ఇక డిజిటల్‌ రూపాయి శకం

నేడు భారత్‌తోపాటు అనేక దేశాలు అధికార డిజిటల్‌ కరెన్సీలను తీసుకొస్తున్నాయి. వీటిని కేంద్ర బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరిస్తారు.

Updated : 29 Nov 2022 16:57 IST

నేడు భారత్‌తోపాటు అనేక దేశాలు అధికార డిజిటల్‌ కరెన్సీలను తీసుకొస్తున్నాయి. వీటిని కేంద్ర బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరిస్తారు. భారతీయ రిజర్వు బ్యాంకు డిజిటల్‌ రూపాయిని నవంబరు ఒకటిన పైలట్‌ ప్రాజెక్టుగా టోకు విభాగంలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వ బాండ్ల సెకండరీ మార్కెట్‌ లావాదేవీలకు డిజిటల్‌ రూపాయిని వినియోగించారు. మరో నెలరోజుల్లో రిటైల్‌ విభాగంలోనూ  పైలట్‌ ప్రాజెక్టును చేపట్టనున్నారు.

డిజిటల్‌ కరెన్సీ ప్రాజెక్టులో పాలుపంచుకునే ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు 10 వేల నుంచి 50 వేల మంది ఖాతాదా రులపై డిజిటల్‌ రూపాయిని ప్రయోగాత్మకంగా వినియోగించి చూస్తుంది. ఇక్కడ టోకు, రిటైల్‌ డిజిటల్‌ రూపాయల వినియోగం గురించి అర్థం చేసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వం నెలనెలా ఉద్యోగుల జీతభత్యాలకు, లబ్ధిదారుల సబ్సిడీ చెల్లింపులకు భారీ మొత్తాలను విడుదల చేస్తోంది. ఇకపై ఈ మొత్తాలను డిజిటల్‌ రూపాయి-సీబీడీసీ రూపంలో టోకున బ్యాంకులకు బదిలీ చేస్తారు. ఈ టోకు సీబీడీసీ నుంచి ఖాతాదారుల ఖాతాలకు రిటైల్‌ డిజిటల్‌ రూపాయలు చేరతాయి. ఇకనుంచి ప్రభుత్వం, బ్యాంకులు టోకు డిజిటల్‌ రూపాయలు వాడితే ప్రజలు రిటైల్‌ డిజిటల్‌ రూపాయిని వినియోగిస్తారన్నమాట. దీనివల్ల ఖర్చులు ఆదా అవుతాయి. ధన ప్రవాహం సులువుగా సాగుతుంది. జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌ (జామ్‌) ప్రక్రియ లబ్ధిదారులకు డిజిటల్‌ కరెన్సీలో చెల్లింపులు సులభతరమవుతాయి. భారత్‌లో కనీస బ్యాలన్స్‌ అవసరం లేని జన్‌ధన్‌ ఖాతాల సంఖ్య 47 కోట్లను దాటిపోయింది. వీటిలోకి రిటైల్‌ డిజిటల్‌ రూపాయలు బదిలీ అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. డిజిటల్‌ రూపాయల చలామణీకి బ్లాక్‌ చెయిన్‌ వంటి అధునాతన సాంకేతికతలు అవసరం. డిజిటల్‌ కరెన్సీ చలామణీ విస్తరిస్తున్న కొద్దీ భారత్‌లో సమాచార సాంకేతిక (ఐటీ) రంగానికి కొత్త ఊపు వస్తుంది.

ఖర్చులు ఆదా

డిజిటల్‌ రూపాయి మామూలు కరెన్సీకి ప్రత్యామ్నాయంగా కాకుండా అనుబంధంగా పనిచేస్తుంది. డిజిటల్‌ రూపాయిని చరిత్రాత్మక మలుపుగా రిజర్వు బ్యాంకు వర్ణించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా బిట్‌ కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలు 21వేలదాకా అందుబాటులో ఉన్నా అవేవీ అధికార డిజిటల్‌ కరెన్సీలు కావు. క్రిప్టో కరెన్సీలను ఉగ్రవాద వ్యాప్తికి, నల్లధనం చలామణీకి ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ వ్యక్తులు, వ్యాపారులు కూడా డబ్బు జమ, చెల్లింపులతోపాటు పొదుపు సాధనంగానూ ఈ కరెన్సీలను ఉపయోగిస్తున్నారు. వారికి అధికార డిజిటల్‌ కరెన్సీని అందుబాటులోకి తెచ్చి క్రిప్టోల నుంచి మళ్ళించాలని ప్రభుత్వం భావిస్తోంది. రూపాయి విలువపైనే డిజిటల్‌ రూపాయి విలువ కూడా ఆధారపడి ఉంటుంది. అది కేంద్ర బ్యాంకు అజమాయిషీలో కేంద్రీకృతంగా నిర్ణయమవుతుంది. కానీ, క్రిప్టోకు దన్నుగా ఎటువంటి ఆస్తులు, హామీలు ఉండవు. వికేంద్రిత క్రిప్టో విలువ- గిరాకీ, సరఫరా వ్యత్యాసాల ఆధారంగా మారుతూ ఉంటుంది. దాని విలువకు ఊహాగానాలే ఆధారం. కాగిత రూపంలో వాడుతున్న రూపాయలు ఊరకే రావు. అవి చెట్టుకు కాయవు. కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రభుత్వం భారీగా ఖర్చుపెడుతోంది. ఉదాహరణకు ప్రతి 500 రూపాయల నోటు ముద్రణకు రూ.2.94 పైసలు ఖర్చవుతుంది. 2019లో కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రభుత్వం రూ.8,000 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. ఆ నోట్లను దేశమంతటికీ పంపిణీ చేయడానికి అయ్యే ఖర్చు అదనం. డిజిటల్‌ కరెన్సీకి ముద్రణ, పంపిణీ ఖర్చులు ఉండవు. అంతా ఆన్‌లైన్‌లో జరిగిపోతుంది. కాగిత కరెన్సీలు అదృశ్యమై డిజిటల్‌ కరెన్సీలు పూర్తిగా వినియోగంలోకి వస్తే గుట్టుగా లంచాలు ఇవ్వడం, పుచ్చుకోవడం, నల్లధనం పోగేసుకోవడం అసాధ్యమవుతాయి. ఖాతాలు మారే డిజిటల్‌ కరెన్సీ లెక్కలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదవుతాయి.

డాలర్‌కు ప్రత్యామ్నాయం

రష్యా వంటి వ్యాపార భాగస్వాములతో ఎగుమతి, దిగుమతులు జరపడానికి డిజిటల్‌ రూపాయి తోడ్పడుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్యం ప్రధానంగా డాలర్లలో జరుగుతోంది. రష్యా, ఇరాన్‌లపై అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ)లు ఆర్థిక ఆంక్షలు విధించడంతో ఆ దేశాల నుంచి చమురు, ఇతర వస్తువుల కొనుగోలుకు డాలర్లు లభించడం లేదు. భారత్‌ ప్రస్తుతం ఈ రెండు దేశాలతో రూపాయల్లో వాణిజ్యం జరుపుతోంది. బంగ్లాదేశ్‌, నమీబియా, కెన్యా, జింబాబ్వేలతో సహా మొత్తం 12 దేశాలు రూపాయల్లో వర్తకానికి సుముఖంగా ఉన్నాయి. డిజిటల్‌ రూపాయితో లావాదేవీలు మరింత సులువుగా, వేగంగా జరిగి డాలర్‌పై ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుంది. భారతదేశం ప్రస్తుతానికి ఆసియా, ఆఫ్రికాలలోని చిన్న దేశాలతో డిజిటల్‌ రూపాయల్లో వాణిజ్యం జరపడానికి ప్రయత్నించవచ్చు. ఆ దేశాలకు ఎగుమతులు పెంచితే డిజిటల్‌ రూపాయల వినియోగం విస్తరిస్తుంది.

ప్రసాద్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు