Vehicle insurance: మీ వాహనాన్ని ఎలా నడుపుతున్నారు?.. దాని బట్టే బీమా ప్రీమియం!

వాహనాన్ని రోజూ ఎన్ని కిలోమీటర్లు నడిపిస్తున్నారు.. వాహనాన్ని నడిపేటప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది.. ఎందుకీ ప్రశ్నలు అనుకుంటున్నారా? ఇక నుంచి వాహన బీమా ప్రీమియాన్ని నిర్ణయించడంలో ఈ ప్రశ్నలు కీలకంగా మారనున్నాయి. వాహన వినియోగం, డ్రైవర్‌ ప్రవర్తనను బట్టి బీమా ప్రీమియం వసూలుకు అధునాతన అనుబంధ పాలసీలను (యాడ్‌ ఆన్‌) కంపెనీలు జారీ చేయబోతున్నాయి. ఈ మేరకు సాధారణ బీమా సంస్థలకు అనుమతినిస్తూ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) మార్గదర్శకాలు జారీ చేసింది.

Updated : 07 Jul 2022 12:27 IST

అధునాతన అనుబంధ పాలసీలు
సాధారణ బీమా సంస్థలకు అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: వాహనాన్ని రోజూ ఎన్ని కిలోమీటర్లు నడిపిస్తున్నారు.. వాహనాన్ని నడిపేటప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది.. ఎందుకీ ప్రశ్నలు అనుకుంటున్నారా? ఇక నుంచి వాహన బీమా ప్రీమియాన్ని నిర్ణయించడంలో ఈ ప్రశ్నలు కీలకంగా మారనున్నాయి. వాహన వినియోగం, డ్రైవర్‌ ప్రవర్తనను బట్టి బీమా ప్రీమియం వసూలుకు అధునాతన అనుబంధ పాలసీలను (యాడ్‌ ఆన్‌) కంపెనీలు జారీ చేయబోతున్నాయి. ఈ మేరకు సాధారణ బీమా సంస్థలకు అనుమతినిస్తూ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) మార్గదర్శకాలు జారీ చేసింది.

ఓన్‌ డామేజీకి తోడుగా..
సాధారణంగా వాహన బీమా పాలసీలో వాహనానికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు పరిహారం ఇవ్వడం (ఓన్‌ డామేజీ), తృతీయ పక్షానికి నష్టం జరిగితే పరిహారం ఇవ్వడం (థర్డ్‌ పార్టీ) ఉంటాయి. ఓన్‌ డామేజీ పాలసీ తప్పనిసరి కాదు. కానీ, థర్డ్‌ పార్టీ బీమా లేకుండా వాహనం రోడ్డుపైకి రాకూడదు. కొత్తగా అనుమతించిన అనుబంధ పాలసీలను ఓన్‌ డామేజీ పాలసీకి జత చేయాల్సి ఉంటుంది.

* వాహనాన్ని ఎంత మేరకు వినియోగిస్తున్నారు అన్నదాని ఆధారంగా ప్రీమియాన్ని నిర్ణయించే పాలసీ ‘పే యాజ్‌ యు డ్రైవ్‌’. ఈ పాలసీని ఎంచుకున్నప్పుడు వాహనాన్ని ఎన్ని కిలోమీటర్లు నడిపిస్తున్నారు అన్నదాన్ని ప్రధానంగా చూస్తారు. వాహనాన్ని వినియోగించనప్పుడు బీమా పాలసీని ఆఫ్‌ చేసుకునే వీలుంటుంది.
* వాహనాన్ని నడిపేటప్పుడు డ్రైవర్‌ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేదాన్ని బట్టి, ప్రీమియాన్ని నిర్ణయించేది ‘పే హౌ యు డ్రైవ్‌’. వాహనాన్ని ఎంత సురక్షితంగా నడిపిస్తున్నారన్నది చూసి, బీమా ప్రీమియాన్ని నిర్ణయిస్తారు.
* ఒకే వాహన యజమాని సొంత వినియోగానికి ద్విచక్ర వాహనం, కారు వాడుతుంటే..ఈ రెండింటికి కలిపి ఫ్లోటర్‌ పాలసీని ఎంచుకునే వీలునూ ఐఆర్‌డీఏఐ కల్పించింది.

పాలసీదారుల ప్రయోజనం కోసమే..
‘వాహన బీమా పాలసీల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. బీమా రంగంలో సాంకేతికత కీలకంగా మారింది. పాలసీదారుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు, దేశంలో బీమా వ్యాప్తికి కృషి చేస్తున్నాం. కాలానుగుణంగా మార్పులనూ చేస్తున్నాం. సాంకేతిక ఆధారిత పాలసీలను అనుమతించడం ఇందులో భాగమే’ అని ఐఆర్‌డీఏఐ పేర్కొంది.

వాహనదారులకు మేలే
‘వాహనాన్ని అందరూ ఒకేలా వాడరు. వారి వినియోగ ధోరణి బట్టి, ప్రీమియాన్ని చెల్లించేందుకు అనుబంధ పాలసీలు తోడ్పడతాయ’ని బజాజ్‌ అలియంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ టీఏ రామలింగం అన్నారు. ఇప్పటివరకు థర్డ్‌ పార్టీ బీమానే తీసుకుంటున్న వారు.. కొత్త యాడ్‌ ఆన్‌ పాలసీలను జోడించుకుని, ఓన్‌ డామేజీ పాలసీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇప్పటికే అందుబాటులో..: వాహన వినియోగాన్ని బట్టి, ప్రీమియాన్ని వసూలు చేసే పాలసీలను ఐఆర్‌డీఏఐ శాండ్‌బాక్స్‌లో భాగంగా కొన్ని బీమా సంస్థలు విడుదల చేశాయి. లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఈ తరహా యాడ్‌ ఆన్‌లతో తొలి పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఎడిల్‌వైజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ‘స్విచ్‌’ పేరుతో ఈ పాలసీని ఆవిష్కరించింది. బీమా సంస్థ మొబైల్‌ యాప్‌ ద్వారా వాహన వినియోగం, నడిపిన విధానాన్ని పరిశీలించి, ప్రీమియాన్ని నిర్ణయిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని