సంక్షిప్తవార్తలు(9)

గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగేతర ఆర్థిక సేవలు (ఎన్‌బీఎఫ్‌సీ) అందించే ద్వార క్షేత్రీయ గ్రామీణ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ద్వార కేజీఎఫ్‌ఎస్‌) ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టబోతోంది.

Updated : 09 Jul 2024 06:36 IST

ఆంధ్రప్రదేశ్‌లో ‘ద్వార కేజీఎఫ్‌ఎస్‌’ సేవలు

హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగేతర ఆర్థిక సేవలు (ఎన్‌బీఎఫ్‌సీ) అందించే ద్వార క్షేత్రీయ గ్రామీణ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ద్వార కేజీఎఫ్‌ఎస్‌) ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టబోతోంది. గ్లోబల్‌ జెండర్‌-స్మార్ట్‌ ఫండ్‌ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ ట్రిపుల్‌ జంప్‌ నుంచి 10 మిలియన్‌ డాలర్ల (మొత్తం సుమారు రూ.83 కోట్ల) నిధుల్ని సమీకరించింది.  ‘ట్రిపుల్‌ జంప్‌తో భాగస్వామ్యం మా ఆర్థిక మూలాలను మరింత బలోపేతం చేస్తుంది. తక్కువ ఆదాయ వనరుల వర్గానికి ఆర్థిక పరిష్కారాలు అందిస్తున్నాం. తాజా నిధుల సమీకరణతో మహిళలకు సూక్ష్మ రుణాలు అందిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టడం ద్వారా దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో మా ఉనికి ఉంద’ని ద్వార కేజీఎఫ్‌ఎస్‌ ఎండీ, సీఈఓ ఎల్‌వీఎల్‌ఎన్‌ మూర్తి వెల్లడించారు.


హైదరాబాద్‌ కార్యాలయాన్ని విస్తరించిన సీ1

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ సాంకేతిక సంస్థ సీ1 (గతంలో కన్వర్జ్‌వన్‌) హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీఐసీసీ)ను విస్తరించింది. కొత్తగా నియమించుకున్న ఉద్యోగులకు అనుగుణంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. సీ1 ఆర్‌అండ్‌డీ ల్యాబ్, సీ1 ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌నూ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేంద్రంలో 600 మంది పనిచేస్తున్నారని, 2025 నాటికి మరో 400 మందిని నియమించుకోబోతున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్, ఇండియా ఆపరేషన్స్‌ కంట్రీ హెడ్‌ చంద్ర బుడ్డోజు తెలిపారు. ప్రపంచానికి అవసరమైన ఆవిష్కరణలను ఇక్కడి నిపుణులు అందిస్తారని పేర్కొన్నారు.


జాంబియాలో లిథియం కోసం అన్వేషణ..

నవ లిమిటెడ్‌ అనుబంధ సంస్థకు లైసెన్స్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: నవ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ,  మాంబా కాలరీస్‌ లిమిటెడ్‌ (ఎంసీఎల్‌) ఆఫ్రికా ఖండంలోని జాంబియాలో లిథియం నిల్వల కోసం అన్వేషణ చేపట్టనుంది. ఈ సంస్థ జాంబియా దక్షిణ ప్రాంతంలో లిథియం నిల్వలతో పాటు అమెథిస్ట్, ఆక్వా మెరైన్, టాంటలమ్, టిన్‌ తదితర ఖనిజాల జాడ కోసమూ అన్వేషిస్తుంది. ఇందుకు అవసరమైన లైసెన్స్‌లను ఎంసీఎల్‌ సంపాదించింది. ఈ లైసెన్సుల కాలపరిమితి నాలుగేళ్లు. దాదాపు 8 వేల హెక్టార్ల పరిధిలో ఈ విలువైన ఖనిజాల కోసం అన్వేషించే అవకాశం ఉంది. ఖనిజాలను గుర్తించాక, వాటిని వెలికితీయడానికి అవసరమైన వ్యాపార ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంటుందని నవ లిమిటెడ్‌ పేర్కొంది.


క్యూఐపీ పద్ధతిలో పిట్టీ రూ.360 కోట్ల సమీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: సంస్థాగత మదుపరులకు క్యూఐపీ (క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌) పద్ధతిలో షేర్లు జారీ చేసి  రూ.360 కోట్లను పిట్టీ ఇంజినీరింగ్‌ సమీకరించనుంది. ఇందుకోసం రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు, రూ.1054.25 కనీస ధర నిర్ణయించింది. కంపెనీ బోర్డు ఏర్పాటు చేసిన ‘నిధుల సమీకరణ కమిటీ’ సోమవారం సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకుంది. జారీ ధర ఎంతనే విషయాన్ని ‘లీడ్‌ మేనేజర్‌’తో చర్చించి  నిర్ణయిస్తారు. దాని ప్రకారం ఎన్ని షేర్లు జారీ చేయాలనే నిర్ణయానికి వస్తారు. సేకరించిన నిధులను విస్తరణ కార్యకలాపాల కోసం కంపెనీ వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. 


ఎన్‌ఎఫ్‌సీఎల్‌కు సెబీ నుంచి ‘హెచ్చరిక లేఖ’

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జున ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌సీఎల్‌)కు సెబీ ‘హెచ్చరిక లేఖ’ జారీ చేసింది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ నియమాలను సక్రమంగా పాటించకపోవటం దీనికి ప్రధాన కారణం. ‘సెబీ ఎల్‌ఓడీఆర్‌ రెగ్యులేషన్స్‌ 2015’ ప్రకారం ఏ కంపెనీ అయినా రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశాలను నిర్ణీత గడువు ప్రకారం నిర్వహించాలి. రెండు సమావేశాల మధ్య 180 రోజుల కంటే ఎక్కువ సమయం ఉండకూడదు. ఎన్‌ఎఫ్‌సీఎల్‌లో ఈ సమావేశాలు గత ఏడాది జూన్‌ 15న, ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 7న జరిగాయి. ఈ రెండు సమావేశాల మధ్య 237 రోజుల సమయం ఉంది. దీన్ని నిబంధనల ఉల్లంఘనగా సెబీ పరిగణించింది. ఫలితంగా ‘హెచ్చరిక లేఖ’  జారీ చేసింది. ఇటువంటి పొరపాట్లు పునరావృతం కారాదని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని వచ్చే డైరెక్టర్ల బోర్డు సమావేశం ముందు ప్రస్తావించాలని సూచించింది.


27 రంగాల్లో ఉపాధి 3.31% వృద్ధి

ముంబయి: వ్యవసాయం, వాణిజ్యం, ఆర్థిక సేవలు తదితర 27 రంగాల్లో ఉపాధి పొందిన వారి సంఖ్య 2022-23లో 3.31% పెరిగి   59.66 కోట్లకు చేరిందని ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. 2021-22లో ఈ 27 రంగాల్లో 57.75 కోట్ల మందికి ఉపాధి లభించింది. మొత్తం భారత ఆర్థిక వ్యవస్థలోని 27 రంగాలకు సంబంధించిన గణాంకాలను ఆర్‌బీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. 1980-81 నుంచి 2022-23 వరకు 27 రంగాల్లోని ఉత్పాదకత వివరాలనూ అందుబాటులో ఉంచింది. వ్యవసాయం, వేట, ఫారెస్ట్రీ, ఫిషింగ్‌లో 2021-22లో 24.82 కోట్ల మంది ఉపాధి పొందగా, 2022-23లో 25.3 కోట్ల మందికి ఉపాధి దొరికింది. 


టాటా అంతర్జాతీయ విక్రయాలు 2% పెరిగాయ్‌

దిల్లీ: టాటా మోటార్స్‌ అంతర్జాతీయ విక్రయాలు 2024 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 2% పెరిగి 3,29,847కు చేరాయి. 2023-24 ఇదే కాలంలో విక్రయాలు 3,22,159గా నమోదయ్యాయి. ప్రయాణికుల వాహనాల అంతర్జాతీయ టోకు విక్రయాలు 1% తగ్గి 1,38,682కు పరిమితమయ్యాయి. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ సరఫరాలు 5% పెరిగి 97,755గా నమోదయ్యాయి. టాటా వాణిజ్య వాహనాలు, టాటా దేవూ శ్రేణి వాహనాల అంతర్జాతీయ టోకు విక్రయాలు 6%పెరిగి 93,410గా నమోదయ్యాయి.


జీవిత బీమా కొత్త ప్రీమియం వసూళ్లలో 23% వృద్ధి

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌- జూన్‌)లో జీవిత బీమా సంస్థల కొత్త వ్యాపార ప్రీమియం వసూళ్లు, ఏడాది క్రితంతో పోలిస్తే 22.9% పెరిగాయి. జీవిత బీమా మండలి సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కొత్త వ్యాపార ప్రీమియం వసూళ్లు కిందటేడాది జూన్‌లోని రూ.36,961 కోట్ల నుంచి 14.80% పెరిగి ఈ ఏడాది జూన్‌లో రూ.42,433 కోట్లకు చేరాయి. 2023-24 ఏప్రిల్‌ జూన్‌లో కొత్త ప్రీమియం వసూళ్లు రూ.73,004 కోట్లు కాగా.. 2024-25 ఏప్రిల్‌- జూన్‌లో ఇవి రూ.89,726 కోట్లకు పెరిగాయి. వ్యక్తుల నుంచి బీమా రక్షణకు అధిక గిరాకీ ఏర్పడినందున, జూన్‌లో కొత్త పాలసీల జారీ వార్షిక ప్రాతిపదికన 12.13% పెరిగింది. కిందటేడాది జూన్‌లో కొత్తగా 19,43,529 పాలసీలు జతకాగా... ఈ ఏడాది జూన్‌లో ఈ సంఖ్య 21,79,282గా నమోదైంది. జూన్‌లో వ్యక్తుల సింగిల్‌ ప్రీమియం వసూళ్లు 14.87% పెరిగి రూ.3,823 కోట్లకు చేరాయి. వ్యక్తుల నాన్‌- సింగిల్‌ ప్రీమియం వసూళ్లు జూన్‌లో 19.61% అధికమై రూ.8,310 కోట్లుగా నమోదయ్యాయి. ఈ తరహా ప్రీమియం త్రైమాసిక వసూళ్లలోనూ 19.92% వృద్ధి ఉంది. 


గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌లో 12.65% వాటా విక్రయించిన ఆర్‌కేఎన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 

లావాదేవీ విలువ రూ.3,803 కోట్లు 

దిల్లీ: గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌లోని రూ.3,803 కోట్ల విలువైన షేర్లను గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ సభ్యులకు గోద్రేజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూప్‌లో భాగమైన ఆర్‌కేఎన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సోమవారం విక్రయించింది. ఏప్రిల్‌లో ప్రకటించిన గోద్రేజ్‌ కుటుంబ పరిష్కారం (ఫ్యామిలీ సెటిల్‌మెంట్‌)లో భాగంగా ఈ లావాదేవీ జరిగింది. బీఎస్‌ఈలో అందుబాటులో ఉన్న బ్లాక్‌ డీల్‌ డేటా ప్రకారం, 4,25,83,272 గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లను (12.65% వాటాకు సమానం) రూ.3,802.90 కోట్లకు ఆర్‌కేఎన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ విక్రయించింది. ఒక్కో షేరును సగటున రూ.893.05 వద్ద అమ్మింది. ఈ షేర్లను ప్రమోటర్లు నదీర్‌ బుర్జోర్‌ గోద్రేజ్, పిరోజ్‌షా ఆది గోద్రేజ్, నిసాబా గోద్రేజ్, తాన్యా దుబాష్‌ కొనుగోలు చేశారు. దీంతో గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌లో వారి వాటా పెరిగింది. సోమవారం బీఎస్‌ఈలో గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ షేరు 0.82% పెరిగి రూ.899.90 వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని