టాటా మోటార్స్, మహీంద్రా ఎస్‌యూవీల ధరలు తగ్గింపు

టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా తమ స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీల) ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. వీటికి గిరాకీ పెంచే ఉద్దేశంతోనే ధరలు తగ్గించినట్లు తెలిపాయి.

Updated : 11 Jul 2024 02:36 IST

దిల్లీ

టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా తమ స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీల) ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. వీటికి గిరాకీ పెంచే ఉద్దేశంతోనే ధరలు తగ్గించినట్లు తెలిపాయి. టాటా మోటార్స్‌ తన ఎస్‌యూవీల్లో హ్యారియర్‌ ప్రారంభ ధరను రూ.14.99 లక్షలకు, సఫారీ ప్రారంభ ధరను రూ.15.49 లక్షలకు సవరించింది. అలాగే ఇతర ప్రముఖ ఎస్‌యూవీ వేరియంట్లపై రూ.1.4 లక్షల వరకు ప్రయోజనాలను అందించనున్నట్లు తెలిపింది. విద్యుత్‌ వాహనాల్లో నెక్సాన్‌.ఈవీపై గతంలో ఎన్నడూ లేని విధంగా   రూ.1.3 లక్షల వరకు ప్రయోజనాలు ఇస్తున్నట్లు టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ముఖ్య వాణిజ్య అధికారి (సీసీఓ) వివేక్‌ శ్రీవత్స తెలిపారు. పంచ్‌ ఈవీపైన కూడా రూ.30,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

  • మహీంద్రా అండ్‌ మహీంద్రా తన ఎక్స్‌యూవీ 700 సిరీస్‌లో ఏఎక్స్‌7 శ్రేణి వాహనాల ప్రారంభ ధరను రూ.2 లక్షలకు పైగా తగ్గించి రూ.19.49 లక్షలకు తీసుకొచ్చింది. ఈ ధరల తగ్గింపుతో ఈ శ్రేణి ఎస్‌యూవీలను మరింత మందికి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌ ఈవీ/హైబ్రిడ్‌ పాలసీకి, కొన్ని ఎక్స్‌యూవీ 700 వేరియంట్లపై ధరల తగ్గింపునకు ఎలాంటి సంబంధం లేదని ఎక్స్ఛేంజీలకు మహీంద్రా సమాచారం ఇచ్చింది. ఎక్స్‌యూవీ 700 మోడల్‌కు గిరాకీ బాగుందని, ఇందుకు తగ్గట్లుగా తయారీ సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపింది. జూన్‌లో ఎక్స్‌యూవీ 700ల బుకింగ్‌లు మే నెల కంటే 23 శాతం అధికంగా ఉన్నాయని, నిల్వ కార్ల (ఇన్వెంటరీ)పై ఆందోళనలు లేవని వివరించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని