద కసరత్తు జరుగుతోందని ఆ వర్గాలు తెలిపాయి. దేశీయంగా విడిభాగాల లభ్యత సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో సంబంధిత వాటాదార్లందరితోనూ చర్చించి ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఈ పథకంలో పాల్గొనేందుకు కంపెనీలు ముందుకు వస్తాయా? అనేది సవాలుతో కూడిన అంశమేనని పరిశ్రమ వర్గాల్లో అంతర్గతంగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్ల సంయుక్త సంస్థల ద్వారా ఈ పథకం ప్రారంభం కావొచ్చని ఆ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే చైనా కంపెనీల సహకారం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల తయారీలో చైనాదే హవా. ఈ విభాగంలో చైనా వాటానే 90 శాతం వరకు ఉంటుంది. ఏటా 900 బిలియన్‌ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను చైనా ప్రపంచానికి ఎగుమతి చేస్తుండగా.. భారత ఎగుమతులు కేవలం 15 బిలియన్‌ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. చైనా మూడు దశాబ్దాలుగా నిర్మించుకున్న ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల తయారీ వ్యవస్థను కదిలించేందుకు భారత్‌ ప్రయత్నించబోతోందని ఆ వర్గాలు తెలిపాయి.


సిగ్నిటీ టెక్నాలజీస్‌ డైరెక్టర్ల బోర్డులో మార్పులు

ఈడీగా పంకజ్‌ ఖన్నా నియామకం
హరియాణా రాష్ట్రానికి రిజిస్టర్డ్‌ కార్యాలయం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ టెస్టింగ్‌ సేవల సంస్థ అయిన సిగ్నిటీ టెక్నాలజీస్‌ డైరెక్టర్ల బోర్డులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కంపెనీలో మెజార్టీ వాటాను  అగ్రశ్రేణి ఐటీ కంపెనీ అయిన కొఫోర్జ్‌ లిమిటెడ్‌ సొంతం చేసుక్ను విషయం విదితమే. అందువల్ల సిగ్నిటీ టెక్నాలజీస్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. సిగ్నిటీ టెక్నాలజీస్‌ బోర్డులో కొత్తగా నలుగురు డైరెక్టర్లు, ఒక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) నియమితులయ్యారు. సుధీర్‌ సింగ్, మనీష్‌ సరాఫ్, డి.కె.సింగ్, మొహువా సేన్‌గుప్తాలను డైరెక్టర్లుగా నియమించారు. పంకజ్‌ ఖన్నా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. పంకజ్‌ ఖన్నా రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఇప్పటి వరకూ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న శ్రీకాంత్‌ చక్కిలం రాజీనామా చేశారు. అదే విధంగా ఇప్పటి వరకూ సిగ్నిటీ టెక్నాలజీస్‌ బోర్డులో ఉన్న రామ్‌కృష్ణ అగర్వాల్, ఫణీష్‌ మూర్తి, శ్రీనాథ్‌ బత్తిని, నూరేన్‌ ఫజల్, సుధాకర్‌ పెన్నం తమ డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు. సిగ్నిటీ టెక్నాలజీస్‌ రిజిస్టర్డ్‌ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి హరియాణాకు మార్చాలని కూడా నిర్ణయించారు. శనివారం జరిగిన సిగ్నిటీ టెక్నాలజీస్‌ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని