టాటా విమానయాన కంపెనీల విలీనంలో మరో అడుగు

టాటా గ్రూప్‌నకు చెందిన అన్ని విమానయాన కంపెనీల నిర్వహణ విధివిధానాల (ఆపరేటింగ్‌ మాన్యువల్స్‌)ను సమన్వయం చేయడం పూర్తయింది.

Published : 09 Jul 2024 02:57 IST

పూర్తయిన ఆపరేటింగ్‌ మాన్యువల్స్‌ సమన్వయం

ముంబయి: టాటా గ్రూప్‌నకు చెందిన అన్ని విమానయాన కంపెనీల నిర్వహణ విధివిధానాల (ఆపరేటింగ్‌ మాన్యువల్స్‌)ను సమన్వయం చేయడం పూర్తయింది. దీంతో విస్తారా-ఎయిరిండియా, ఏఐఎక్స్‌ కనెక్స్‌-ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ల విలీనాల దిశగా మరో అడుగు పడినట్లయింది. ప్రస్తుతం ఈ గ్రూప్‌నకు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్‌ కనెక్ట్‌ (అంతక్రితం ఎయిరేషియా ఇండియా)లపై పూర్తి యాజమాన్య హక్కులుండగా.. విస్తారాలో మెజారిటీ వాటా(51%) ఉంది. విస్తారాలో మిగిలిన 49% వాటా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు ఉంది. ఆపరేటింగ్‌ మాన్యువల్స్‌ సమన్వయం పూర్తయిన అనంతరం, ఎయిరిండియా ప్రతినిధి మాట్లాడుతూ ‘ఇకపై రెండు మాన్యువళ్లు ఉంటాయి. ఒకటి ఎయిరిండియాకు, ఇంకోటి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు ఉంటుంద’ని వివరించారు. అంతక్రితం ప్రతి సంస్థ విడివిడిగా ఒక్కోటి చొప్పున మొత్తం నాలుగు మాన్యువల్స్‌ ఉండేవి. గత 18 నెలల్లో దాదాపు 100 మంది సభ్యులకు పైగా ఉన్న ఒక బృందం ఈ విధివిధానాల్లోని అత్యుత్తమ  వాటిని ఎంచుకోవడంతో పాటు, ఇతర ప్రక్రియలను సమన్వయం చేయడంపై పనిచేసిందని కంపెనీ తెలిపింది. టాటా గ్రూప్‌ విమానయాన కంపెనీల విలీనంలో ఇది ముఖ్యమైన మైలురాయి అని ఎయిరిండియా ఎండీ, సీఈఓ కాంప్‌బెల్‌ విల్సన్‌ పేర్కొన్నారు. కొత్త మాన్యువల్స్‌పై సిబ్బందికి అవసరమైన శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని