ఓఎన్‌జీసీ రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు!

ప్రభుత్వ రంగ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) పునరుత్పాదక ఇంధనం, హరిత హైడ్రోజన్‌ ప్లాంట్లపై సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది.

Published : 10 Jul 2024 02:27 IST

2038కి శూన్య కర్బన ఉద్గార లక్ష్యం

దిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) పునరుత్పాదక ఇంధనం, హరిత హైడ్రోజన్‌ ప్లాంట్లపై సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. 2038 నాటికి నికర శూన్య కర్బన ఉద్గార స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో కంపెనీ అడుగులు వేస్తోంది. మన దేశానికి అవసరమైన ముడి చమురులో 2/3 వంతు, సహజ వాయువులో 58 శాతాన్ని ఓఎన్‌జీసీ ఉత్పత్తి చేస్తోంది. నికర శూన్య ఉద్గార స్థితికి చేరుకునేందుకు మార్గసూచీని మంగళవారం  కంపెనీ విడుదల చేసింది. దేశ ఇంధన అవసరాలను తీర్చడానికి హైడ్రోకార్బన్‌ ఉత్పత్తి పెంచాలని చూస్తున్నప్పటికీ, స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులపైనా దృష్టి సారిస్తున్నట్లు అందులో తెలిపింది.

90 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయ్‌: 2030 నాటికి రూ.97,000 కోట్ల పెట్టుబడులతో 5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన పునరుత్పాదక ఇంధనం, హరిత హైడ్రోజన్, బయోగ్యాస్, పంప్‌ స్టోరేజీ ప్లాంట్, ఆఫ్‌షోర్‌ పవన ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు ఓఎన్‌జీసీ వివరించింది. 2035 నాటికి మరో రూ.65,500 కోట్ల పెట్టుబడులతో హరిత హైడ్రోజన్‌ లేదా హరిత అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. 2038 నాటికి మరో రూ.38,000 కోట్ల పెట్టుబడులతో 1 గిగావాట్‌ సామర్థ్యంతో ఆఫ్‌షోర్‌ పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. వీటి మొత్తం పెట్టుబడులు సుమారు రూ.2 లక్షల కోట్లకు చేరతాయని వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల సాయంతో 90 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటామని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని