జొమాటో షేరుకు మరిన్ని కష్టాలు!

జొమాటో షేరుకు వచ్చే వారం నుంచి మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏడాది పాటు లాక్‌-ఇన్‌ పీరియడ్‌లో కొనసాగిన 613 కోట్ల షేర్లను

Updated : 20 Jul 2022 03:08 IST

లాక్‌-ఇన్‌ సమయం ఈనెల 22తో ముగింపు
వ్యవస్థాపకులు, వాటాదార్ల వద్ద ఉన్న 78% షేర్లు విక్రయించుకునే వెసులుబాటు
స్టాక్‌ విలువ మరింత తగ్గొచ్చని విశ్లేషకుల అంచనా

జొమాటో షేరుకు వచ్చే వారం నుంచి మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏడాది పాటు లాక్‌-ఇన్‌ పీరియడ్‌లో కొనసాగిన 613 కోట్ల షేర్లను (మొత్తం షేర్లలో 77.87 శాతం) వచ్చే వారం నుంచి విక్రయించుకునే వెసులుబాటు కలుగుతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ‘జొమాటోకు ప్రమోటర్‌ లేరు. వ్యవస్థాపకులతో పాటు ఇతర మదుపర్ల దగ్గర 613 కోట్ల షేర్లు ఏడాది పాటు లాక్‌ ఇన్‌లో ఉన్నాయి. 2021 జులై 23న ఈ షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఏడాది కాలావధి ముగుస్తున్నందున, ఈనెల 23 నుంచి వాటిని వారు విక్రయించుకోవచ్చు. దీంతో స్టాక్‌ ధరపై ప్రభావం పడే అవకాశం ఉంద’ని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇన్‌గవర్న్‌ వ్యవస్థాపకులు, ఎండీ శ్రీరామ్‌ సుబ్రమణియన్‌ అభిప్రాయపడ్డారు.

* ‘జొమాటో షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన తర్వాత యాంకర్‌ మదుపర్లకు కేటాయించిన షేర్లను ఒక నెల పాటు విక్రయించడానికి వీలు లేదు. అది ముగిసిన మరుసటి రోజే షేరు 8 శాతం నష్టపోయిన’ విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
* పబ్లిక్‌ ఇష్యూలో రూ.76 చొప్పున జొమాటో షేర్లు కేటాయించారు. 2021 జులై 23న షేరు భారీ ప్రీమియంతో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో రూ.115 వద్ద నమోదైంది. తర్వాత రోజుల్లో షేరు విలువ జీవన కాల గరిష్ఠమైన రూ.169 స్థాయికి చేరడమే కాదు.. రూ.లక్ష కోట్ల మార్కెట్‌ విలువను  సాధించింది. తదుపరి షేరు విలువ తగ్గుతూ వస్తూ, మంగళవారం బీఎస్‌ఈలో రూ.53.90 వద్ద ముగిసింది.

రిటైల్‌ మదుపర్లు ఇవి గమనించాలి
* నష్టాల్లో ఉన్న క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌ (గతంలో గ్రోఫర్స్‌)ను 570 మి.డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించాక, షేరు నష్టపోతూ వస్తోంది.
* పీసీ/వీసీ ఇన్వెస్టర్లకు షేరును ఎంత విలువకు కేటాయించారో చూడాలి. ప్రస్తుత విలువ కంటే వారికి తక్కువకే లభిస్తే కనుక, వారు విక్రయాలకు దిగే అవకాశముంటుంది.
* జొమాటో ప్రారంభ దశలో పెట్టుబడి పెట్టిన ఇన్ఫో ఎడ్జ్‌ సంస్థకు, సగటున రూ.1.16 చొప్పునే షేర్లు లభించాయి. పబ్లిక్‌ ఇష్యూ సమయంలో, ఆ సంస్థ రూ.357 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇంకా 15.18 శాతం వాటా (రూ.6,330 కోట్లకు సమానం) ఆ సంస్థకు ఉంది.
* తొలిదశ ఇన్వెస్టర్లయిన అలిపే (7.1 శాతం), యాంట్‌ ఫైనాన్షియల్‌ (6.99 శాతం), టైగర్‌ గ్లోబల్‌ (5.11 శాతం), సెఖోయా క్యాపిటల్‌ (5.10 శాతం), టెమాసెక్‌ (3.11 శాతం)తో  పాటు ఉబర్‌ (7.78 శాతం), డెలివరీ హీరో (1.36 శాతం) సంస్థలు కూడా ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఏం చేస్తాయో చూడాలి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని