జూన్‌లో సిప్‌ పెట్టుబడులు రూ.21,262 కోట్లు

క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (సిప్‌) కింద గత నెలలో మ్యూచువల్‌ ఫండ్‌ల్లో మదుపర్లు రూ.21,262 కోట్లు జమ చేశారు.

Published : 10 Jul 2024 02:23 IST

దిల్లీ: క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (సిప్‌) కింద గత నెలలో మ్యూచువల్‌ ఫండ్‌ల్లో మదుపర్లు రూ.21,262 కోట్లు జమ చేశారు. మేలో సిప్‌ పెట్టుబడులు రూ.20,904 కోట్ల కంటే ఇవి అధికమేనని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల సంఘం (యాంఫీ) వెల్లడించింది. సిప్‌ పెట్టుబడుల ద్వారా వచ్చిన మొత్తం ఆస్తుల నిర్వహణ రూ.12.43 లక్షల కోట్లకు పెరిగింది. స్టాక్‌ మార్కెట్ల రాణింపు, కొత్త పెట్టుబడుల రాక ఇందుకు తోడ్పడిందని యాంఫీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వెంకట్‌ చలసాని తెలిపారు. జూన్‌లో కొత్తగా 55 లక్షల సిప్‌ ఖాతాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం సిప్‌ ఖాతాల సంఖ్య 8.98 కోట్లకు చేరింది. 32.35 లక్షల ఖాతాలు మూసివేశారు. అయితే జూన్‌లో సిప్‌ నికర పెట్టుబడుల విలువను  వెంకట్‌ వెల్లడించలేదు. జూన్‌ నాటికి మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.61.33 లక్షల కోట్లుగా ఉంది. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని, ముందస్తు పన్ను చెల్లింపులు ఇందుకు కారణమని చలసాని తెలిపారు. 

ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి రూ.40,000 కోట్లు: జూన్‌లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో మదుపర్లు రూ.40,608 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మే నెలతో పోలిస్తే ఈ పెట్టుబడులు 17% అధికం. జూన్‌ నాటికి ఈక్విటీ ఫండ్‌ పథకాల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.27.67 లక్షల కోట్లుగా నమోదైంది. డెట్‌ పథకాల నుంచి జూన్‌లో రూ.1.07 లక్షల కోట్లను మదుపర్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ పథకాల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ జూన్‌ 30 నాటికి రూ.14.13 లక్షల కోట్లకు తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని