అభివృద్ధికి గుదిబండగా రుణభారం

వ్యక్తులు, కంపెనీల మాదిరిగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం అప్పులు చేయకతప్పదు.

Updated : 04 Dec 2022 16:42 IST

వ్యక్తులు, కంపెనీల మాదిరిగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం అప్పులు చేయకతప్పదు. తన బాధ్యతలను నిర్వర్తించడానికి కావలసిన ఆదాయం లభించనప్పుడు ప్రభుత్వం విదేశాల నుంచి, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవలసి వస్తుంది. స్వదేశంలో ప్రజల నుంచీ బాండ్ల రూపంలో రుణ సేకరణ జరపాల్సి ఉంటుంది.

భారతదేశం తన ప్రజల నుంచి, రిజర్వుబ్యాంకు తది తర ఆర్థిక సంస్థల నుంచి బాండ్లు, సెక్యూరిటీల రూపంలో రుణాలు సేకరించింది, సేకరిస్తోంది. ప్రపంచమంతటిలోకీ ఇంగ్లిష్‌ ఛానల్‌లోని జెర్సీ ద్వీపం, అమెరికాలోని గెరన్సే పట్టణం, ఆసియాలోని హాంకాంగ్‌ మాత్రమే అప్పులు లేని ప్రదేశాలు. అందువల్ల వడ్డీలు కట్టాల్సిన అగత్యం వాటికి లేదు. ఏ దేశానికైనా విదేశీ రుణభారం మితిమీరితే మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధిపై, విద్య వైద్యం పై- మొత్తంగా తమ ప్రజల ఆర్థిక భవిష్యత్తును ఉజ్జ్వలంగా తీర్చిదిద్దడంపైనా నిధులు వెచ్చించలేని దుస్థితి తలెత్తుతుంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయమంతా చేసిన అప్పులపై వడ్డీ కట్టడానికే సరిపోయే సంకట స్థితి ఏర్పడవచ్చు. రుణభారం పెరిగినప్పుడు దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధి దెబ్బతిని కరెన్సీ విలువ పడిపోయి, రుణాలు ఎగవేయాల్సిన అగత్యం ఎదురుకావచ్చు. ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితి రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. ఎగుమతులకన్నా దిగుమతులు ఎక్కువైనప్పుడు పెరిగిపోయే వాణిజ్య లోటును తట్టుకోవడానికి ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి.

భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థలు, విదేశీ రుణదాతల నుంచే కాకుండా ప్రవాస భారతీయుల నుంచీ రుణాలు తీసుకుంటాయి. 2022 సెప్టెంబరులో ప్రపంచబ్యాంకు నుంచి గుజరాత్‌ ప్రభుత్వం 35 కోట్ల డాలర్ల రుణం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజారోగ్య సేవల మెరుగుదలకు, కౌమార ప్రాయంలోని బాలికల ఆరోగ్య సంరక్షణకు, వ్యాధులపై నిఘాకూ ఈ నిధులను వెచ్చిస్తుంది. అయితే, కొవిడ్‌ కాలంలో, ఆ తరవాత భారత్‌ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేదు కాబట్టి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నుంచి రుణాలు తీసుకోవలసిన పరిస్థితి తలెత్తలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్‌ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఎగుమతులకన్నా దిగుమతులు ఎక్కువై వాణిజ్య లోటును ఎదుర్కోవలసి రావడం. విదేశీ రుణభారం ఎక్కువైతే కరెన్సీ విలువపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి విదేశ మారక ద్రవ్య నిల్వలను వెచ్చించాల్సి వస్తుంది. ఫలితంగా ఆ నిల్వలు తరిగిపోతాయి. గడచిన రెండేళ్లలో భారత విదేశ ద్రవ్య నిల్వలు హెచ్చుతగ్గులను చవిచూశాయి. రూపాయితో పోలిస్తే డాలర్‌ విలువ పెరిగిపోవడమే ఇందుకు కారణం.

భారత్‌ పైనున్న విదేశీ రుణభారంలో 54 శాతం డాలర్ల రూపంలో తీసుకున్న రుణాలే. రూపాయల్లో తీసుకున్నవి 32 శాతమే. జపాన్‌ యెన్‌ల రూపంలో ఆరు శాతం, ఐఎంఎఫ్‌ ప్రత్యేక డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) రూపంలో నాలుగు శాతం, యూరోల రూపంలో మూడు శాతం, ఇతర కరెన్సీలలో ఒక శాతం రుణాలు తీసుకుంది. తన విదేశీ రుణాల్లో సగానికిపైగా డాలర్లలో తీసుకున్నవి కాబట్టి డాలర్‌ విలువ పెరిగినప్పుడల్లా భారతీయ రూపాయి విలువ పడిపోతోంది. స్వల్పకాలిక రుణాలను గడువులోపల తీర్చేయడానికి విదేశీ కరెన్సీ నిల్వలను కరిగించాల్సి వస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం భారత్‌ దీర్ఘకాలిక రుణాలు 6.1 శాతం పెరిగాయి. రుణాల వ్యవధి, వడ్డీ భారం, వేరే మార్గాల ద్వారా రుణ సేకరణకున్న అవకాశాలను పరిశీలించి ఉత్తమ మార్గాలను భారత్‌ ఎంచుకోవాలి. అధిక వడ్డీకి వేర్వేరు దేశాలు, సంస్థల నుంచి తీసుకున్న రుణాలను తీర్చేయడానికి ఒకచోట నుంచి స్వల్ప వడ్డీకి భారీ రుణం తీసుకోవాలి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి, రుణాలకూ మధ్య నిష్పత్తి చాలా ముఖ్యమైనది. జీడీపీకన్నా రుణాలు ఎక్కువగా ఉండకూడదు. జీడీపీ, రుణ నిష్పత్తిని తగ్గించడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి- ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవడం. తద్వారా బడ్జెట్‌ లోటును తగ్గించవచ్చు. రెండో మార్గం- యావత్‌ ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడం. దాదాపు అన్ని వస్తువులపై జీఎస్టీ విధించడం వల్ల 2022 అక్టోబరులో కేంద్రానికి రికార్డు స్థాయిలో రూ.1.51 లక్షల కోట్ల ఆదాయం లభించింది. కొవిడ్‌ వల్ల ప్రజల ఆదాయం తరిగిపోగా పన్ను భారం మాత్రం విపరీతంగా పెరిగిపోవడం గమనార్హం. ప్రజల గోళ్లు ఊడగొట్టి వసూలు చేస్తున్న జీఎస్టీ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మేలు చేయదు.

శ్రీరాం చేకూరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.