ఎఫ్‌ఎంసీజీ ఆదాయ వృద్ధి 7-9%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఎఫ్‌ఎంసీజీ రంగ ఆదాయ వృద్ధి 7-9 శాతం మధ్య నమోదు కావొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక అంచనా వేసింది.

Published : 07 Jul 2024 01:55 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై క్రిసిల్‌ అంచనా

కోల్‌కతా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఎఫ్‌ఎంసీజీ రంగ ఆదాయ వృద్ధి 7-9 శాతం మధ్య నమోదు కావొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక అంచనా వేసింది. గ్రామీణ గిరాకీ పుంజుకోవడం, పట్టణ గిరాకీ స్థిరంగా కొనసాగుతుండటంతో విక్రయాల పరిమాణ వృద్ధి పెరిగి ఆదాయం అధికమవుతుందని పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఎంసీజీ రంగ వృద్ధి 5-7 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. ఆహార, పానీయాల (ఎఫ్‌ అండ్‌ బీ) విభాగంలో ముడి పదార్థాల ధరలు స్వలంగా పెరిగినందున, ఉత్పత్తులపై ఏక అంకె ధరల పెంపు ఉండొచ్చని నివేదిక తెలిపింది. వ్యక్తిగత సంరక్షణ, గృహ సంరక్షణ రంగాల్లో ముడి పదార్థాల ధరలు స్థిరంగా ఉన్నాయని వెల్లడించింది. ‘ఉత్పత్తుల విభాగం, సంస్థల వారీగా ఆదాయ వృద్ధిలో మార్పులు ఉండొచ్చు. ఎఫ్‌ అండ్‌ బీ విభాగం ఈ ఆర్థిక సంవత్సరంలో 8-9 శాతం వృద్ధి నమోదు చేయొచ్చు. గ్రామీణ గిరాకీ ఇందుకు దోహదం చేయనుంది. వ్యక్తిగత సంరక్షణ విభాగం 6-7 శాతం, గృహ సంరక్షణ విభాగం 8-9 శాతం మధ్య వృద్ధి నమోదు చేయొచ్చ’ని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ రవీంద్ర వర్మ వెల్లడించారు. ఎఫ్‌ఎంసీజీ సంస్థలు ఇతర సంస్థలను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాయని, తద్వారా ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించాలనుకుంటున్నాయని నివేదిక తెలిపింది. రుతుపవనాలు, వ్యవసాయ ఆదాయాలపై ఆధారపడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన మెరుగుదల నమోదు కావడం ఈ రంగానికి కలిసి రావొచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని