కోటక్‌ను కింగ్డన్‌ తప్పుదోవ పట్టించిందా?

అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌తో ఉన్న అనుబంధంపై, హెడ్జ్‌ ఫండ్‌ అయిన కింగ్డన్‌ క్యాపిటల్‌ తమను కావాలనే తప్పుదోవ పట్టించిందా అన్న కోణంలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ పరిశీలన చేస్తోందని తెలుస్తోంది.

Published : 09 Jul 2024 02:56 IST

పరిశీలన చేస్తున్న దేశీయ బ్యాంకు
చట్టపర చర్యలపైనా దృష్టి

మెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌తో ఉన్న అనుబంధంపై, హెడ్జ్‌ ఫండ్‌ అయిన కింగ్డన్‌ క్యాపిటల్‌ తమను కావాలనే తప్పుదోవ పట్టించిందా అన్న కోణంలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ పరిశీలన చేస్తోందని తెలుస్తోంది. కింగ్డన్‌ క్యాపిటల్‌కు ఒక విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్‌ (ఎఫ్‌పీఐ) లైసెన్సు అందేలా చేసినందుకు, మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ నుంచి కోటక్‌కు షోకాజ్‌ నోటీసు అందిన విషయం తెలిసిందే. కింగ్డన్‌ ఇచ్చిన స్వీయ ధ్రువీకరణ పత్రాలు, తమను తప్పుదోవ పట్టించాయేమోనని కోటక్‌ ప్రస్తుతం పరిశీలిస్తోందని ఈ అంశాలతో సంబంధమున్న వర్గాలను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. కార్పొరేట్‌ పాలనలో లోపాలున్నాయని, తమ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకునేందుకు పలు అవకతవకలకు అదానీ గ్రూప్‌ పాల్పడిందంటూ గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్‌ ఒక నివేదిక వెలువరచిన సంగతి తెలిసిందే. ఆ నివేదిక ఫలితంగా, అదానీ గ్రూప్‌నకు చెందిన నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ 150 బిలియన్‌ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయి.. మళ్లీ కోలుకుంటోంది. 

ఇదీ తేడా: అదానీ గ్రూప్‌ సంస్థల షేర్లలో చేసిన అన్ని ట్రేడ్స్‌ ‘ప్రిన్సిపల్‌ ట్రేడ్స్‌’ అని కింగ్డన్‌ అంటోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. కింగ్డన్‌ వంటి ఆఫ్‌షోర్‌ ఫండ్‌లు ‘ప్రొప్రైటరీ ట్రేడ్స్‌’ మాత్రమే చేయాలి. ఏ విధమైన థర్డ్‌ పార్టీ పేరిట పెట్టుబడులు పెట్టడానికి వీలు లేదు. మరో వైపు, నిజనిర్థారణ పూర్తయిన అనంతరం కింగ్డన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంపై ఒక నిర్ణయానికి కోటక్‌ వస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌తో లాభాల పంపక ఒప్పందాన్ని కింగ్డన్‌ కుదుర్చుకున్నట్లు సెబీ దర్యాప్తులో తేలింది. అంటే హిండెన్‌బర్గ్‌ తరఫున కింగ్డన్‌ పాక్షికంగానైనా ట్రేడింగ్‌ చేసినట్లు అవుతుంది. ఇదే జరిగితే వాటిని ‘ప్రిన్సిపల్‌ ట్రేడ్స్‌’గా పరిగణించరు. ఈ పరిణామాలపై అటు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కానీ, కింగ్డన్‌ క్యాపిటల్‌ కానీ ఇంకా స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని