పేటీఎమ్‌కు ఊరట

ఫిన్‌టెక్‌ అంకురం పేటీఎమ్‌కు ఊరట లభించింది. దీర్ఘకాల ఎదురు చూపుల అనంతరం, కీలక అనుబంధ సంస్థలో దాదాపు రూ.50 కోట్ల (6 మిలియన్‌ డాలర్ల) పెట్టుబడులు వచ్చేందుకు ప్రభుత్వ కమిటీ ఒకటి ఆమోదం తెలిపిందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.

Published : 10 Jul 2024 02:19 IST

అనుబంధ సంస్థలో పెట్టుబడులకు ఆమోదం

దిల్లీ: ఫిన్‌టెక్‌ అంకురం పేటీఎమ్‌కు ఊరట లభించింది. దీర్ఘకాల ఎదురు చూపుల అనంతరం, కీలక అనుబంధ సంస్థలో దాదాపు రూ.50 కోట్ల (6 మిలియన్‌ డాలర్ల) పెట్టుబడులు వచ్చేందుకు ప్రభుత్వ కమిటీ ఒకటి ఆమోదం తెలిపిందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. ఈ ఆమోదానికి ఆర్థిక శాఖ అనుమతులు లభించాల్సి ఉంది. ఒక్కసారి అవీ దక్కితే పేటీఎమ్‌ పేమెంట్‌ సర్వీసెస్, సాధారణ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి వీలవుతుందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిబంధనలను పాటించని కారణంగా ఈ ఏడాది పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో, పేటీఎమ్‌ షేరు నష్టాల పాలవుతోంది. చైనాకు చెందిన యాంట్‌ గ్రూప్‌నకు పేటీఎమ్‌లో 9.88% వాటా ఉన్న కారణంగా, అనుబంధ సంస్థల్లో పెట్టుబడులకు ప్రభుత్వ కమిటీ అనుమతులు దక్కలేదు. 2020లో భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాక, దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న చైనా కంపెనీలపై పరిశీలనను భారత్‌ తీవ్రతరం చేసింది. మొత్తం మీద రెండేళ్లుగా ప్రభుత్వ కమిటీ అనుమతుల కోసం పేటీఎమ్‌ వేచిచూసింది. 2023 మార్చిలో కొత్త వినియోగదార్లను తీసుకోకుండా పేమెంట్‌ సర్వీసుల వ్యాపారంపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో, తాజా అనుమతులు కూడా దక్కకపోయి ఉంటే పూర్తిగా ఈ విభాగాన్ని మూసివేయాల్సి వచ్చేది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని