నగదు రహిత చికిత్సకు.. ఆసుపత్రులను బీమా కంపెనీలే ఎంచుకుంటాయ్‌

ఆరోగ్య బీమా పాలసీదార్లకు నగదు రహిత (క్యాష్‌లెస్‌) చికిత్స అందించే ఆసుపత్రుల ఎంపికను భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) సులభతరం చేసింది. క్యాష్‌లెస్‌ చికిత్సలు అందించే నెట్‌వర్క్‌ ఆసుపత్రులను ఎంపిక చేసుకునే అవకాశాన్ని బీమా కంపెనీలకే

Published : 22 Jul 2022 03:11 IST

నిబంధనలను సవరించిన ఐఆర్‌డీఏఐ

పాలసీదార్లకు మేలు

ఈనాడు, హైదరాబాద్‌: ఆరోగ్య బీమా పాలసీదార్లకు నగదు రహిత (క్యాష్‌లెస్‌) చికిత్స అందించే ఆసుపత్రుల ఎంపికను భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) సులభతరం చేసింది. క్యాష్‌లెస్‌ చికిత్సలు అందించే నెట్‌వర్క్‌ ఆసుపత్రులను ఎంపిక చేసుకునే అవకాశాన్ని బీమా కంపెనీలకే కల్పించింది. తాము ఎంపిక చేసే నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో సదుపాయాలు, వైద్య చికిత్సల ప్రమాణాలు ఎలా ఉండాలనే విషయంలో బీమా కంపెనీల బోర్డులు తగిన విధివిధానాలు సిద్ధం చేసుకోవాలని, వాటికి లోబడి ఆసుపత్రుల ఎంపిక ఉండాలని నిర్దేశించింది. మానవ వనరుల లభ్యత, వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని, అత్యుత్తమ వైద్య సేవలు అందించే ఆసుపత్రులను ఎంపిక చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు తాజా నిబంధనలు జారీ చేసింది.  

ప్రస్తుతం ఆసుపత్రి ఎంపిక ఇలా

ఇప్పటివరకు ఏదైనా ఒక ఆసుపత్రిని బీమా కంపెనీలు క్యాష్‌లెస్‌ సదుపాయం కోసం ఎంపిక చేయాలంటే, ఇన్సూరెన్స్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (ఐఐబీ) వద్ద ఆ ఆసుపత్రి నమోదు కావాలి. నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌ (ఎన్‌ఏబీహెచ్‌) నుంచి సర్టిఫికెట్‌ను సంబంధిత ఆసుపత్రి పొందాల్సి ఉంటుంది. లేదా నేషనల్‌ క్వాలిటీ అస్సూరెన్స్‌ స్టాండర్డ్స్‌ కింద నేషనల్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ రిసోర్సెస్‌ సెంటర్‌ జారీ చేసే ‘స్టేట్‌ లెవల్‌ సర్టిఫికెట్‌’ అయినా ఉండాలి. అప్పుడే ఒక ఆసుపత్రిని క్యాష్‌లెస్‌ సదుపాయం కోసం బీమా సంస్థలు ఎంపిక చేయగలుగుతున్నాయి.  

తాజా మార్పుల వల్ల

ఐఆర్‌డీఏఐ కొత్త నిబంధనలతో ఆసుపత్రుల ఎంపిక సులువవుతుంది. పెద్ద సంఖ్యలో ఆసుపత్రులను ఎంపిక చేసే అవకాశం బీమా కంపెనీలకు లభిస్తుందని  ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ (అండర్‌ రైటింగ్‌) సంజయ్‌ దత్తా అన్నారు. గ్రామీణ, చిన్న పట్టణాల్లోని ఆసుత్రులను సైతం ఎంపిక చేసి ప్రజలకు క్యాష్‌లెస్‌ చికిత్స సదుపాయాన్ని అందుబాటులోకి తేవచ్చని లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రెసిడెంట్‌ (క్లెయిమ్స్‌) రాహుల్‌ శర్మ వివరించారు. దీనివల్ల ఆరోగ్య బీమా సదుపాయం విస్తరిస్తుందని పేర్కొన్నారు. అయితే ఆసుపత్రుల ఎంపికలో అత్యున్నత ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత బీమా కంపెనీలపై ఉంటుందని అన్నారు.

నెట్‌వర్క్‌ ఆసుపత్రి కాకుంటే..

ఆరోగ్య బీమా పాలసీదార్లు చికిత్స కోసం ఏదైనా ఆసుపత్రిలో చేరాలనుకున్నప్పుడు, అక్కడ క్యాష్‌లెస్‌ సదుపాయం లభిస్తుందో-లేదోనని ఆందోళన చెందడం సహజం. ఆ సదుపాయం లేనిపక్షంలో ముందుగా సొమ్ము చెల్లించి, ఆ తర్వాత బీమా క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ‘చికిత్సకు అవసరమైన సొమ్మును ముందుగా సమకూర్చుకోవడంతో పాటు, ఆ తర్వాత క్లెయిము వస్తుందా, రాదా? వస్తే ఎంత సొమ్ము వస్తుంది..’ అనే ఆందోళన వెంటాడుతూ ఉంటుంది. అదే నెట్‌వర్క్‌ ఆసుపత్రి అయితే పాలసీదార్లకు ఈ ఇబ్బందులు ఉండవు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts