Updated : 07 Jul 2022 12:30 IST

Rupee value: రూపాయి ఎఫెక్ట్‌.. విదేశీ విద్య పెనుభారం!

రూపాయి మారకపు విలువ భారీగా పతనం

  ఫిబ్రవరి వరకు అమెరికా డాలర్‌కు రూ.75.. ఇప్పుడు రూ.78.94

  ముడి చమురు సెగలు, యుద్ధ పరిణామాలతో డాలర్‌కు మరింత గిరాకీ

ఈనాడు బిజినెస్‌ బ్యూరో, హైదరాబాద్‌: రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్‌ విలువ గణనీయంగా పెరగడంతో మన విద్యార్థులకు విదేశీ చదువు పెనుభారంగా మారింది. అమెరికాకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు కళాశాల రుసుములు, ఖర్చుల కోసం రూపాయల్లో మరింత అధికంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశం నుంచి ఉన్నత విద్య కోసం అత్యధికులు వెళ్లేది అమెరికాకే. ఫిబ్రవరి ఆఖరు వరకు ఒక డాలర్‌ విలువ రూ.75 కాగా, మార్చి నుంచి పెరగడం ప్రారంభమై.. బుధవారం రూ.78.94కు చేరింది. మంగళవారం ఈ విలువ రూ.79.33 కావడం గమనార్హం. రూపాయి విలువ కాపాడేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్యలు తీసుకోవడంతోనే బుధవారం మార్పు సంభవించింది.

ఈ ఏడాది ఆగస్టు, ఆ తర్వాత డిసెంబరులో మన దేశం నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. విమాన టికెట్ల కొనుగోలుకు, చేరాల్సిన యూనివర్సిటీకి ఫీజులు చెల్లించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.  వైద్య విద్య పూర్తి చేసి, రెసిడెన్సీ కోసం వెళ్లే వారైతే అక్కడ దాదాపు 100 విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకుంటారు. ఇందుకు ఒక్కో వర్సిటీకి 30 డాలర్లు అవుతుంది. రూపాయి విలువ పడిపోవడంతో, ముందు అనుకున్న దానికంటే వీరంతా 5 శాతానికి పైగా అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అమెరికా తరవాత ఉన్నత విద్య కోసం కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జర్మనీ వంటి దేశాలకు వెళ్తుంటారు.

రూపాయి విలువ ఒక్కసారిగా ఎందుకు తగ్గిందంటే..

* అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర గత నవంబరులో 70 డాలర్లు కాగా, మార్చిలో 128 డాలర్లకు వెళ్లింది. తాజాగా 99 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మన దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులే తీరుస్తున్నందున, ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది.

* ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అవాంతరాలు తలెత్తి సరకు రవాణా, ఎగుమతులు- దిగుమతులు ఇబ్బందికరంగా మారాయి. దీనివల్ల ముడిపదార్థాలు, వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.

* ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి అమెరికా సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్నాయి. ఫలితంగా మన దేశం నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ) తమ పెట్టుబడులను ఉపసంహరించి, యూఎస్‌ బాండ్‌ మార్కెట్‌కు మళ్లిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో 6.3 బిలియన్‌ డాలర్ల (1 బిలియన్‌ డాలర్లు= రూ.7,894 కోట్లు) విలువైన షేర్లు విక్రయించారు. జనవరి నుంచి ఇప్పటివరకు వారు విక్రయించిన షేర్ల విలువ 28 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.22 లక్షల కోట్ల)కు పైగానే ఉండటం గమనార్హం. దేశంలోకి పెట్టుబడుల కోసం డాలర్లు ఎక్కువగా వచ్చినప్పుడు, రూపాయి బలపడుతుంది. ఉపసంహరించినప్పుడు బలహీన పడుతోంది. 

* ఈ పరిణామాలతో మన దేశం వద్ద ఉన్న విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయి. 2021 సెప్టెంబరు నాటి 642 బిలియన్‌ డాలర్ల నుంచి 593 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోయాయి.

అన్ని రకాలుగా నష్టమే

రూపాయి మారకపు విలువ తగ్గడం.. దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యాపార సంస్థలతో పాటు అన్ని వర్గాల ప్రజలపైనా ప్రభావం చూపుతోంది. మన ఎగుమతులకు డాలర్లలో చెల్లింపులు లభిస్తే, ఇక్కడి కంపెనీలకు లాభం కలుగుతుంది. ఐటీ కంపెనీలు ఈ లాభాన్ని పొందుతుంటాయి. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం నెలకొంటుందనే ఆందోళనల నేపథ్యంలో, ఐటీకి గిరాకీ ఎలా ఉంటుందోననే సందేహాలూ ఉన్నాయి. మరోవైపు దిగుమతులన్నీ ఖరీదవుతున్నాయి. 2021 జూన్‌తో పోలిస్తే, గత నెలలో మన ఎగుమతుల విలువ 16.78 శాతం వృద్ధి చెంది 37.94 బిలియన్‌ డాలర్లకు చేరగా.. అదే సమయంలో బంగారం-చమురు సహా ఇతర దిగుమతుల బిల్లు భారం 51 శాతం పెరిగి 63.58 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఫలితంగా వాణిజ్య లోటు రికార్డుస్థాయిలో 25.63 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. కరెంట్‌ ఖాతా లోటు ఏప్రిల్‌-జూన్‌లో రెట్టింపై 30 బి.డాలర్లకు చేరింది. దీనివల్ల ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుంది. వ్యాపార సంస్థలకు విదేశీ రుణాలు భారంగా మారతాయి. ముడి పదార్థాలు, ఇంటర్మీడియేట్లు, యంత్రసామగ్రి దిగుమతి చేసుకునే వారు రూపాయల్లో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. పర్యాటకులు, వ్యాపారవేత్తలకు విదేశీ ప్రయాణాలు భారంగా మారతాయి.


రూపాయికి ఆర్‌బీఐ చికిత్స ప్రారంభం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 4.1 శాతం క్షీణించిన నేపథ్యంలో, మరింత పతనాన్ని నివారించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) బుధవారం పలు చర్యలు ప్రకటించింది. 

* ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) చేసే విదేశీ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పరిమితిని తొలగించింది. ఈ సడలింపు 2022 అక్టోబరు 31 వరకు వర్తిస్తుంది. వడ్డీరేట్ల పరిమితులు లేకుండా తాజా విదేశీ కరెన్సీ నాన్‌-రెసిడెంట్‌ డిపాజిట్ల (ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ)), ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లను సేకరించడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. నగదు నిల్వ నిష్పత్తి(సీఆర్‌ఆర్‌), చట్టబద్ధ ద్రవ్యలభ్యత నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్‌) నిర్వహణ నుంచి వీటిని మినహాయిస్తారు.

* ఆటోమేటిక్‌ మార్గంలో తీసుకునే విదేశీ వాణిజ్య రుణాల(ఈసీబీ) పరిమితిని ఒక ఆర్థిక సంవత్సరానికి 750 మి. డాలర్ల నుంచి 1.5 బిలియన్‌ డాలర్లకు పెంచింది.

* డెట్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల నిబంధనలను సరళీకరించింది.

* 7 ఏళ్లు, 14ఏళ్ల కాలావధి ఉండే కొత్త ప్రభుత్వ బాండ్ల జారీని ఫుల్లీ యాక్సెసబుల్‌ రూట్‌(ఎఫ్‌ఏఆర్‌) కింద నిర్దిష్ట సెక్యూరిటీలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం జారీ చేస్తున్న జీఎస్‌ 2029; జీఎస్‌ 2039 బాండ్లకూ వర్తిస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్‌ రుణాల్లో పెట్టే విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల నిబంధనలనూ సరళీకరించింది. 


విదేశీ మారక నిల్వలు కాపాడేందుకు..

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం త్వరగా ముగిసి, ముడి చమురు ధర దిగి వస్తే సరే.. లేని పక్షంలో కరెంటు ఖాతా లోటు అధికమై, రూపాయి విలువ ఇంకా పతనమవుతుందని బ్రోకరేజీ సంస్థలు వివరిస్తున్నాయి. డాలర్‌ విలువ రూ.82కు చేరే అవకాశాలున్నాయని నొమురా పేర్కొంది. అదే జరిగితే ప్రజలకు ఇంకా ఇబ్బందే. విదేశీ మారకపు ద్రవ్య నిల్వలను కాపాడేందుకు బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని కేంద్రం 5 శాతం పెంచింది. రష్యా నుంచి చౌకగా లభిస్తున్న ముడిచమురు కొనేందుకు దేశీయ రిఫైనింగ్‌ సంస్థలను అనుమతిస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని