సంక్షిప్తవార్తలు(7)

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మద్దతు ఇచ్చేందుకు బ్యాంకింగ్‌ రంగం సిద్ధంగా ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ జె. స్వామినాథన్‌ పేర్కొన్నారు.

Published : 10 Jul 2024 02:18 IST

భారత బ్యాంకింగ్‌ రంగం భేష్‌
వృద్ధికి మద్దతిచ్చే సామర్థ్యంతో ఉంది
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ స్వామినాథన్‌ 

ముంబయి: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మద్దతు ఇచ్చేందుకు బ్యాంకింగ్‌ రంగం సిద్ధంగా ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ జె. స్వామినాథన్‌ పేర్కొన్నారు. అన్ని ఆర్థిక పరామితుల దృష్ట్యా మన బ్యాంకింగ్‌ వ్యవస్థ దశాబ్ద గరిష్ఠ స్థాయుల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. వాణిజ్య బ్యాంకులు, అన్ని భారతీయ ఆర్థిక సంస్థలకు చెందిన ఆడిటర్లు, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్ల సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘ఆడిటింగ్‌ ప్రక్రియ సమర్థతను పెంచేందుకు ఆర్‌బీఐ పలు చర్యలు చేపట్టింది. బ్యాంకింగ్‌ వ్యవస్థపై విశ్వాసం కొనసాగాలంటే.. పారదర్శకతతో ఉండడం, నిబంధనలను పాటించడం, వృత్తినైపుణ్యంతో వ్యవహరించడం తదితర అంశాల్లో అత్యున్నత ప్రమాణాలను కొనసాగించాల’ని అన్నారు. ఆర్‌బీఐ తాజా ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌) ప్రకారం.. వాణిజ్య బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 2024 మార్చి ఆఖరుకు 12 ఏళ్ల కనిష్ఠ స్థాయి అయిన 2.8 శాతానికి చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి ఇవి 2.5 శాతానికి పరిమితం కావచ్చొన్న అంచనాలు ఉన్నాయి. మన వ్యవస్థలో ఆడిటర్ల పాత్ర చాలా కీలకమని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎం. రాజేశ్వర రావు తన కీలకోపన్యాసంలో వ్యాఖ్యానించారు.  


కాలిఫోర్నియాలో సగం అంకురాలు ప్రవాసులవే

వాషింగ్టన్‌: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పాటైన అంకుర సంస్థల్లో 42 శాతం ప్రవాసుల/వలసదార్లవేనని గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక నిధుల సమీకరణ కార్యక్రమంలో దిగ్గజ భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్తలనుద్దేశించి ప్రసంగించారు. యూఎస్‌ ఇండియా సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ రమేశ్‌ విశ్వనాథ్‌ కపుర్, ఆయన భార్య సుసాన్‌ ఈ కార్యక్రమం నిర్వహించారు. ‘మొత్తం అంకురాల్లో 42% వలసదార్లు స్థాపించినవే. మా రాష్ట్రానికి వాళ్లు జీవనాడి లాంటి వారు. స్థానికత, విద్వేషం వంటివి మా రాజకీయాల్లో కలిసిపోయాయి. ముఖ్యంగా డొనాల్డ్‌ ట్రంప్‌ లాంటి వ్యక్తులు ఈ విషయంలో ముందుంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ కాలిఫోర్నియాలో అంకుర వ్యవస్థ బలంగా నిలబడగలిగింది. భిన్నత్వాన్ని ఆహ్వానించినందు వల్లే తయారీలో ముందున్నాం. అత్యధిక సంఖ్యలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నోబెల్‌ గ్రహీతలు మా దగ్గర ఉన్నార’ని గవిన్‌ వివరించారు. 


 అఫిడవిట్‌ దాఖలుకు పతంజలికి సుప్రీం కోర్టు ఆదేశాలు

దిల్లీ: కంపెనీకి చెందిన 14 ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార ప్రకటనలను ఉపసంహరించుకున్నారో లేదో ఒక అఫిడవిట్‌ రూపంలో తెలియజేయాలని పతంజలి ఆయుర్వేద్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద్, దివ్య ఫార్మాసీకి చెందిన 14 ఉత్పత్తుల తయారీ లైసెన్సులను ఏప్రిల్‌ 15న ఉత్తరాఖండ్‌ స్టేట్‌ లైసెన్సింగ్‌ అథారిటీ రద్దు చేసింది. అయితే ఈ ఆదేశాలను మే 17న   నిలువరించారు. ఆ తర్వాత సస్పెన్షన్‌ ఆదేశాలను రద్దు చేశారు. ‘ఏప్రిల్‌ 15 నాటి రద్దు ఉత్తర్వుల నేపథ్యంలో 14 ఉత్పత్తుల విక్రయాలను నిలిపినట్లు మే 16 నాటి అఫిడవిట్‌లో కంపెనీ తెలిపింది. అయితే వాటికి సంబంధించిన వ్యాపార ప్రకటనలను ఉపసంహరించాలని సామాజిక మాధ్యమ ఇంటర్మీడియరీలకు కంపెనీ విజ్ఞప్తి పంపిందా లేదా అన్నది అఫిడవిట్‌ రూపంలో తెలిపాల’ని న్యాయమూర్తులు జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్, ఆధునిక వైద్య వ్యవస్థలకు వ్యతిరేకంగా పతంజలి ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎమ్‌ఏ) వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేస్తోంది. అఫిడవిట్‌ దాఖలుకు పతంజలి కంపెనీకి రెండు వారాల సమయాన్ని ధర్మాసనం ఇచ్చింది. 


  • ఎల్‌ అండ్‌ టీ చేతికి భారీ ఆర్డర్‌: రెండు ఫ్లీట్‌ సపోర్ట్‌ నౌకల (ఎఫ్‌ఎస్‌ఎస్‌) నిర్మాణం కోసం హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ నుంచి ‘గణనీయ’ ఆర్డరు దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది. ఈ ఆర్డరు విలువ రూ.1000- 2500 కోట్లు ఉండొచ్చు.

  •  బెంగళూరుకు చెందిన సిలికాంచ్‌ సిస్టమ్స్‌ను రూ.183 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. ఈ కొనుగోలుతో ఫ్యాబ్‌లెస్‌ సెమీకండక్టర్‌ వ్యాపారంలో మరింత బలోపేతం కానున్నట్లు వెల్లడించింది. 

  • అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలకు తోడ్పడేలా పలు ఉత్పత్తులను తీసుకొచ్చినట్లు బంధన్‌ బ్యాంక్‌ పేర్కొంది. లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌సీలు), రెమిటెన్స్, బ్యాంక్‌ గ్యారెంటీ, ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ కలెక్షన్‌ బిల్, బిల్‌/ఇన్‌వాయిస్‌ డిస్కౌంటింగ్‌ వంటివి ఇందులో ఉన్నాయి. 

  •  రూ.1.27 లక్షలు పెడితే రూ.11.81 లక్షలకు: బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై జీఎం పాలీప్లాస్ట్‌ షేరు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. 2020లో ఈ కంపెనీ ఐపీఓకు వచ్చింది. ఇష్యూ ధరను రూ.159గా నిర్ణయించారు. మదుపర్లు ఒక్కో లాట్‌ (800 షేర్ల)ను రూ.1.27 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. తాజాగా కంపెనీ 6:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను ప్రకటించింది. అంటే ప్రతి షేరుకు 6 షేర్లు అదనంగా వచ్చాయి. అంటే ఒక అప్పట్లో ఒక లాట్‌ తీసుకున్న వారి షేర్లు, ఇప్పుడు 5600కు చేరాయి. మంగళవారం షేరు రూ.211 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. దీంతో రూ.1.27 లక్షల పెట్టుబడి రూ.11.81 లక్షలకు చేరింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని