Gold Rates: బంగారం ధరల్లో ఏమిటీ గందరగోళం?
ఈనెలలో మంచి ముహూర్తాలు ఉండటంతో, వివాహాది శుభకార్యాల హడావుడి నెలకొంది.
నగరాల మధ్య 10 గ్రాములకు రూ.2,000 తేడానా!
పన్ను కలపకుండా చూపడమే ఇందుకు కారణం
అంతర్జాతీయ ధర- డాలర్ మారకపు ధరే కీలకం
ఈనాడు వాణిజ్య విభాగం
ఈనెలలో మంచి ముహూర్తాలు ఉండటంతో, వివాహాది శుభకార్యాల హడావుడి నెలకొంది. ఇందుకోసం తప్పనిసరిగా మహిళలకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాల్సిందే. బంగారం ధర ఎలా ఉంది.. కాస్త తగ్గితే వెంటనే దుకాణానికి వెళ్లి, కొనుగోలు చేద్దామనుకున్న విజయవాడ వాసి వెంకట్రావు రోజూ ప్రసార మాధ్యమాలను పరిశీలిస్తున్నాడు. ‘విజయవాడ కంటే హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.2000కు పైగా తక్కువగా ఉంద’ని చూడటంతో వెంటనే బయలుదేరి హైదరాబాద్‌లోని ప్రముఖ ఆభరణాల విక్రయశాలలకు వెళ్లాడు. ఎక్కడకు వెళ్లినా, ఆభరణం బిల్లు కొటేషన్ చూస్తే, ధర పరంగా తమ ప్రాంతం స్థాయిలోనే ఉంది. మరి ప్రకటనలకు, వాస్తవ ధరలకు తేడా ఎక్కడొచ్చిందంటే.. కొన్ని ప్రాంతాల్లోని ఆభరణాల విక్రయదారులు జీఎస్‌టీ కలపకుండా బంగారం ధరను ప్రకటిస్తున్నందునే, తక్కువ ఉన్నట్లు కనపడుతోంది.
అంతర్జాతీయ ధరలకు అనుగుణంగానే
బంగారం, వెండి.. వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే, ఇక్కడా పెరుగుతుంది.. తగ్గినా అంతే.. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున, డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. జీఎస్‌టీ రేటు దేశం మొత్తం ఒకటే ఉంటుంది కనుక ధరలో పెద్దగా తేడా రాదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, స్థానిక టోకు వ్యాపారులకు మేలిమి బంగారం బిస్కెట్లు, వెండి దిమ్మలు అందించే బ్యాంకుల వంటి సంస్థలు విధించే ఛార్జీలు, రవాణా ఛార్జీలు, ఇతర వ్యయాల రూపేణ స్వల్పతేడాలు మాత్రమే ఉంటాయి.
ఎంఆర్‌పీ ఉండదు కనుక
ఒక వస్తువు గరిష్ఠ విక్రయ ధర (ఎంఆర్‌పీ)లో అన్ని పన్నులు కలుపుకుని ఉంటాయి. అంతకుమించి విక్రయించకూడదు. బంగారం ధర మార్కెట్ ప్రకారమే నడుస్తుంది. పన్నులు-సుంకాలు కలిపి చూపిన ప్రాంతాల్లో బంగారం ధర అధికంగా ఉంటోంది.. కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ఆయా దుకాణాలు, విక్రయ సంస్థల సంఘాలు ప్రకటించినప్పుడు తక్కువగానే కనపడుతోంది. ఆభరణం నచ్చి, బిల్లు వేయమన్నప్పుడు, పన్నులు/సుంకాలు కలిపితే.. ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒకటే ధర అవుతుంది. ఆభరణం తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికీ తేడా ఉంటుంది.
ఇలా చూసుకోవాలి
అంతర్జాతీయ విపణిలో మేలిమి (999 స్వచ్ఛత -24 క్యారెట్లు) బంగారం ధరను ఔన్సు (31.10 గ్రాముల)ల్లో లెక్కిస్తారు. ఇది శనివారం 1798.40 డాలర్లుగా ఉంది. డాలర్ విలువ రూ.81.43 కనుక, రూపాయల్లో ఔన్సు బంగారం ధర రూ.1,46,444 అవుతుంది. అంటే గ్రాము సుమారు రూ.4708గా తేలుతుంది. దీనికి కస్టమ్స్, ఇతర సుంకాలు 15 శాతం, 3 శాతం జీఎస్‌టీ అంటే మొత్తం 18 శాతం పన్నులను కలిపి గ్రాము రూ.5530 అవుతుంది. అంటే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.55300 గా చెప్పాలి. కొన్ని సంఘాలు మాత్రం 3 శాతం జీఎస్‌టీని కలపకుండా రూ.53,700గా ప్రకటిస్తున్నారు. అందువల్ల బిల్లుతో కొంటే, ధరలో తేడానే రాదు.
ఆభరణాల లెక్క ఇలా
బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు/916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6 శాతంతో గుణిస్తే సరిపోతుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.55,300 అయితే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,654 అవుతుంది. అంటే గ్రాము ఆభరణం ధర రూ.5065 అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సెవరు (8 గ్రాముల) లెక్క ఎక్కువగా చూస్తుంటారు. అంటే రూ.40,520 అవుతుంది. మనకు దుకాణాల్లో ఆభరణాల బంగారం గ్రాము ధర ఇంతకన్నా తక్కువ అని చెప్పినా, బిల్లింగ్‌లో 3 శాతం జీఎస్‌టీ చెల్లించక తప్పదు. అందువల్ల ధర తక్కువగా ఉందని వెళ్లి, ఉసూరు మనకూడదంటే, ముందుగా ధరలను జాగ్రత్తగా పరిశీలించుకోవడం మేలు.
తరుగు/వ్యాల్యూ యాడెడ్ భారమే అధికం
చెవి రింగుల నుంచి వడ్డాణం వరకు ఆభరణం ఏది తీసుకున్నా, తరుగు, మజూరీ (మేకింగ్ ఛార్జీ) లేదా వ్యాల్యూయాడెడ్ కింద 8-36 శాతం వరకు కూడా ఆభరణాల విక్రయ సంస్థలు వసూలు చేస్తుంటాయి. అంటే మనం 10 గ్రాముల బంగారు ఆభరణం కొనేందుకు మరో (0.8-3.6 గ్రాముల) బంగారానికి వాళ్లకు డబ్బులు చెల్లిస్తున్నాం అన్న మాట. ఇవి కలిపాకే జీఎస్‌టీ కూడా వసూలు చేస్తే, మనకు మరింత నష్టం తప్పదు. తరుగు అంటే మనకు రాని బంగారం, దీనిపైనా జీఎస్‌టీ వసూలు చేయడం తగదనే వినియోగదారుల సంఘాలు పేర్కొంటున్నాయి.
జీఎస్‌టీ కట్టాల్సిన బాధ తప్పుతుందని బిల్లు లేకుండా కొంటే..
కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తాం.. అప్పుడు 3 శాతం జీఎస్‌టీ కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. అయితే బిల్లు లేకుండా కొంటే, ఒకవేళ బంగారం నాణ్యత సరిగా లేకుంటే, భారీగా నష్టపోక తప్పదు. ఆభరణం మరమ్మతులకూ బాధ్యత వహించరు. పైగా బంగారం విలువలో అప్పటికే జీఎస్‌టీ కలిపి ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి.
* బంగారం ధర తెలుసుకునేందుకు క్యాప్స్‌గోల్డ్, ఎస్‌వీబీసీ, డీపీగోల్డ్ వంటి బులియన్ ట్రేడింగ్ వెబ్‌సైట్లను పరిశీలించొచ్చు. వీటిల్లో పన్నులన్నీ కలిపిన ధరలు కనపడుతుంటాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ED: మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో కేజ్రీవాల్, కవిత పేర్లు
-
Crime News
కారు ప్రమాదం.. కళ్లముందే నిండు గర్భిణీ, భర్త సజీవదహనం
-
World News
Mossad: ఇరాన్ క్షిపణి స్థావరంపై మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్..!
-
Politics News
nara lokesh-yuvagalam: కొత్త కంపెనీ వచ్చిందా? ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా?: నారా లోకేశ్
-
Sports News
Hardik: ధోనీ పోషించిన బాధ్యత నాపై ఉంది.. ఒక్కోసారి కాస్త నిదానం తప్పదు: హార్దిక్
-
Movies News
Social Look: క్యాప్షన్లేని రష్మిక ఫొటోలు.. కేతిక ‘ఫిబ్రవరి ఫీల్స్’!