ఆస్ట్రేలియాతో బంధానికి వాణిజ్య సొబగులు

ఆస్ట్రేలియాతో ఇండియా మైత్రీబంధంలో సరికొత్త అధ్యాయం త్వరలో మొదలవనుంది.

Updated : 04 Dec 2022 16:45 IST

ఆస్ట్రేలియాతో ఇండియా మైత్రీబంధంలో సరికొత్త అధ్యాయం త్వరలో మొదలవనుంది. కీలక రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో సంతకాలు చేసిన ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) తాజాగా ఆస్ట్రేలియా పార్లమెంటులో ఆమోదం పొందింది. దాదాపు నెల రోజుల్లో అది అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్‌-ఆస్ట్రేలియా వ్యూహాత్మక బంధంలో ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) కీలక మైలురాయి. పలు రకాల ఉత్పత్తులు, ముడి పదార్థాలపై పన్నుల భారాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా ఇరు దేశాల విపణుల మధ్య ఎగుమతులు-దిగుమతులు ఊపందుకొనేందుకు ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దోహదపడనుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వార్షిక వాణిజ్య బంధం విలువ దాదాపు 2,750 కోట్ల డాలర్లుగా ఉంది. ఈసీటీఏ అమలులోకి వచ్చిన అయిదేళ్లలో అది 5,000 కోట్ల డాలర్ల దాకా చేరుకోగలదని అంచనా. రెండు దేశాల్లో కలిపి 10 లక్షల అదనపు ఉపాధి అవకాశాల సృష్టికి అది తోడ్పడుతుందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.

ఆస్ట్రేలియాకు 2021-22లో భారత్‌ నుంచి సరకు ఎగుమతుల విలువ 830 కోట్ల డాలర్లు. దిగుమతుల విలువ 1,675 కోట్ల డాలర్లు. ఆస్ట్రేలియా నుంచి ఇండియా దిగుమతుల విలువలో దాదాపు 70శాతం వాటా బొగ్గుదే. భారత ఉక్కు రంగంలో కీలకంగా ఉన్న బొగ్గుపై ప్రస్తుతం 2.5శాతం పన్ను విధిస్తున్నారు. ఈసీటీఏ పట్టాలకెక్కితే అది పన్నురహిత జాబితాలోకి వెళ్తుంది. దేశీయ ఉక్కు పరిశ్రమలపై భారం గణనీయంగా తగ్గుతుంది. ఈసీటీఏ అమలులోకి వచ్చిన తొలిరోజు నుంచే 96.4శాతం భారతీయ ఉత్పత్తులకు కాన్‌బెర్రా విపణిలోకి సుంకం రహిత ప్రవేశం లభిస్తుంది. ఆ జాబితాలోని అనేక సరకులకు ప్రస్తుతం అక్కడ 4-5శాతం పన్ను విధిస్తున్నారు. మానవ వనరుల వినియోగం ఎక్కువగా ఉన్న తోళ్లు, ఆభరణాలు, ఫర్నిచర్‌, ఫార్మా, వ్యవసాయోత్పత్తులు, ఆటొమొబైల్‌, ఎలెక్ట్రికల్స్‌, క్రీడాసామగ్రి తయారీ రంగాలు ఆస్ట్రేలియా విపణిలో పన్నుభారం తొలగిపోవడం లేదా తగ్గడం వల్ల లాభపడతాయి. ఆయా రంగాల్లో ఎగుమతులు పెరుగుతాయి. ఆస్ట్రేలియాలో విస్తృతంగా అందుబాటులో ఉన్న ఖనిజ వనరులను పన్నుభారం లేకుండా భారత్‌ దిగుమతి చేసుకోవచ్చు. ఫలితంగా దేశీయ ఉత్పత్తి కర్మాగారాలు లాభపడతాయి. ఆస్ట్రేలియాకు ఇండియా నుంచి సేవల ఎగుమతి వాటా ప్రస్తుతం నామమాత్రంగా ఉంది. ఇండియాలో భారీ సంఖ్యలో ఉన్న ఐటీ నిపుణులు దానిపై దృష్టిసారించడానికి ఈసీటీఏ మార్గం సుగమం చేస్తుంది. ఆస్ట్రేలియాలో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌) కోర్సుల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన భారతీయులు తమ చదువు పూర్తయ్యాక 2-3 ఏళ్లు అక్కడే ఉండి పనిచేసుకునేందుకు వీలుగా వీసాలివ్వనుండటం ఈసీటీఏతో ఒనగూడనున్న మరో ప్రయోజనం.

ఈసీటీఏ అమలులోకి వస్తే- ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు వచ్చే దాదాపు 85శాతం ఉత్పత్తులపై పన్ను ఉండబోదు. ఇండియా నుంచి వైన్స్‌, బాదం తదితరాల దిగుమతి సులభతరమవుతుంది. గతంలో ఆస్ట్రేలియా-బీజింగ్‌ మధ్య మెరుగైన వాణిజ్య బంధం ఉండేది. కొన్నేళ్లుగా ఆ రెండు దేశాల మధ్య దూరం పెరుగుతోంది. కాన్‌బెర్రా నుంచి బొగ్గు, పశు మాంసం, సముద్ర ఆహారం, వైన్‌, బార్లీ వంటి ఎగుమతులపై చైనా ఇటీవల ఆంక్షలు విధించింది. ఈసీటీఏ ఫలితంగా చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా రూపంలో విశ్వసనీయ భాగస్వామి ఆస్ట్రేలియాకు లభించినట్లవుతుంది.

బీజింగ్‌ ప్రాబల్యమున్న భారీ వాణిజ్య ఒప్పందం- ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సెప్‌) ఈ ఏడాది నుంచే అమలులోకి వచ్చింది. చైనాతోపాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌ సహా 14 దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమది. చైనా కారణంగా 2019 నవంబరులో దాన్నుంచి ఇండియా బయటికొచ్చింది. ఆస్ట్రేలియాతో ఈసీటీఏతో ఇప్పుడు ఆర్‌సెప్‌ సభ్య దేశాల్లో చైనా, న్యూజిలాండ్‌ మినహా దాదాపుగా అన్ని దేశాలతో దిల్లీకి వాణిజ్య ఒప్పందాలు ఉన్నట్లయింది. నిజానికి ఈసీటీఏ ఆస్ట్రేలియాతో ప్రాథమిక స్థాయి ఒప్పందమే. భవిష్యత్తులో అది మరింత మెరుగైన సమగ్ర ఆర్థిక సహకార, ఒప్పందం (సీఈసీఏ)గా మారుతుంది. అందుకు అవసరమైన చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. క్వాడ్‌ సహా పలు కూటముల్లో ఇప్పటికే పరస్పర సహకారంతో ముందుకెళ్తున్న దిల్లీ-కాన్‌బెర్రా మధ్య సీఈసీఏ సైతం కుదిరితే ద్వైపాక్షిక వ్యూహాత్మక బంధం మరింత దృఢమవుతుంది.

నవీన్‌ కుమార్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని