పైకి ఆంక్షల కొరడా.. లోన కొనుగోళ్ల వరద
పుతిన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలి...రష్యాను ఏకాకిని చేయాలి...వారి ఆర్థిక వ్యవస్థను అల్లాడించాలి...యుద్ధానికి డబ్బులేకుండా చేయాలి...అంటూ అమెరికా, ఐరోపా మిత్రదేశాలు రష్యాపై భారీ ఆంక్షలు విధించాయి.
కోపగిస్తూనే రష్యాతో వ్యాపారం చేస్తున్న పాశ్చాత్య దేశాలు
అందులో ఐరోపాదే అగ్రభాగం
పుతిన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలి...
రష్యాను ఏకాకిని చేయాలి...
వారి ఆర్థిక వ్యవస్థను అల్లాడించాలి...
యుద్ధానికి డబ్బులేకుండా చేయాలి...
అంటూ అమెరికా, ఐరోపా మిత్రదేశాలు రష్యాపై భారీ ఆంక్షలు విధించాయి. వీటి దెబ్బకు రష్యా ఆర్థికంగా కుప్పకూలి కాళ్లబేరానికి వస్తుందనుకున్నాయి. రోజుకో ఆంక్షల పేరుతో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమై 10 నెలలు కావస్తున్న వేళ... మరి ఆంక్షలు ప్రభావం చూపించాయా? రష్యా వాణిజ్యం దెబ్బతిందా అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తోంది. కారణం- ఆంక్షలు విధించిన ఐరోపా, అమెరికాలే మాస్కో వాణిజ్యాన్ని నిలబెడుతున్నాయి. ఒకవంక ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తూ... మరోవైపు రష్యా నుంచి సింహభాగం గ్యాస్, చమురు ఇతర కొనుగోళ్లు చేస్తూ ఆ దేశ ఖజానాను కళకళలాడిస్తున్నాయి.
సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ, క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ) అనే ఐరోపా స్వచ్ఛంద పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం... రష్యా ఆర్థిక వ్యవస్థ యుద్ధ సమయంలో, ఆంక్షల కాలంలోనూ సజావుగానే సాగుతోంది. దీనికంతటికీ మూలకారణం- ఐరోపా దేశాల చమురు, గ్యాస్ అవసరాలే! వాటికోసం ఆ దేశాలు రష్యాపై ఆధారపడి ఉండటమే! ఆంక్షల కారణంగా విదేశాలకు రష్యా నుంచి వివిధ వస్తువుల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. అయినా వారి ఖజానా మాత్రం గలగలమంటోంది. ఎందుకంటే... శిలాజ ఇంధనాల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరగటమే. రష్యా ఆదాయం శిలాజ ఇంధనాల (ముడిచమురు, పైప్‌లైన్ గ్యాస్, చమురు ఉత్పత్తులు, ఎల్‌ఎన్‌జీ గ్యాస్, బొగ్గు) అమ్మకాల ద్వారా వస్తుంది. నిరుటితో పోలిస్తే... గత 8 నెలల్లో రష్యా సగటు ఎగుమతుల ధరలు 60 శాతం ఎక్కువగా ఉన్నాయనేది సీఆర్‌ఈఏ అంచనా! ఈ నివేదిక ప్రకారం...
* ఆంక్షలు విధించిన తొలి నాళ్లలోనే రష్యా విక్రయించిన శిలాజ ఇంధనాల్లో ఐరోపా సమాఖ్య వాటా 61 శాతం. వీటి విలువ 60 బిలియన్ డాలర్లు!
* మార్చిలో ఆంక్షలు విధించగా... ఇప్పటిదాకా ఐరోపా సమాఖ్యకు ఇంధన ఎగుమతులు రష్యా నుంచి సాగుతూనే ఉన్నాయి.
* రష్యా నుంచి వస్తున్న వందలాది ఎల్‌ఎన్‌జీ (గ్యాస్) ఓడలు ఐరోపాలోని అనేక రేవుల్లో దర్శనమిస్తున్నాయి. వస్తోంది రష్యా నుంచని తెలిసి కూడా ఆ గ్యాస్ కోసం ఐరోపా దేశాలన్నీ ఆవురావురుమంటున్నాయి. శీతాకాలపు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రష్యా నుంచి భారీగా కొనుగోళ్లు చేశాయి.
* చలికాలంలో తమ అవసరాలకు తగినంత ఇంధనాన్ని సమకూర్చుకొని, నిల్వలు నిండిపోయాక, ఇక దాచి పెట్టుకోవటానికి వీలులేదనే స్థితికి వచ్చాక ఇప్పుడు సోమవారం (డిసెంబరు 5) చివరి నుంచి రష్యా ముడి చమురు దిగుమతిని ఆపేస్తున్నట్లు ప్రకటించాయీ దేశాలు. రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులను ఫిబ్రవరి తర్వాత నిలిపేస్తామని చెబుతున్నాయి.
* 2022 ఫిబ్రవరి నుంచి సెప్టెంబరు దాకా ఇంధన ఎగుమతుల ద్వారా రష్యా 158 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించింది. ఇందులో ఐరోపా దేశాల ఇంధన దిగుమతుల విలువ 100 బిలియన్ యూరోలు దాటింది.
* సగటున రోజూ 260 మిలియన్ యూరోల మేర ఐరోపా దేశాలు రష్యా నుంచి కొనుగోళ్లు చేస్తున్నాయి.
* తాజాగా గత నెలలో రష్యా చమురు ఎగుమతుల్లో భారీ పెరుగుదల నమోదైంది. కారణం... ఐరోపా! 2021 నవంబరులో కంటే ఎక్కువ మొత్తంలో రష్యా నుంచి చమురును ఐరోపా దేశాలు ఈ నవంబరులో కొనుగోలు చేశాయి. ముఖ్యంగా జర్మనీ, ఇటలీలు భారీస్థాయిలో కొన్నాయి.
* వీటితో పాటు చైనా, భారత్, యుఏఈ, తుర్కియే, మలేసియా, సింగపూర్‌లు కూడా పెద్దమొత్తంలో చమురును రష్యా నుంచి కొనుగోలు చేశాయి. ధరలు తగ్గినా... రష్యా ఒక్క నవంబరులోనే 18 బిలియన్ డాలర్ల మేర చమురును ఐరోపా బయట అమ్మగలిగింది.
* రష్యా ముడి చమురు కొనుగోలును తాజాగా డిసెంబరు 5 నుంచి ఐరోపా, అమెరికాలు నిషేధించాయి. కానీ అదే రష్యా ముడి చమురు తుర్కియేకి చేరి, అక్కడి కర్మాగారాల్లో శుద్ధి అయి వివిధ రూపాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంటోంది. దాన్ని ఐరోపా, అమెరికాలు కొనుగోలు చేస్తుండటం విశేషం.
డిస్కౌంట్ ఇచ్చి మరీ...
* అమెరికా, ఐరోపాలు ఆంక్షలు విధించటంతో రష్యా కొత్త దారులు వెదుక్కుంది. తన మిత్రదేశాలైన చైనా, భారత్, తుర్కియేలకు భారీ డిస్కౌంట్లు ఇచ్చింది. దీంతో ఈ దేశాలు కూడా భవిష్యత్ అవసరాలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని గతంకంటే ఎక్కువ మొత్తంలో రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నాయి.
* 2021లో ఏడాదంతా కలపి 12 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును రష్యా నుంచి కొనుగోలు చేసిన భారత్... ఈసారి ఆరునెలల్లోనే 60 మిలియన్ బ్యారెళ్లు దిగుమతి చేసుకుంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Australian open: కెరీర్ చివరి మ్యాచ్‌లో సానియాకు నిరాశ.. మిక్స్డ్ డబుల్స్‌లో ఓటమి
-
India News
జన్మభూమి సేవలో అజరామరుడు.. కానిస్టేబుల్ అహ్మద్ షేక్‌కు మరణానంతరం శౌర్యచక్ర
-
Ap-top-news News
Andhra News: కల్యాణ మండపంలో కలకలం.. ఉన్నట్లుండి ఊడిపోయి పైకి లేచిన ఫ్లోరింగ్ టైల్స్
-
Crime News
Crime News: బ్రెయిన్ మ్యాపింగ్‌తో హత్య కేసులో నిందితుల గుర్తింపు
-
Politics News
Balakrishna: బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం
-
Sports News
MS Dhoni: కొబ్బరి బొండం పట్టుకుని.. టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి..