అత్యంత నిరాశలో మదుపర్లు

పెట్టుబడుదార్లలో నిరాశ కనిపిస్తోందని అంతర్జాతీయ బ్యాంకింగ్‌ దిగ్గజం అంటోంది. అంతర్జాతీయ వృద్ధి, కార్పొరేట్‌ లాభాలపై అంచనాలు రికార్డు కనిష్ఠాలకు చేరాయని.. దీంతో మదుపర్లు నష్టభయం ఎక్కువగా ఉన్న ఆస్తుల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని

Updated : 24 Jul 2022 09:33 IST

 2008 తర్వాత మళ్లీ ఇపుడే అలా

పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు
నగదు స్థాయిలు పెరుగుతున్నాయి

ద్రవ్యోల్బణంపైనే దృష్టి

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సర్వే

పెట్టుబడుదార్లలో నిరాశ కనిపిస్తోందని అంతర్జాతీయ బ్యాంకింగ్‌ దిగ్గజం అంటోంది. అంతర్జాతీయ వృద్ధి, కార్పొరేట్‌ లాభాలపై అంచనాలు రికార్డు కనిష్ఠాలకు చేరాయని.. దీంతో మదుపర్లు నష్టభయం ఎక్కువగా ఉన్న ఆస్తుల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తన సర్వేలో పేర్కొంది. దీంతో మదుపర్ల వద్ద నగదు స్థాయిలు పెరిగాయని తెలిపింది. జులై 8-15 తేదీల్లో దాదాపు 300 మంది ఫండ్‌ మేనేజర్లపై ఈ సర్వే నిర్వహించారు. వీరి నిర్వహణలో 800 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.62.4 లక్షల కోట్లు) ఆస్తులున్నాయి. కాగా, 2008లో వచ్చిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కంటే ఎక్కువ నిరాశావాదం ఈ కరోనా మహమ్మారి వీరిలో తీసుకువచ్చిందని ఈ సర్వే అంటోంది. దీని ప్రకారం..
* మదుపర్ల వద్ద ఉన్న నగదు స్థాయిలు 6 శాతం కంటే ఎక్కువకు చేరాయి. అక్టోబరు 2001 తర్వాత అత్యధిక స్థాయిలు ఇవే.
* లేమాన్‌ బ్రదర్స్‌ కుప్పకూలిన సమయం(2008)లో కంటే ఈక్విటీ కేటాయింపులు కనిష్ఠ స్థాయికి చేరాయి.
* మే 2020లో కనిపించిన భయాలు మళ్లీ మాంద్యం వల్ల పెరిగాయి.
* ఎక్కువ మంది మదుపర్లలో ‘బేరిష్‌నెస్‌’ కనిపిస్తోంది.
* వచ్చే 12 నెలల్లో ద్రవ్యోల్బణం తగ్గవచ్చని నాలుగింట మూడో వంతు మంది ఫండ్‌ మేనేజర్లు పేర్కొన్నారు. అయితే అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వృద్ధి భయాల వల్ల సెంటిమెంటు స్తబ్దుగా ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు.
* అంతర్జాతీయ మార్కెట్లకు ఎక్కువ నష్టభయాన్ని కలిగిస్తున్న అంశాల్లో ద్రవ్యోల్బణం తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో అంతర్జాతీయ మందగమనం ఉంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అయిదో స్థానానికి పరిమితమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని