అపోలో హెల్త్‌లో అపోలో హాస్పిటల్స్‌కు మరింత వాటా

అనుబంధ సంస్థ అపోలో హెల్త్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌లో రూ.103.2 కోట్ల విలువైన వాటా కొనుగోలు చేయనున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రకటించింది. రైట్స్‌ ఇష్యూ ద్వారా ఈ వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది.

Published : 08 Jul 2024 01:46 IST

రూ.103 కోట్లతో కొనుగోలు

హైదరాబాద్‌: అనుబంధ సంస్థ అపోలో హెల్త్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌లో రూ.103.2 కోట్ల విలువైన వాటా కొనుగోలు చేయనున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రకటించింది. రైట్స్‌ ఇష్యూ ద్వారా ఈ వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో అపోలో హెల్త్‌ షేరును రూ.284 ప్రీమియంతో కలిపి, రూ.294 చొప్పున 35,12,107 షేర్లను కొనుగోలు చేస్తున్నామని, ఇందుకు రూ.103.2 కోట్లు వెచ్చించనున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో అపోలో హాస్పిటల్స్‌ పేర్కొంది. ఈ వాటా కొనుగోలు ప్రక్రియ సోమవారం (నేడు) ముగిసే అవకాశం ఉంది. అపోలో హెల్త్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా సొంత, ఫ్రాంఛైజీ క్లినిక్‌లు, ఆసుపత్రుల ద్వారా అధిక నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని కంపెనీ వివరించింది. స్పెషాలిటీ ఆసుపత్రులు, ప్రసూతి, డయాగ్నొస్టిక్‌ కేంద్రాలు, మధుమేహ క్లినిక్‌లు, దంత క్లినిక్‌లు, డయాలసిస్‌ కేంద్రాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో అపోలో హెల్త్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ టర్నోవర్‌ రూ.1365 కోట్లుగా ఉంది. తాజా లావాదేవీ అపోలో హెల్త్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ కార్యకలాపాలు, మూలధనం విస్తరణకు దోహదపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని