Budget 2023: మధ్యతరగతి ఆశల పద్దు
ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈశాన్యంలో మూడు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది.
ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈశాన్యంలో మూడు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. వచ్చే సంవత్సరం లోక్‌సభ సమరమూ జరగనుంది. ఈ తరుణంలో రాబోయే కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతిని ఆకర్షించడంపై ఆర్థిక మంత్రి అధికంగా దృష్టి సారించే అవకాశం ఉంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన వరసగా అయిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా భారీ లెక్కలతో, అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపే కేంద్ర బడ్జెట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. అందులో అధికార పక్షం రాజకీయ ప్రయోజనాలూ ఇమిడి ఉంటాయన్నది కాదనలేని సత్యం. తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతో కలిపి తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల పోరు కొనసాగనుంది. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో ఈ విషయాన్ని విస్మరించడం ఆర్థిక మంత్రికి వీలు కాని అంశం. రాబోయే కేంద్ర పద్దులో దేశంలో పెద్దసంఖ్యలో ఉన్న మధ్యతరగతికి ఉపశమనం కల్పించడానికి నిర్మల ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
పడిపోయిన ఎగుమతులు
ప్రపంచ దేశాల్లో మాంద్యం పరిస్థితులు, కరోనా విజృంభణ కుదిపేస్తుంటే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిలకడగా సాగుతుండటం హర్షణీయం. ఇటీవల ఇండియా వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు గతంలో ప్రకటించిన 6.7శాతం నుంచి 6.9శాతానికి పెంచింది. పూర్తిస్థాయిలో ఏడు శాతం వృద్ధిరేటుపై కేంద్రం భరోసాగా ఉంది. జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) సైతం తాజాగా భారత ఆర్థిక వ్యవస్థ ఏడుశాతం వృద్ధిరేటు సాధిస్తుందని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధిరేటు 6.8శాతం ఉంటుందని రిజర్వు బ్యాంకు అంచనా వేసింది. మరోవైపు పన్ను రాబడి పెరగడమూ సానుకూల పరిణామం. ప్రస్తుతం నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్ల దాకా ఉంటున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో నిరుడు ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల ధరలు అమాంతం ఎగబాకాయి. దాంతో వినియోగదారుల ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించిన నాలుగు-ఆరు శాతాన్ని మించిపోయింది. ఫలితంగా వడ్డీ రేట్లను ఆర్‌బీఐ పెంచాల్సి వచ్చింది. ప్రస్తుతం ఐరోపాలో మాంద్యం, చైనాలో ఆర్థిక మందగమనం వల్ల వంట నూనెల ధరలు దిగివచ్చాయి. వినియోగదారుల ద్రవ్యోల్బణం సైతం తగ్గుముఖం పట్టి 5.8శాతానికి చేరింది. కరెంటు ఖాతా లోటు మాత్రం నానాటికీ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ముడి చమురు, ఇతర సరకుల దిగుమతుల బిల్లు పెరిగిపోతుంటే, ఇండియా నుంచి ఎగుమతులు మాత్రం కుంచించుకుపోతున్నాయి. ఐరోపాలో ఆర్థిక మాంద్యం, అమెరికాలో ఆర్థిక మందగమనం భారత ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుంటే, ఆ దేశం నుంచి ఇండియాకు ఎగుమతులు మాత్రం పెద్దమొత్తంలో ఉంటున్నాయి. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థపై సరైన దృష్టి పెడుతూ విభిన్న వర్గాల ఓటర్లను, ముఖ్యంగా మధ్య తరగతిని ఆకట్టుకునేలా బడ్జెట్ రూపకల్పనలో నిర్మల జాగ్రత్తలు తీసుకోవచ్చు.
కీలక మార్గాలు
సంప్రదాయంగా మధ్యతరగతి అధికంగా భారతీయ జనతా పార్టీకే మద్దతు పలుకుతోంది. మోదీ ప్రభుత్వ బడ్జెట్లు తమను అంతగా పట్టించుకోవడం లేదని ఆ వర్గం ఒకింత అసహనంగా ఉంది. జనాభాలో మూడింట ఒకవంతు మధ్యతరగతే. రాబోయే బడ్జెట్లో వారికి ఉపశమనం కలిగించే మార్గాల్లో మొదటిది- పన్ను మినహాయింపు పరిమితులను పెంచడం. ప్రస్తుతం వయోవృద్ధులకు తమ ఆదాయంలో మూడు లక్షల రూపాయలు, ఇతరులకు రూ.2.5 లక్షల మేర పన్ను మినహాయింపు ఉంది. దాన్ని వరసగా అయిదు లక్షల రూపాయలు, నాలుగు లక్షల రూపాయలకు పెంచవచ్చు. పింఛన్, వార్షిక ఆదాయాలపై పన్నులను ఎత్తివేయడం రెండో అంశం. ఇక మూడోది, అత్యంత ప్రధానమైంది- ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్-80సి కింద ఆయా ఖర్చులు, పొదుపులపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం. ఆఖరిసారి దాన్ని 2014లో సవరించారు. అప్పటితో పోలిస్తే ద్రవ్యోల్బణం ప్రస్తుతం ఇంతలంతలైంది. ఆ పరిమితిని ఇప్పుడు ఉన్న రూ.1.5 లక్షల నుంచి మూడు లక్షల రూపాయలకు పెంచాల్సిన అవసరం ఉంది. గృహ రుణాలపై వడ్డీ రేటు మినహాయింపు పరిమితిని పెంచడమూ మధ్యతరగతిని ఆకట్టుకోవడానికి తోడ్పడుతుంది. ప్రస్తుతం ఉన్న రెండు లక్షల రూపాయల పరిమితి చాలా తక్కువ. కరోనా తరవాత దేశీయంగా ఆరోగ్య బీమాలు భారీగా పెరిగాయి. వాటి ప్రీమియాలపై పన్నులను పూర్తిగా తొలగించడం వల్ల ఎంతోమందికి లబ్ధి చేకూరుతుంది. ఎన్నికల తరుణంలో మధ్యతరగతిని మచ్చిక చేసుకోవడానికి రాబోయే బడ్జెట్‌లో వీటిపై కేంద్ర ఆర్థిక మంత్రి ప్రత్యేక దృష్టి సారించవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!