సంక్షిప్త వార్తలు(6)

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా బుధవారం అపాచీ 2024 ఆర్‌టీఆర్‌ 160 రేసింగ్‌ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధర  రూ.1,28,270 (ఎక్స్‌-షోరూమ్, దిల్లీ).

Updated : 11 Jul 2024 10:15 IST

అపాచీ ఆర్‌టీఆర్‌ 160 రేసింగ్‌ ఎడిషన్‌
ధర రూ.1,28,270

చెన్నై: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా బుధవారం అపాచీ 2024 ఆర్‌టీఆర్‌ 160 రేసింగ్‌ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధర  రూ.1,28,270 (ఎక్స్‌-షోరూమ్, దిల్లీ). ఇది ఎక్స్‌క్లూజివ్‌ మ్యాట్‌ బ్లాక్‌ కలర్, రెడ్‌ అల్లాయ్‌ వీల్స్, మూడు రైడ్‌ మోడ్‌లు (స్పోర్ట్, అర్బన్, రెయిన్‌), డిజిటల్‌ లిక్విడ్‌ క్రిస్టల్‌ డిస్‌ప్లే (ఎల్‌సీడీ) క్లస్టర్, ఎల్‌ఈడీ హెడ్, టెయిల్‌ ల్యాంప్స్‌ వంటి ఫీచర్లతో అందుబాటులో ఉంది. ‘టీవీఎస్‌ అపాచీ    సిరీస్‌లో స్థిరంగా వినూత్న ఉత్పత్తులు తీసుకొస్తున్నాం. టీవీఎస్‌ మోటార్‌ ఇంజినీరింగ్‌ ప్రతిభ, వారసత్వంతో యువ రైడర్లకు మంచి అనుభూతిని కలిగించే బైక్‌లను తీసుకొస్తున్నామ’ని కంపెనీ హెడ్, బిజినెస్‌-ప్రీమియం-విమల్‌ సంబ్లీ తెలిపారు.


బీఎండబ్ల్యూ ఆర్‌ 12, ఆర్‌ 12 నైన్‌టి బైక్‌లు

ధర రూ.19.90-20.90 లక్షలు

దిల్లీ: బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ ఆర్‌ 12, ఆర్‌ 12 నైన్‌టి రోడ్‌స్టర్‌ మోడళ్లను భారత విపణిలోకి విడుదల చేసింది. ఆర్‌ 12 ధర రూ.19.90 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) కాగా, ఆర్‌ 12 నైన్‌టి బైక్‌ ధర రూ.20.90 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది. రెండు మోడళ్లు కూడా 1,170 సీసీ బాక్సర్‌ ఇంజిన్‌తో రూపొందాయి. ఇవి ట్రయంఫ్‌ స్పీడ్‌ ట్విన్, ట్రయంఫ్‌ బొన్నేవిల్లే స్పీడ్‌మాస్టర్‌లతో మన దేశ విపణిలో పోటీ పడనున్నాయి. క్లాసిక్‌ రెట్రో డిజైన్, అల్యూమినియం ట్యాంక్, బ్రష్డ్‌ సైడ్‌ ప్యానెల్స్, డ్యూయల్‌ ఎగ్జాస్ట్స్, స్పోక్‌ వీల్స్, ఫుల్‌-ఎల్‌ఈడీ లైటింగ్, అడాప్టివ్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్స్‌ (ట్రాక్షన్‌ నియంత్రణ, కార్నరింగ్‌ ఏబీఎస్, ఇంజిన్‌ బ్రేకింగ్‌ నియంత్రణ, కీలెస్‌ ఇగ్నిషన్, టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వంటివి) తదితర ఫీచర్లు ఈ బైక్‌ల్లో ఉన్నాయి.


ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్‌పై నెలకు 3-4 కోట్ల లావాదేవీలు

2025 మార్చి నాటికి అంచనా: సీఈఓ

దిల్లీ: 2025 మార్చి కల్లా ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌(ఓఎన్‌డీసీ) ప్లాట్‌ఫామ్‌పై నెలకు 3-4 కోట్ల లావాదేవీలు జరగొచ్చని అంచనా వేస్తున్నామని ఓఎన్‌డీసీ సీఈఓ టి.కోషి తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ఓఎన్‌డీసీ ద్వారా 70 లక్షల లావాదేవీలు జరగగా.. జూన్‌లో కోటి లావాదేవీలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఈ సంఖ్య 3-4 కోట్లకు చేరొచ్చని భావిస్తున్నట్లు సీఐఐ నిర్వహించిన ‘ఎంఎస్‌ఎమ్‌ఈ వృద్ధి సదస్సు’లో మాట్లాడుతూ ఆయన తెలిపారు. ప్రస్తుతం ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్‌పై 5-6 లక్షల మంది వ్యాపారులు నమోదయ్యారని, రానున్న నెలల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. సీఐఐ నేషనల్‌ ఎంఎస్‌ఎమ్‌ఈ కౌన్సిల్‌ ఛైర్మన్‌ సమీర్‌ గుప్తా మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ఎంఎస్‌ఎమ్‌ఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. దేశ జీడీపీలో 30 శాతం, ఎగుమతుల్లో 40 శాతం వాటాను అందిస్తూ ‘నవ భారత్‌’ కలను సాకారం చేయడంలో కృషి చేస్తున్నాయని తెలిపారు.


ఆర్‌.ఎస్‌. బ్రదర్స్‌లో ‘కేజీ సేల్స్‌’

ఈనాడు, హైదరాబాద్‌: ఆషాఢ మాసం సందర్భంగా కొనుగోలుదార్ల కోసం ‘కేజీ సేల్స్‌’ను ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ ప్రకటించింది. అన్ని ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ షోరూముల్లో దీన్ని అమలు చేస్తున్నారు. ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పఠాని, పోచంపల్లి, పటోల, రాజ్‌కోట్, జయపుర, కోల్‌కతా, బెనారస్‌ చీరలు, ఫ్యాన్సీ- డిజైనర్‌ చీరలు, పురుషులు- చిన్న పిల్లల దుస్తులు సరికొత్త డిజైన్లలో అందుబాటులో ఉంచినట్లు ఈ సంస్థ వెల్లడించింది. కంచి పట్టు చీరలను కంచి సొసైటీ ధరలకే విక్రయిస్తున్నట్లు తెలియజేసింది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుతో దుస్తులను ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు, దీంతో పాటు రూ.5,000 వరకూ తక్షణ డిస్కౌంటు ఇస్తున్నట్లు వివరించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ విజ్ఞప్తి చేసింది.


సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ఆషాఢమాసం విక్రయాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ షోరూముల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ‘ఆషాఢం నెం.1 కిలో సేల్స్‌’ అనే పేరుతో అన్ని రకాలైన దుస్తులపై 66% వరకూ ధరల తగ్గింపు అమలు చేస్తున్నట్లు సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ వెల్లడించింది. అంతేగాక హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌/క్రెడిట్‌ కార్డుపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు, రూ.5,000 వరకూ తక్షణ డిస్కౌంటు ఇస్తున్నట్లు పేర్కొంది. కంచి, ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పోచంపల్లి చీరలతో పాటు ఆకర్షణీయమైన డిజైనర్‌ చీరలు, హైఫ్యాన్సీ చీరలు విక్రయిస్తున్నట్లు తెలియజేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని