Digital rupee: డిజిటల్‌ రూపాయితో యూపీఐకి మించి ప్రయోజనాలు

డిజిటల్‌ రూపాయిని వ్యక్తిగత అవసరాలకూ వినియోగించే ప్రయోగాత్మక ప్రాజెక్టును ఆర్‌బీఐ 4 నగరాల్లో ప్రారంభించింది.

Updated : 12 Dec 2022 14:53 IST

ఈనాడు వాణిజ్య విభాగం

డిజిటల్‌ రూపాయిని వ్యక్తిగత అవసరాలకూ వినియోగించే ప్రయోగాత్మక ప్రాజెక్టును ఆర్‌బీఐ 4 నగరాల్లో ప్రారంభించింది. ఇప్పటికే మన బ్యాంక్‌ ఖాతాలో నగదు ఉంటే, ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లో అత్యంత సులువుగా చేసేందుకు యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) వీలు కల్పిస్తోంది. డిజిటల్‌ రూపాయితో అంతకన్నా అదనపు ప్రయోజనాలున్నాయా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది.

‘భారతీయులు యూపీఐ పద్ధతిలో టీ బడ్డీ నుంచి వాహన షోరూంల వరకు చెల్లింపులు తక్షణం, సులభంగా, సురక్షితంగా చేయగలుగుతున్నారు. క్షణాల్లో నగదు బదిలీ చేస్తున్నారు. అందువల్ల రిటైల్‌ డిజిటల్‌ రూపాయి (ఇRs-ఆర్‌)/ కేంద్ర బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)పై అంతగా ఆసక్తి కనబడకపోవచ్చ’ని ఐఎమ్‌ఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) తాజా నివేదికలో పేర్కొంది. అయితే విదేశీ వాణిజ్యాన్ని సాధ్యమైన మేర రూపాయల్లో నిర్వహించుకుంటే, విదేశీ మారక ద్రవ్య రూపేణ వ్యయాలు ఆదా అవుతాయనే భావన ఉంది. ఈ ప్రక్రియను డిజిటల్‌ రూపాయి మరింత సులభతరం చేస్తుందని చెబుతున్నారు.

* దేశీయంగా యువతలో 84% మంది; మొత్తం ప్రజల్లో 76% మంది యూపీఐని వినియోగిస్తున్నారు. లావాదేవీకి అదనపు వ్యయం లేకపోవడం ఇందులో ప్రధాన ఆకర్షణ. అదే కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితే, చార్జీలు పడుతున్నాయి.

అదనపు ప్రయోజనాలు ఇలా

1) నోట్లు, నాణేలకు ప్రత్యామ్నాయంగా, అదే విలువ కలిగిన డిజిటల్‌ రూపాయలు లభిస్తాయి. బ్యాంక్‌ ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకున్నట్లే వీటిని బ్యాంక్‌ ఖాతా నుంచి ఉపసంహరించి, డిజిటల్‌ (ఇ) వాలెట్‌ రూపంలో మొబైల్‌ఫోన్‌లో నిల్వ చేసేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి. అందువల్ల ఖాతాతో పని లేకుండా, లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
* ప్రస్తుతం రెండు బ్యాంకుల్లో ఖాతాలుంటే, ఆ ఖాతాల్లోని నగదు ఆధారంగా వేర్వేరు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. డిజిటల్‌ రూపాయలైతే, రెండు బ్యాంకు ఖాతాల నుంచి ఒకే ఇ-వాలెట్‌కు బదిలీ చేసుకోవచ్చు.

2) వేరేవారి కార్డు ద్వారా ఏటీఎం నుంచి నగదును మోసపూరితంగా అపహరిస్తే, ఆ నగదు ఎక్కడకు చేరిందో గుర్తించడం కష్టం. డిజిటల్‌ వాలెట్‌ ద్వారా  ప్రతి రూపాయిని పర్యవేక్షించుకోవచ్చు. ఏ లావాదేవీకి ఎంత వాడారో తెలిసిపోతుంది.

3) పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పేతో పోలిస్తే..

ప్రస్తుతం ఒక బ్యాంక్‌ ఖాతా నుంచి వేరొక బ్యాంక్‌ ఖాతాకు నగదు బదిలీకి ప్రయత్నించారనుకుందాం. ఈ నగదు బదిలీ కాకపోతే, ఎవరి వైఫల్యమో సంబంధిత బ్యాంక్‌ కాంటాక్ట్‌ నెంబరును కనుక్కుంటే తెలిసిపోతుంది. సంబంధితులను సంప్రదిస్తే, సత్వరం మన ఖాతాకు నగదు చేరుతుంది. ఖాతాలకు సంబంధించిన వివరాలన్నీ నమోదై ఉండటం వల్ల, ఈ లావాదేవీల్లో వైఫల్యం తక్కువ. డిజిటల్‌ రూపాయలు కూడా సార్వభౌమ నిధి కనుక, లావాదేవీలకు బ్యాంకులే బాధ్యత వహిస్తాయి. వాలెట్‌ నుంచి వాలెట్‌కు లావాదేవీ జరుగుతుంది కనుక నగదు చేతికి అందించినంత సులభంగా ఇది ఉంటుంది. లావాదేవీల వ్యయాలు సైతం తగ్గుతాయని అంచనా.
* అదే పేటీఎం, ఫోన్‌పే వంటి థర్డ్‌ పార్టీ యాప్‌ల ద్వారా చేసినప్పుడు.. ముందుగా మన బ్యాంక్‌ ఖాతాకు చెల్లింపు అభ్యర్థన వెళ్తుంది. అక్కడ నుంచి ఎవరికి చెల్లింపు జరగాలో, ఆ బ్యాంక్‌ ఖాతాకు సమాచారం, నగదు బదిలీ అవ్వాలి. ఇందుకు మధ్యవర్తిత్వ సంస్థలుంటాయి. లావాదేవీ విఫలమైతే, సంబంధిత యాప్‌లను సంప్రదించమని బ్యాంకులు చెబుతున్నాయి.

4) డిజిటల్‌ రూపాయలతో పన్నుల వంటివీ చెల్లించవచ్చు. లావాదేవీలకు ఎటువంటి రుసుములు ఉండవు.

5) అంతర్జాతీయ లావాదేవీలకు..: ప్రస్తుతం విదేశాల్లో కుటుంబీకులు ఉండటం సాధారణమైంది. విద్యార్థులు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్తున్నారు. వారికి అంతర్జాతీయ నగదు బదిలీలను సైతం డిజిటల్‌ కరెన్సీ రూపంలో సులువుగా జరపొచ్చు. రూపాయల్లో ఎగుమతి, దిగుమతి లావాదేవీలు జరిపేందుకూ డిజిటల్‌ రూపాయి ఉపయోగ పడుతుంది.

6) రూ.5000 కోట్ల ఆదా?: ఏటా నగదు ప్రింటింగ్‌కు రూ.5,000 కోట్ల ఖర్చు అవుతోంది. పైగా కాగితం తయారీ కోసం వేలకొద్దీ చెట్లు నరకాల్సి వస్తోంది. భారీ స్థాయిలో ఇంకు వినియోగం జరుగుతోంది. ఈ ఇంకును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. డిజిటల్‌ కరెన్సీకి మారితే వీటిలో అధికభాగం ఆదా అవుతుంది.

ఎలా ఉపయోగించొచ్చు..

డిజిటల్‌ రూపాయల కోసం సీబీడీసీ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మన బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్‌ నంబరుతోనే దీనిలో వివరాలు నమోదు చేసుకోగలం. తదుపరి డిజిటల్‌ వాలెట్‌, యునీక్‌ ఐడీ మనకు క్రియేట్‌ అవుతుంది. దీనిలోకి మన ఖాతా నుంచి నగదును కోరుకున్న డినామినేషన్‌లో జమ చేసుకోవచ్చు. రూ.500 విలువకు సమానవైనవి ఎన్ని, రూ.100, రూ.50, రూ.10 ఇలా మన అవసరం మేర జమ చేసుకోవచ్చు. వ్యక్తి నుంచి వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి చెల్లింపులు చేయొచ్చు. క్యూఆర్‌ కోడ్‌లనూ ఉపయోగించుకోవచ్చు. డిజిటల్‌ రూపాయిని వాణిజ్య బ్యాంకుల ద్వారా నగదు రూపంలోకీ మార్చుకోవచ్చు. 

క్రిప్టోకు దీనికి తేడా ఏమిటి?

క్రిప్టోకరెన్సీలపై ఎటువంటి నియంత్రణ ఉండదు. మనీ లాండరింగ్‌కు, ఉగ్రవాదులకు నిధులు అందించేందుకు వీలుంటుంది. ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థనే ఇవి సృష్టిస్తాయి. సీబీడీసీ అధీకృత కరెన్సీ కనుక ఆర్థిక వ్యవస్థ పరిధిలోనే ఉంటుంది. ప్రజలకు ఎటువంటి నష్టభయం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని